Breaking News

05/04/2019

రియల్ ఢమాల్.. (విజయనగరం)

విజయనగరం, ఏప్రిల్ 05 (way2newstv.in): 
రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో యంత్రాంగం నగదు పంపిణీపై గట్టి నిఘా పెట్టింది. ప్రధాన రహదారుల్లో ఎక్కడికక్కడే చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి అనధికార నగదు తరలింపునకు కళ్లెం వేస్తుండటంతో రిజిస్ట్రేషన్లు చేయించుకునే వారు ఇబ్బంది పడుతున్నారు. రూ.50 వేలు పైబడిన నగదుకు దాన్ని ఏ అవసరాల నిమిత్తం తీసుకెళుతున్నారో అందుకు సంబంధించిన ఆధారాలను చూపాలి. అలా చూపకపోతే ఆ మొత్తం నగదును తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకుని ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తాయి. దీంతో ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి భయపడుతున్నారు. సాధారణంగా దస్తావేజుల్లో ప్రభుత్వ ధర ఒకవిధంగా బహిరంగ మార్కెట్‌లో ధర మరోవిధంగా ఉంటుంది. ఉదాహరణకు ఎకరా భూమి ధర బహిరంగ మార్కెట్‌లో ఒకలా ఉంటే అధికారిక మార్కెట్‌ విలువ దాంట్లో 30 నుంచి 40 శాతం ఉండటమే గగనం. ఈవిధంగా రిజిస్ట్రేషన్లు జరిగినప్పుడు దస్తావేజుల్లో ధర తక్కువ చూపించి చేసుకుంటారు. 


రియల్ ఢమాల్.. (విజయనగరం)

ఇలా నగదు విషయంలో వ్యత్యాసం ఉంటుంది. స్థిరాస్తి వ్యాపారంలో నల్లధనం ప్రవాహం అధికంగా ఉంటుంది. ఈ విధంగా లెక్కలు చూపించలేక రిజిస్ట్రేషన్లు మానుకుంటున్నారు. ఇటువంటి లావాదేవీలకు ఆధారాలు చూపడం కష్టమని దస్తావేజులో ఒకవిధంగా అమ్మకం చేసిన వారివద్ద నగదు ఎక్కువ మొత్తంలో ఉండి పట్టుబడితే సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది. సరైన ఆధారాలు చూపకపోతే ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని ఆదాయపు పన్నుల శాఖకు అప్పగిస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం ఆ దస్తావేజును సబ్‌రిజిస్ట్రార్‌కు పంపితే వారు కూడా రెవెన్యూ రికవరీ చట్టం కింద బహిరంగ మార్కెట్‌ ధర ప్రకారమే స్టాంపుడ్యూటీ వసూలు చేస్తారని భావించి పలువురు విక్రయ దస్తావేజులకు వెనుకంజ వేస్తున్నారని తెలుస్తోంది. కోడ్‌ అమల్లోకి రాకముందు వరకు జోరుగా సాగిన స్థిరాస్తి వ్యాపారం ఇప్పుడు మందగించింది.ఏటా రిజిస్ట్రేషన్ల శాఖ మార్చి నెలపైనే ఆశలు పెట్టుకుంటుంది. ఆ నెలలో లక్ష్యాల సాధనకు అనుకూలమైనదిగా భావిస్తారు. ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఆ శాఖ ఆశలపై నీళ్లుజల్లింది. పెద్దనోట్ల రద్దు తర్వాత జిల్లాలో రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం పడిపోయింది. మళ్లీ ఇటీవల గణనీయంగా పెరిగింది. నోట్ల రద్దుకు ముందు 2015-16లో జిల్లా ఆదాయం 117.91 శాతం ఉండగా రద్దు చేసిన తర్వాత ఒక్కసారిగా 61.92 శాతానికి పడిపోయింది. ఇప్పుడు మళ్లీ జోరు పెరిగింది. ఇప్పుడు జిల్లాలో పరిస్థితి మెరుగుపడుతుండగా ఎన్నికల ప్రభావంతో తగ్గుముఖం పట్టినట్టయింది. 2018-19 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి లక్ష్యం రూ.191.58 కోట్లు కాగా రూ.173.72 కోట్లు వచ్చింది. జిల్లావ్యాప్తంగా 90.68 శాతం ఆదాయం లభించింది. వృద్ధిరేటు గణనీయంగా 18.63 శాతం పెరిగింది. అటువంటిది మార్చినెల ఆదాయం ఏ మేరకు లభిస్తుందనే దిగులు అధికారుల్లో మొదలైంది.

No comments:

Post a Comment