Breaking News

25/03/2019

మూడు కొత్త సబ్జెక్టులకు చోటు

న్యూఢిల్లీ, మార్చి 25, (way2newstv.in)
సీబీఎస్‌ఈ విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠ్యాంశాల జాబితాలో మూడు కొత్త సబ్జెక్టులు వచ్చి చేరనున్నాయి. సీబీఎస్‌ఈ పాఠశాలల బోధన ప్రణాళికలో కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), యోగ, చిన్నారుల సంరక్షణ విద్య(ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ ఎడ్యుకేషన్)ను పాఠ్యాంశాలుగా బోధించనున్నారు. ఈ మేరకు సీబీఎస్‌ఈ బోర్డు ఇటీవల నిర్వహించిన సమావేశంలో నిర్ణయించిందని సీబీఎస్‌ఈ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2019-20 విద్యాసంవత్సరం నుంచి వీటిని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. సీబీఎస్‌ఈ 9వ తరగతి విద్యార్థులకు 6వ సబ్జెక్టుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)ను ఆప్షనల్ సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు. అయితే విద్యార్థులకు 8వ తరగతిలోనే ఏఐకు సంబంధించి 12 గంటల పరిచయ తరగతులను నిర్వహించనున్నారు. 


మూడు కొత్త సబ్జెక్టులకు చోటు

ఇక సీనియర్‌ సెకండరీ స్థాయిలో యోగ, చిన్నారుల సంరక్షణ విద్యను ప్రవేశపెడతారు. విద్యార్థులకు ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని ఎంచుకొనే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రస్తుత ఐదు తప్పనిసరి పాఠ్యాంశాలకు ఈ రెండింటిలో ఒకటి అదనపు పాఠ్యాంశం అవుతుంది. కృత్రిమ మేధకు ఉజ్వల భవిష్యత్తు ఉన్న దరిమిలా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆ సబ్జెక్టును పరిచయం చేస్తున్నట్లు సీబీఎస్‌ఈ పేర్కొంది. మరోవైపు పదోతరగతి విద్యార్థులు సైతం బోర్డు పరీక్షల కోసం ఇప్పుడున్న 5 ప్రధాన సబ్జెక్టులకు అదనంగా కొత్తగా ఒక ఆప్షనల్‌ సబ్జెక్టును ఎంచుకోవాలని కొద్దిరోజుల క్రితం సీబీఎస్‌ఈ కోరిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఏదైనా ఓ ప్రధాన సబ్జెక్టులో విద్యార్ధి ఫెయిలైతే, దానికి బదులు అతడికి ఆప్షనల్‌ సబ్జెక్టులో వచ్చిన పాస్‌ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. గతంలోలాగే ఫెయిలైన సబ్జెక్టుకు సప్లిమెంటరీ రాసే అవకాశం ఉంటుంది. ఆసక్తిగల విద్యాసంస్థలు మార్చి31లోగా దరఖాస్తులు ఇవ్వాలని సీబీఎస్ఈ కోరింది

No comments:

Post a Comment