Breaking News

17/06/2019

రామా కనవేమిరా...(ఖమ్మం)

ఖమ్మం, జూన్ 17 (way2newstv.in): 
కాళేశ్వరం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సాగునీటి ప్రాజెక్టు ‘సీతారామ’. తెలంగాణ ‘కోటి ఎకరాల మాగాణం’ లక్ష్యంలో దీని భాగస్వామ్యం కూడా ఎంతో కీలకం. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్‌ జిల్లాల్లోని 26 మండలాల పరిధిలో సుమారు 10 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. 180 గ్రామాలకు తాగునీరు కూడా అందుతుంది. మార్గం మధ్యలో చెరువులు, రిజర్వాయర్లు నిండుతాయి. పరిశ్రమలకు కేటాయింపులు చేస్తారు. లక్ష్యం మేరకు పనుల పూర్తికి హైదరాబాద్‌లోని సీఎం కార్యాలయ అధికారులు పర్యవేక్షణ చేపట్టారు. ఆ కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌ తరచూ జిల్లాకు వచ్చి పనుల పురోగతిని స్వయంగా పరిశీలిస్తున్నారు. పనులు ఇటీవల వేగం పుంజుకున్నా.. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో జరగడం లేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే ఆగస్టు నాటికి ‘తొలి దశ’ లక్ష్యం నెరవేరుతుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. కొందరు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, కొరవడుతున్న పర్యవేక్షణే దీనికి కారణంగా కనిపిస్తోంది. గోదావరిలో నీటి లభ్యత పుష్కలంగా ఉంటుంది. 

రామా కనవేమిరా...(ఖమ్మం)
ఆ నీటిని సాధ్యమైనంత వరకు వినియోగించుకోవాలన్నది సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష. అందులోంచి ఆవిర్భవించినవే కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు. ప్రస్తుతం ఉన్న ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు మరింత ఎక్కువ ఆయకట్టును సాగులోకి తేవమే వీటి లక్ష్యం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ కింద 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ఆగస్టు, సెప్టెంబరు గడిచినా నీరు రాదు. తరవాత వచ్చినా అప్పటికే ఖరీఫ్‌ చివరి దశకు చేరుతుంది. ఇక రబీలో నీటి సరఫరా లేక ఆయకట్టు బీడువారుతోంది. ఈ దశలో సీతారామ ప్రాజెక్టును చేపట్టాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. తద్వారా ఈ జిల్లాల్లోని 3.45 లక్షల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు కొత్తగా మరో 3.28 లక్షల ఆయకట్టుకు సాగునీరందించే అవకాశం ఉంది. మార్గమధ్యలో ఈ ప్రాజెక్టు ద్వారా మూడు జిల్లాల పరిధిలోని 180 గ్రామాలకు తాగునీరు అందించాలన్న లక్ష్యం ఉంది. సీతారామ ప్రాజెక్టుకు పూర్వం ‘దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్‌’, ‘రుద్రంకోట ఇందిరాసాగర్‌’ పేర్లు ఉన్నాయి. 5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా అప్పట్లో నిర్ణయించారు. రూ.5,500 కోట్ల వ్యయం అంచనా వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రెండు జిల్లాలకు సాగునీరును అందించాల్సి ఉంది. ప్రాజెక్టు పూర్తికి ముందే అంతర జిల్లాల సాగునీటి వివాదాలకు అవకాశం ఉంటుందనే కారణంతో అప్పటి ప్రభుత్వం ఆకృతిలో మార్పులు చేసింది. ఆ తర్వాత తెరాస అధికారంలోకి వచ్చింది. అదే స్థానంలో ‘సీతారామ’కు రూపకల్పన చేసింది. ఈ ఆకృతిలో అంతర జిల్లాల సాగునీటి వివాదాలకు ఆస్కారం లేకుండా.. అదనంగా మరో 2 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేలా రూపకల్పన చేశారు. ప్రస్తుత ప్రాజెక్టు వ్యయం రూ.7,967 కోట్లుగా అంచనా వేశారు. తొలి దశలో దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి 114 కిలోమీటర్ల పొడవున కాలువలు తవ్వాల్సి ఉంది. దీనికి రూ.792 కోట్లను కేటాయించారు. కాలువల తవ్వకం పనులు చేపట్టినా ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటివరకు 7.19 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు పూర్తికావలసి ఉండగా.. 4 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులే పూర్తయ్యాయి. కాలువల తవ్వకం పనులు, లైనింగ్‌ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.  గోదావరి జలాలను కుమ్మరిగూడెం వద్దనున్న దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి పొందనున్నారు. ఇక్కడ హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మాణం చేపట్టాలి. అదింకా పునాదుల స్థాయిలోనే ఉంది. ఇప్పుడిప్పుడే కాలువల తవ్వకం ఆనకట్ట వద్దకు చేరుకుంటోంది. ఖమ్మం జిల్లాలోని నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టుకు సాగు నీరందించాలంటే మూడు పంప్‌ హౌస్‌లు అవసరమవుతాయి. రూ.783 కోట్లతో ఈ పంప్‌హౌస్‌ల నిర్మాణం చేపట్టారు. 80 శాతం వరకు సివిల్‌ పనులు పూర్తయినా.. పంప్‌హౌస్‌ల నిర్మాణం పనులు 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ప్రతీ పంప్‌ హౌస్‌లో 6 విద్యుత్తు మోటార్లను ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో కనీసం మూడు విద్యుత్తు మోటార్లతో అయినా పని చేయించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మొదటి పంప్‌ హౌస్‌ను జూన్‌, జులై వరకల్లా, రెండో పంప్‌ హౌస్‌ను ఆగస్టు, సెప్టెంబర్‌ వరకల్లా, మూడో పంప్‌ హౌస్‌ను అక్టోబరు, నవంబరు వరకల్లా సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  మార్గం మధ్యలో ప్రధాన కాలువలపై వంతెనలు, అక్విడెక్టులు నిర్మించాలి. ఆ పనులు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి. గొల్లగూడెం, మోరంపల్లి బంజరల వద్ద మణుగూరు ప్రధాన రహదారిపై ప్రధాన వంతెనల నిర్మాణం నేటికీ ప్రారంభం కాలేదు. నాగారం వద్ద కిన్నెరసాని నదిపై అక్విడెక్టు నిర్మాణం కొనసాగుతోంది.

No comments:

Post a Comment