Breaking News

08/06/2019

పల్లెల్లో మార్పులు (శ్రీకాకుళం)

శ్రీకాకుళం, జూన్ 8(way2newstv.in): 

గ్రామ స్థాయిలో పౌరులకు సేవల అందించే పంచాయతీ వ్యవస్థలో రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీరు, విద్యుత్తు, రహదారులు, కాలువలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించే పంచాయతీల్లో ఇకపై అన్ని శాఖల పరిధిలో సేవలు అక్కడే అందేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న పంచాయతీలను గ్రామ సచివాలయాలుగా మార్చే దిశగా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విధివిధానాలు వచ్చిన వెంటనే ఆ దిశగా ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి. గ్రామస్థాయిలో ప్రజలకు పింఛన్లు, రేషను కార్డులు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, తదితర పథకాలు సచివాలయాల ద్వారా మంజూరు కానున్నాయి. 


పల్లెల్లో మార్పులు (శ్రీకాకుళం)
ప్రజలు ఇక్కడ దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో మంజూరు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకాలకు ప్రజలకు దక్కేలా వలంటీర్లు బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది. సచివాలయాల్లో పాలన కోసం ప్రతి పంచాయతీలో అదే పంచాయతీకి చెందిన 10 మందికి ఉద్యోగ అవకాశం కల్పించనున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరును నియమిస్తారు. జిల్లాలో ప్రస్తుతం 1141 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం ప్రకటించిన విధంగా సచివాలయాలుగా మార్చి ఒక్కో చోట కొత్తగా 10 మంది చొప్పున నియమిస్తే...11,410 మంది ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 6.50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీరికి ప్రభుత్వ పథకాలు చేరవేసేందుకు ప్రతి కుటుంబానికి ఒక గ్రామ వలంటీరును ప్రభుత్వం నియమించనుంది. ఈ విధానం ఆగష్టు 15 నాటికి అమలులోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన గ్రామ సచివాయాలయాలు ఏర్పడి వాటికి గ్రామవలంటీర్లను అనుసంధానం చేస్తే ప్రస్తుతం జిల్లాలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు చేరువ చేసేందుకు దాదాపు 13 వేల మంది వరకు గ్రామవలంటీర్లును నియమించాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment