Breaking News

07/05/2019

లాలు పార్టీలో నెంబర్ 3 గేమ్

పాట్నా, మే 7, (way2newstv.in)
వారసత్వ పోరు ఎవరికి చేటు తెస్తుందో తెలియదు కాని ప్రత్యర్థి పార్టీకి మాత్రం లాభం చేకూరుస్తుందన్నది మాత్రం వాస్తవం. ఈ సత్యం తెలిసిన నేతలు కూడా వారసత్వం కోసం పట్టుబడుతుంటారు. ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ స్థాపించిన సమాజ్ వాదీ పార్టీలో చీలిక రావడానికి కారణం ఆధిపత్యపోరు. ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ సొంత పార్టీ పెట్టి యూపీ బరిలోకి దిగారు. ఈపరిణామం అక్కడ బీజేపీకి లాభం చేకూరుస్తుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. తాజాగా బీహార్ లోని రాష్ట్రీయ జనతా దళ్ లోనూ రాజకీయ వారసత్వం కోసం పోరు ప్రారంభమయింది.లాలూప్రసాద్ యాదవ్ స్థాపించిన రాష్ట్రీయ జనతాదళ్ బీహార్ ను ఒకప్పుడు శాసించింది. ఇప్పటికీ ఆర్జేడీ బీహార్ లోని అనేక ప్రాంతాల్లో బలంగా ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్ జైలు కెళ్లడం, రబ్రీదేవి ఇంటికే పరిమితం కావడంతో ఆ కుటుంబంలో వారసత్వం కోసం పోరు చాన్నాళ్ల క్రితమే ప్రారంభమయింది. గత ఎన్నికల్లో మహాగడ్బంధన్ విజయం సాధించడంతో లాలూప్రసాద్ యాదవ్ కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ లు మంత్రులయ్యారు. ప్రభుత్వం ఉన్నంత వరకూ సజావుగానే నడిచింది. 


లాలు పార్టీలో నెంబర్ 3 గేమ్

అయితే ముఖ్యమంత్రి నితీష్ రాజీనామా చేయడం, బీజేపీ సహకారంతో నితీష్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో లాలూ కుమారులు రాజకీయ నిరుద్యోగులుగా మారారు.దీంతో వారి మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమయింది. నిజానికి తేజస్వియాదవ్ కు పార్టీ మీద పట్టుంది. లాలూ తర్వాత జనాకర్షణ నేతగా ముద్రపడ్డారు. ఆయన సారథ్యంలోనే ఉప ఎన్నికల్లో గెలవడంతో లాలూ యాదవ్ కూడా తేజస్వియాదవ్ కు ప్రాధాన్యమిస్తూ వచ్చారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనూ తేజస్వి యాదవ్ దే పైచేయి అయింది. దీంతో ఆర్జేడీలో తేజస్వీ యాదవ్ మాత్రమే లీడర్ అయ్యారు. ఇది సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు రుచించలేదు. తండ్రి స్థాపించిన పార్టీని సోదరుడు హైజాక్ చేశారని ఆయన భావించారు.సోదరుడు తేజస్వి యాదవ్ పై ఆగ్రహించిన తేజ్ ప్రతాప్ యాదవ్ ఎన్నికల వేళ సొంత పార్టీ పెట్టారు. తన తండ్రి, తల్లి పేరిటే పార్టీని స్థాపించడం గమనార్హం. లాలూ రబ్రీ మంచ్ పేరుతో తేజ్ ప్రతాప్ యాదవ్ అభ్యర్థులను కూడా రంగంలోకి దించారు. తానే లాలూకు అసలైన వారసుడినని బహిరంగంగా ఆయన ప్రకటించుకున్నారు. బీహార్ లో రెండో లాలూనే తానే నంటూ ఆయన చేసిన ప్రకటన సంచలనమే అయింది. ఇటీవల తేజస్వియాదవ్ ఎన్నికల ప్రచారంలో అలసి పోయి విశ్రాంతి తీసుకుంటున్నారు. దీనిపై తేజ్ ప్రతాప్ యాదవ్ పరోక్షంగా స్పందించారు. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ రోజుకు పది , పన్నెండు సభల్లో పాల్గొనే వారని, ఇప్పటి నేతలు మాత్రం రోజుకు రెండు సభల్లో పాల్గొని అలసి పోతున్నారని సెటైర్ వేశారు.మొత్తం మీద లాలూ కుటుంబంలో ముసలం పుట్టిందనేది వాస్తవమనే చెప్పాలి.

No comments:

Post a Comment