Breaking News

27/04/2019

అందనంత ఎత్తులో ఇసుక (గుంటూరు)

గుంటూరు, ఏప్రిల్ 27  (way2newstv.in):
ఇసుక ధర మూడు రెట్లు పెరిగింది. రీచ్‌లు మొత్తం మూతపడటంతో లభ్యత పూర్తిగా తగ్గిపోయింది. చేసిన నిల్వకు అంతులేని డిమాండ్‌ వచ్చింది. ఒక్కసారిగా కొరత ఏర్పడడంతో డిమాండ్‌ పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్యులు ఇల్లు కట్టుకోలేని దుస్థితి దాపురించింది. ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకు చిన్న లారీ లోడు ఇసుక రూ.4 వేలకు గుంటూరులో లభించగా అదే ఇప్పుడు రూ.12 వేలకుపైగా పలుకుతోంది. అది కూడా అన్ని వేళలా అందుబాటులో ఉండట్లేదు. నరసరావుపేటలో 12 టైర్ల లారీ లోడు ఇసుకకు ఏకంగా రూ.20 వేలు వసూలు చేస్తున్నారు. ఒకవేళ అక్రమంగా తెచ్చి విక్రయించాలన్నా మైనింగ్‌ అధికారులకు పట్టుబడితే భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందని లారీల యజమానులు భయపడుతుండగా అరకొరగానే ఇసుక లభ్యమవుతోంది. దాంతో ఇక్కడ ఉన్న సుమారు 100 వరకు లారీలు మూలనపడగా డ్రైవర్లు, క్లీనర్ల పరిస్థితి దయనీయంగా మారింది. తెనాలిలో గతంలో ట్రాక్టరు లోడు రూ.2500కు లభించగా ప్రస్తుతం రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తీసుకురావడంతో మూడేళ్లుగా కొరత లేకుండా రవాణా ఛార్జీలు, లోడింగ్‌, అన్‌లోడింగ్‌ ఛార్జీలు మాత్రమే చెల్లించాల్సివచ్చేది. 


అందనంత ఎత్తులో ఇసుక (గుంటూరు)

ఇది కూడా జిల్లాస్థాయి కమిటీ నిర్ణయించిన ధరలు వసూలు చేయాలని సూచించడంతో అందుబాటులో ఉండేవి. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ నిర్ణయంతో జిల్లాలో మొత్తం రేవులన్నీ ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి మూతపడగా ఏర్పడిన ఇసుక కొరతతో రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతోంది. ఇది సామాన్యులతోపాటు నిర్మాణరంగానికి శాపంగా మారింది.ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఆరు రేవుల్లో పూడిక తీయడం ద్వారా వచ్చిన ఇసుకను రాజధాని నిర్మాణ అవసరాలతోపాటు జిల్లాలో అవసరాలకు వినియోగించేవారు. వీటితోపాటు అచ్చంపేట మండలం కస్తల, ప్రకాశం బ్యారేజీ దిగువన కొన్ని చిన్న రేవులు నడిచేవి. ఫలితంగా జిల్లావ్యాప్తంగా ఇసుక కొరత లేకుండా అందరికీ అందుబాటులో ఉండేది. ప్రకాశం బ్యారేజీ ఎగువన పూడికతీయడంవల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని కొందరు జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)ను ఆశ్రయించారు. ఎన్జీటీ నుంచి వచ్చిన ప్రతినిధులు ప్రకాశం బ్యారేజీలో పూడికతీతను పరిశీలించి వెంటనే పూడితతీత పనులు ఆపేయాలని సూచించారు. అంతేకాకుండా పూడికతీతకు అనుమతించి ఇసుక తరలించినందుకు ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధించారు. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యారేజీ ఎగువన పూడిక తీస్తున్న ఆరు రేవులను వెంటనే మూసేశారు. కస్తలలో ఓపెన్‌ రీచ్‌ నుంచి ఇసుక తవ్వి తరలించేవారు. దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లడంతో అక్కడా తవ్వకాలు నిలిచిపోయాయి. బ్యారేజీ దిగువన ఉన్న చిన్న రేవులకు సైతం అనుమతించిన గడువు ముగియడంతో అన్నీ మూతపడ్డాయి. ఏప్రిల్‌ 1 నుంచి జిల్లాలో ఒక్కటి  కూడా అందుబాటులో లేకపోవడంతో ఇసుక కొరత ఏర్పడింది. ప్రస్తుతం కృష్ణా జిల్లా నుంచి జిల్లాకు రవాణా చేస్తున్నారు. దీనివల్ల రవాణా ఛార్జీలు పెరగడంతోపాటు రేవుల్లో లారీలు రోజుల తరబడి వేచి చూడాల్సివస్తోంది. ఇందుకు రుసుములు, ఇతర ఖర్చులు కలిపి మొత్తం వినియోగదారుడిపైనే వేస్తుండడంతో ఇసుక ధర అమాంతం పెరిగిపోతోంది.సాధారణంగా మార్చి నుంచి జూన్‌ వరకు నిర్మాణాలు చేసుకోవడానికి అనుకూలమైన కాలంగా గుర్తించి అందరూ నిర్మాణాలు చేపడతారు. ఉద్యోగులకు సెలవులు ఉండటం, వర్షాలు లేకపోవడం తదితర కారణాలతో అదనపు గదులు, కొత్త ఇళ్ల నిర్మాణం, గదుల విస్తరణ తదితర పనులు చేయిస్తుంటారు. బిల్డర్లు సైతం ఈ కాలంలో నిర్మాణాలు ఎక్కువగా ప్రారంభించి పూర్తి చేస్తారు. మరోవైపు జిల్లాలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరం నిర్మాణం వేగంగా జరుగుతోంది. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ.వేల కోట్లతో రహదారులు, డ్రెయిన్లు, విద్యుత్తు పనులు చేస్తున్నారు. జిల్లాలో 216 జాతీయ రహదారి విస్తరణ పనులూ సాగుతున్నాయి. వీటన్నింటికీ ఇసుక అవసరం కావడంతో నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. ఏప్రిల్‌ ఒకటి నుంచి రేవులు మూతపడడంతో ఇప్పటివరకు చేసుకున్న నిల్వతో పనులు చేశామని, ఇక నుంచి ఎలా కొనసాగించాలో పాలుపోవడం లేదని నిర్మాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుని రేవులను వెంటనే తెరిపించాలని కోరుతున్నారు.
జిల్లాలో 13 రేవుల్లో తవ్వకాలు ఆగిపోవడంతో ఏర్పడిన ఇసుక కొరతను దృష్టిలో ఉంచుకుని భూగర్భ గనుల శాఖ ప్రకాశం బ్యారేజీ దిగువన నాలుగు రేవులకు ప్రతిపాదనలు పంపింది. వీటికి రాష్ట్రస్థాయి కమిటీ అనుమతులు ఇవ్వాల్సివుంది. ఈ నెలాఖరులో లేదా మే తొలి వారంలో సమావేశం జరిగి అనుమతులు ఇస్తేనే రేవులు తెరవడానికి వెసులుబాటు కలుగుతుంది. ఇవి కూడా 40 నుంచి 50 వేల క్యూబిక్‌ మీటర్ల నిల్వలు ఉన్న రేవులు కావడంతో స్వల్పకాలంలోనే ఖాళీ అవుతాయని అంచనా వేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తరఫున ఎన్జీటీలో స్టే తీసుకువచ్చి బ్యారేజీ ఎగువ భాగంలో పూడిక తీయడానికి అనుమతి తీసుకుంటే కొరత తీరుతుందని భావిస్తున్నారు.

No comments:

Post a Comment