Breaking News

07/05/2019

సేఫ్ గేమ్ ఆడుతున్నపళని, పన్నీరు

చెన్నై, మే 7, (way2newstv.in)
జయలలిత జీవించి ఉన్నప్పుడు ఆ పార్టీ శాసనసభ్యుల సంఖ్య 136 మంది. ఇప్పుడు ఆ సంఖ్య 113కు పడిపోయింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం కుప్ప కూలడం ఖాయమంటున్నారు. తమిళనాడులో మొత్తం 22 అసెంబ్లీ స్థానాలకు అసాధారణ పరిస్థితుల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో ఈ ఉప ఎన్నికలు వచ్చాయి. మరో నాలుగు స్థానాలకు ఈ నెల 19వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ 22 స్థానాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకుంటామన్న ఆశ అన్నాడీఎంకేలో లేదు.అన్నాడీఎంకేకు రధసారధులుగా పళనిస్వామి, పన్నీర్ సెల్వం వ్యవహరిస్తున్నారు. వారే పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. జయలలిత సన్నిహితురాలు శశికళతో ఏర్పడిన వివాదంతోనే అన్నాడీఎంకేలో నాయకత్వ సమస్య ఏర్పడింది. దీంతో ఈ లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో బరిలోకి దిగారు. 


సేఫ్ గేమ్ ఆడుతున్నపళని, పన్నీరు

ఈ 22 స్థానాల్లో కనీసం సగం స్థానాలనైనా గెలుచుకోకుంటే పళిని స్వామి దిగిపోక తప్పదు. కేంద్రంలో మరోసారి మోదీ వస్తారన్న ఆశతో పళని, పన్నీర్ సెల్వం ఉన్నారు. అందుకే వారణాసిలో మోదీ ప్రమాణ స్వీకారానికి పన్నీర్ సెల్వం హాజరయ్యారు.అయితే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు. తమకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని అన్నాడీఎంకే నేతలు సయితం భయపడుతున్నారు. రాష్ట్రంలో డీఎంకే గాలి వీస్తుందన్న సర్వేలు కూడా పళనిని, పన్నీర్ ను వణికిస్తున్నాయి. పోలింగ్ జరిగిన 18 శాసనసభ నియోజకవర్గాల నుంచి పళనిస్వామి, పన్నీర్ సెల్వం నివేదికలు తెప్పించుకుంటే గెలుపు అవకాశాలు చాలా చో్ట్ల కష్టమేనని తేలింది. ఏ మాత్రం తేడా వచ్చినా డీఎంకే అధినేత స్టాలిన్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు సిద్ధంగా ఉన్నారు. టీటీవీ దినకరన్ కూడా పళని సర్కార్ ను సాగనంపేందుకు సిద్థంగా ఉన్నారు.ఈనేపథ్యంలో ఎందుకైనా మంచిదని శాసనసభలో తమ బలం పెంచుకోవడమే కాకుండా, ప్రత్యర్థుల బలాన్ని తగ్గించేందుకు ముగ్గురు శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని అన్నాడీఎంకే అధినేతలు భావిస్తున్నారు. అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ప్రభుత్వ విప్ స్పీకర్ కు సిఫార్సు చేశారు. మే 23వ తేదీ ఎన్నికల ఫలితాలు రాకముందే టీటీవీ దినకరన్ పంచన చేరిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై విపక్షాలు ఇప్పటికే ఆందోళన చేస్తున్నాయి. రాజ్యాంగ విరుద్ధంగా అనర్హత వేటు వేసి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని పళనిస్వామి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద అనర్హత వేటు వేస్తూ ఎన్నాళ్లు ప్రభుత్వాన్ని పళని కాపాడుకోగలుగుతారన్న ప్రశ్న తలెత్తుతోంది.

No comments:

Post a Comment