ఏపీలో పూర్తిస్థాయిలో బలపడాలని నిర్ణయించుకున్న కమలనాథులు ఇప్పటికే ఆపరేషన్ లోటస్‌ను ప్రారంభించారు. ప్రతి అవకాశాన్నీ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వచ్చిన వారిని వచ్చినట్టు పార్టీలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ బీజేపీ కండువా మారుస్తున్నారు. చాలా వ్యూహాత్మకంగా.. చాలా నిర్దిష్టంగా కమల నాథులు దూసుకుపోతుండడం పెద్ద సంచలనంగా మారింది. టార్గెట్ 2024 కాన్సెప్ట్‌తో కమలనాథులు దూసుకుపోతున్న క్రమంలో ఆ పార్టీ ఇతర పార్టీలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.తాను బలపడాలంటే.. పక్కనున్న వారి కన్నా బలంగా తయారు కావడం అనే దానిని పక్కన పెట్టి.. పక్కవాడిని బలహీన పరచడం ద్వారా తాను బలపడడమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో టీడీపీపై కన్నేసిన కమలనాథులు ఈ పార్టీలో కీలకంగా ఉన్న వ్యాపార వేత్తలను తన పార్టీలోకి తీసుకునేందుకు రెడీ అయింది. ఈ క్రమంలో సీబీఐ, ఈడీ వంటివాటిని వాడుకుంది.
ఆపరేషన్ లోటస్ కి టచ్ లో టీడీపీ నేతలు
దీంతో బెంబేలెత్తిన కొందరు ఇప్పటికే దేశాభివృద్ధి పేరుతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, చంద్రబాబు గిఫ్ట్ ఇస్తానని ప్రకటించిన బీజేపీ మరింత మంది పెద్ద తలకాయలను తన పార్టీవైపు మళ్లించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసిందని తెలుస్తోంది.వీరిలో కోట్ల సూర్యప్రకాశ రెడ్డి ఫ్యామిలీ ఇప్పటికే బీజేపీ కండువా కప్పుకొనేందుకురెడీగా ఉన్నారని సమాచారం. అదే సమయంలో గుంటూరుకు చెందిన రాయపాటి ఫ్యామిలీని కూడా వలలో వేసుకున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరు కూడా వినిపిస్తోంది. మరోపక్క, నెల్లూరుకు చెందిన బీద మస్తాన్ రావు సోదరులను కూడా బీజేపీలోకి చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలుస్తోంది. తాజాగా ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్న బీజేపీ.. వారిని అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రతిపక్షంగా ఎదగాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది.బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరికి టీడీపీలో చాలా వింగ్ ఉంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సుజనాకు పెద్ద అనుచరగణమే ఉంది. వీరిలో కొందరికి సుజనాయే రికమెండ్ చేసి మరీ టిక్కెట్లు ఇప్పించారు. ఎన్నికల్లో గెలిచిన తన సామాజికవర్గ ఎమ్మెల్యేలతో పాటు ఓడిన వారికి కూడా సుజనాయే నేరుగా ఫోన్లు చేసి.. పార్టీ మారిపోండి అంతా నేను చూసుకుంటానని హామీలు ఇస్తున్నారట. ఇక ఏపీకి సంబంధించి రెండు కీలక లక్ష్యాలు బీజేపీ ముందు కనిపిస్తున్నాయి. ఒకటి పార్టీని బలోపేతం చేసుకోవడం, రెండు.. తమ పార్టీని నాశనం చేయాలని దేశం మొత్తం తిరిగి ప్రచారం చేసిన చంద్రబాబును మట్టికరిపించి,నామరూపాలు లేకుండా చేయడం ఇప్పుడు బీజేపీ ముందున్న ప్రధాన కర్తవ్యాలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
No comments:
Post a Comment