Breaking News

05/06/2019

పాలిటెక్నిక్ కోర్సులకు తగిన ఆదరణ


విజయవాడ, జూన్  5, (way2newstv.in)
రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సులకు వివిధ కారణాలతో ఆదరణ తగ్గుతోంది. ఏటా కొన్ని పాలిటెక్నిక్ కళాశాలలు మూత పడుతుండగా, అనేక కళాశాలల్లో భారీగా సీట్లు మిగిలిపోతున్నాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో భారీ సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అదనంగా భారీ మొత్తంలో పెట్టుబడులు లేకుండానే పాలిటెక్నిక్ కోర్సులు నిర్వహించేందుకు వీలుండటంతో దాదాపు ప్రతి ఇంజినీరింగ్ కళాశాలలోనూ పాలిటెక్నిక్ కోర్సులను మధ్యాహ్నం సెషన్‌లో నిర్వహిస్తున్నారు. ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ సీట్లే భర్తీ కాకుండా మిగిలిపోతున్న నేపథ్యంలో పాలిటెక్నిక్ కోర్సులకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. 2014-15 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 306 పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 283కు పడిపోయింది. సీట్ల సంఖ్య కూడా దాదాపు 85వేల సీట్ల నుంచి 68వేలకు పడిపోవడం ఈ కోర్సులకు లభిస్తున్న ఆదరణను చెప్పకనే చెబుతోంది. 


పాలిటెక్నిక్ కోర్సులకు తగిన ఆదరణ
పాలిసెట్ 2019లో మొదటి దశ కౌనె్సలింగ్ నాటికి రాష్ట్రంలో 283 పాలిటెక్నిక్ కళాశాలలు, 68,341 సీట్లు ఉన్నాయి. వీటిలో కేవలం 30,494 సీట్లు మాత్రమే భర్తీ కావడం గమనార్హం. అందుబాటులో ఉన్న సీట్లతో పోలిస్తే దాదాపు 55శాతం మేర సీట్లు భర్తీకాకుండా మిగిలిపోయాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలోనూ 1365 సీట్లు భర్తీ కాకపోవడం గమనార్హం. 2014-15లో 85వేల సీట్లలో 42,841 సీట్లు మిగిలిపోయాయి. 2015-16 సంవత్సరంలో 83,617 సీట్లు ఉండగా 39,008 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. 2016-17లో 81,462 సీట్లకు 47,897 సీట్లు, 2017-18లో 81వేల సీట్లకు 46వేలు, 2018-19లో 74,312 సీట్లు ఉండగా, 36952 సీట్లు మిగిలిపోయాయి. గత ఏడాది ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో కూడా 2333 సీట్లు మిగిలిపోవడం గమనార్హం. ప్రతి ఏడాది పాలిసెట్‌కు భారీగా దరఖాస్తులు వస్తున్నా చివరకు కోర్సుల్లో చేరేవారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. పాలిటెక్నిక్ కోర్సు చేశాక ఇంజనీరింగ్ డిగ్రీలో రెండో సంవత్సరంలో చేరే వీలున్నా విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల పట్ల అంత ఆసక్తి చూపడం లేదు. మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నా, మార్కెట్ అధ్యయనం సరిగా లేకపోవడం వల్ల కొన్ని కోర్సుల్లో చేరేవారే ఉండటం లేదు. చాలా కళాశాలల్లో అధ్యాపకులు, ప్రయోగశాలలు లేకపోవడం కూడా ఈ కోర్సులకు ఆదరణ తగ్గడానికి కారణవౌతోంది. కొన్ని పాలిటెక్నిక్ కళాశాలలు మినహా చాలాచోట్ల కోర్సు పూర్తిచేశాక ప్లేస్‌మెంట్లు లేకపోవడం కూడా ఈ కోర్సులపై నిరాదరణకు కారణమంటున్నారు. పాలిటెక్నిక్ కోర్సుల కన్నా ఐటీఐల్లో చేరేందుకు విద్యార్థులు మొగ్గు చూపడం గమనార్హం. ఈనేపథ్యంలో ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి పాలిటెక్నిక్ కళాశాలలను ప్రక్షాళన చేయడం అవసరమనే అభిప్రాయం వ్యక్తవౌతోంది.

No comments:

Post a Comment