Breaking News

17/06/2019

ఇదేం కష్టం..? (మహబూబ్ నగర్)

నాగర్‌కర్నూల్‌ , జూన్ 17  (way2newstv.in): 

జిల్లాలో చేపట్టిన భూప్రక్షాళన తర్వాత పట్టాదారు పాసుపుస్తకాలు అందక, పార్టు- బి సమస్యలు తేలక వేలాది మంది రైతులు ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పెట్టుబడి పథకాలకు దూరమవుతున్నారు. దీంతో ఇప్పట్లో భూసమస్యలు పరిష్కారమయ్యేనా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టాభూమి ఉన్నా పాసుపుస్తకాలు అందక కొందరు, సర్వే నంబర్లు తప్పుగా రావడంతో సరిచేయాల్సిన పాసుపుస్తకాలకోసం మరికొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని వేలాది మంది బాధిత రైతులు గతేడాది నుంచి రైతుబంధు, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ తదితర సాయం అందక నిర్లక్ష్యానికి గురవుతున్నారు. మరోపక్క పార్టు- బి భూముల సమస్యలు పరిష్కారమవడం లేదు. దీంతో పార్టు- బి పరిధిలోని సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయో తెలియడం లేదని రైతులు వాపోతున్నారు. పాసుపుస్తకాలు రాని రైతులు నిత్యం వాటికోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో అటవీ, దేవాలయ భూములతోపాటు, అసైన్డ్‌ భూముల సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. వీటిలో చాలా వరకు రైతుల ఆధీనంలో ఉన్నప్పటికీ పార్టు- బిలో చేర్చడంతో వాటి పరిష్కారం కావడం లేదు. 


ఇదేం కష్టం..? (మహబూబ్ నగర్)
దీంతో ఆయా భూములకు సంబంధించి రైతుబంధు నగదు, కిసాన్‌ సమ్మాన్‌ నగదు పంపిణీ నిలిచిపోయింది. జిల్లాలో ఒక్క పెద్దకొత్తపల్లి మండలం మరికల్‌లోనే 398 మంది రైతులకు ఇప్పటివరకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఇలా చాలా గ్రామాల్లో రైతులకు పాసుపుస్తకాలు రాలేదు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని 20 మండలాల్లో పార్టు-బి కింద దాదాపు 22 వేల రైతుల ఖాతానెంబర్లను రెవెన్యూ అధికారులు చేర్చారు. ఆ తర్వాత పార్టు- ఎ కింద రైతులకు సంబంధించిన పట్టాభూముల సమస్యల పరిష్కారం వైపే దృష్టి సారిస్తున్నారు. పార్టు- బి నెంబర్ల సమస్యల పరిష్కారం కోసం రైతులకు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టడంలో రెవెన్యూ శాఖ అలసత్వం వహిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. అసైన్డ్‌ భూముల విషయంలోనూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. పెద్దకొత్తపల్లి మండలంలోని కొత్తపేట, తిర్నాంపల్లి, కల్వకోలు శివారులో వేలాది ఎకరాల అసైన్డ్‌ భూములను పట్టాలుగా మార్చుకుని రైతుబంధు నగదుతోపాటు, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలలో పరిహారం పొందినట్లు గతంలో పలు ఫిర్యాదులు అందాయి. అయినా.. ఆ ఫిర్యాదులను పట్టించుకోకుండా నామమాత్ర విచారణతో ముగించేశారన్న ఆరోపణలు ఉంటున్నాయి. దీంతోపాటు చాలా మండలాల్లో అసైన్డ్‌ భూముల వ్యవహారం సమసిపోలేదు. జిల్లాలోని కొల్లాపూర్‌, బిజినేపల్లి, పెద్దకొత్తపల్లి, తెలకపల్లి, తాడూరు, అచ్చంపేట, కల్వకూర్తి, లింగాల, బల్మూరు, వెల్దండ, నాగర్‌కర్నూల్‌ మండలాల్లో భూముల వివాదాలు ఎక్కువగా ఉండి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.రెవెన్యూ అధికారులు భూ ప్రక్షాళనలో భాగంగా గ్రామాలను సందర్శించి రికార్డులను పరిశీలిస్తూ కొంతమేర భూముల సమస్యలు పరిష్కరించారు. అనంతరం భూప్రక్షాళన తర్వాత రైతుల భూ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా తయారైంది. రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు చేరుకుని మిగిలిన సమస్యలను పరిష్కరిస్తూ పార్టు- బి లేక్కలు తేలుస్తారని జిల్లాలోని మండలాలు, గ్రామాల బాధిత రైతులు ఎదురుచూస్తున్నారు. రెవెన్యూ అధికారులు గ్రామాలను సందర్శించి భూముల సమస్యలను పరిష్కరిస్తేనే మేలు కలుగుతుందని జిల్లా రైతులు కోరుతున్నారు.

No comments:

Post a Comment