Breaking News

08/06/2019

అంతా మోసమే.. (పశ్చిమగోదావరి)

ఏలూరు, జూన్ 8 (way2newstv.in): 

వేసవిలో ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మంచినీటి శుద్ధజల కేంద్రాలు జనారోగ్యంతో ఆటలాడుకుంటున్నాయి. జిల్లాలో అనేక చోట్ల పుట్టగొడుగుల్లా వెలిసిన నీటి శుద్ధి కేంద్రాలు ఎటువంటి నిబంధనలు పాటించకుండా... ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఫౌండేషన్‌ పేర్లతో విద్యుత్తు అధికారుల రాయితీలు పొందుతూ నీటి అక్రమ వ్యాపారానికి తెరతీస్తున్నాయి. జిల్లాలో గత పదేళ్లుగా ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. మూడు సంవత్సరాలుగా ఈ తరహా వ్యాపారాలు మరింత ఊపందుకున్నాయి. ఎటువంటి నిబంధనలు 
పాటించకుండా నీటిలో తీపిని పెంచేందుకు ప్రాణాంతక మందులు అనుభవం లేని వ్యక్తులతో కలిపించేసి ప్రజలకు అంటగట్టేస్తున్నారు. శుద్ధి నీటి పేరిట డబ్బులు పెట్టి నీటితో పాటు రోగాలు కొనుక్కుని ఆసుపత్రి పాలవుతున్నారు.ప్రకృతి ప్రసాదించిన నీటిని నేడు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి అన్ని చోట్లా చోటుచేసుకుంది. పట్టణాల నుంచి పల్లెలకు సైతం నీటిని కొనుగోలు చేసి తాగే విధానం పాకడంతో అన్ని చోట్లా విచ్చలవిడిగా ప్లాంట్లు వెలిశాయి. దీంతో నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. 


అంతా మోసమే.. (పశ్చిమగోదావరి)
జిల్లాలో అనేక ప్లాంటులకు అనుమతులే లేవు. అనుమతులు తీసుకునే విషయంలో పలు శాఖల అధికారులకే స్పష్టత లేకపోవడంతో వీరి ఆటలు సాగుతున్నాయి. జిల్లాలో మొత్తం 40 లక్షల మంది జనాభా ఉన్నారు. సుమారు 15 లక్షల కుటుంబాలు ఉన్నాయి. సగటున మనిషి ప్రతి రోజుకు రెండు నుంచి మూడు లీటర్లు నీటిని తాగినా కుటుంబంలో నలుగురు ఉంటే 12 లీటర్లు అవసరం అవుతున్నాయి. అంటే కుటుంబంలో రోజున్నరలో 20 లీటర్లు నీటిని తాగేస్తున్నారు. కూలింగు లేని నీటిని డబ్బా రూ.10 నుంచి 15 వరకూ విక్రయిస్తున్నారు. అదే కూలింగుతో రూ. 30 నుంచి రూ.35 వరకూ విక్రయాలు చేస్తున్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటర్‌ ప్లాంట్ల ద్వారా ఇచ్చే నీటిలో ఖనిజాలు సంపూర్ణంగా ఉండాలి. వాటిలో మిల్లీ గ్రాము కాపర్, 0.3 గ్రాముల ఇనుము, 45 మిల్లీ గ్రాముల నైట్రేట్, 250 మిల్లీ గ్రాముల సల్ఫేట్, 200 మిల్లీ గ్రాముల క్లోరైడ్‌ ఉండాలి. నీటిలో వీటిని శుద్ధి చేసేందుకు ప్రతి వాటర్‌ ప్లాంట్లలో శాండ్‌ ఫిల్టరేషన్, మిక్సిడ్‌ బెడ్, డీమినరలైజేషన్, యాక్టివేటేడ్‌కార్బన్, తదితర దశలు ఉండి తీరాలి. వీటిలో చాలా వరకూ లేకుండానే ఎటువంటి ప్రమాణాలు పాటించకుండానే ప్లాంట్లులో ఏర్పాటు చేసుకున్న ట్యాంకుల ద్వారా డబ్బాల్లో నీటిని పట్టి విక్రయాలు చేస్తున్నారు. మనం తాగేది నిజమైన శుద్ధి నీరు అనుకుని ప్రజలు డబ్బులు చెల్లించి నీటిని మహా ప్రసాదంలా కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. పల్లెల్లో ఏర్పాటు చేసుకుంటున్న మంచినీటి ప్లాంట్లు ఏర్పాటుకు గ్రామపంచాయతీలు అనుమతులు ఇస్తాయి. అదే పట్టణాల్లో అయితే ఎటువంటి అనుమతులు ఉండటం లేదు. పురపాలకాల్లో అధికారులు మాత్రం డీ అండ్‌ వో ఫీజును వసూలు చేస్తారు. ఈ తరహా ఫీజు కేవలం వ్యాపార నిమిత్తం చెల్లించే పన్ను మాత్రమే. మంచినీరు అమ్ముకునేందుకు ఏమాత్రం ఉపయోగపడదు. కాని నీటి వ్యాపారులు మాత్రం ఇదే అనుమతి పత్రం... ఇవే అధికారుల నిబంధనలు అంటూ దర్జాగా అమ్మేసుకుంటున్నారు.

No comments:

Post a Comment