అదిలాబాద్, మార్చి 26 (way2newstv.in)
ఒకప్పుడు ఒంటిచేత్తో జిల్లాను ఏలిన రాజకీయ పార్టీలు క్రమంగా ప్రాభవం కోల్పోతున్నాయి. అధికార పీఠాలతో.. ప్రజా పోరాటాలతో వెలుగు వెలిగిన రాజకీయ పార్టీలు క్రమక్రమంగా పోటీకి దూరమవుతున్నాయి.దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఉండేది. ఇక్కడ 8 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. తెదేపా ఆవిర్భావంతో ఆ పార్టీ ఇక్కడ పాగా వేసింది. మొత్తం ఆరుమార్లు ఆ పార్టీ అభ్యర్థులు ఇక్కడ ఎంపీగా విజయం సాధించారు. కాలానుగుణంగా కాంగ్రెస్‌కు చెందిన అనేకమంది నాయకులు తెదేపాలో చేరారు. దీంతో 1983 నుంచి 2009 వరకు రెండు పర్యాయాలు మినహా అన్ని ఎన్నికల్లోనూ ఇక్కడి ప్రజలు తెదేపాకే పట్టం కట్టారు. జిల్లాలో తిరుగులేని శక్తిగా ఉండటంతో ఆ సమయంలో జిల్లాలో కాంగ్రెస్ అంతగా ప్రభావం చూపించలేకపోయింది. అలాంటి పార్టీ నేడు కనీసం పోటీచేసే పరిస్థితి లేకుండా పోయింది. రాష్ట్రంలో ఒకటీరెండు స్థానాల్లో పోటీచేయడానికి ఆసక్తి కనబరుసున్నా.. ఆదిలాబాద్, పెద్దపల్లి స్థానాల్లో పోటీ చేసే అవకాశం లేకుండాపోయింది.
అదిలాబాద్ లో ప్రభావం కోల్పొతున్న పార్టీలు
జిల్లాలో గత 20 ఏళ్లుగా అధికారంలో ఉండి అనేక మంది నాయకులను అందించిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం పోటీ పడలేని పరిస్థితి వచ్చింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించిన బహుజన్ సమాజ్ పార్టీ సైతం లోక్‌సభలో పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీలు దూరంగా ఉండటం జిల్లా చరిత్రలోనే తొలిసారి కానుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇక ఉమ్మడి జిల్లాలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లను కైవసం చేసుకొని రాష్ట్రస్థాయిలో సంచలనం రేపిన బహుజనసమాజ్ పార్టీ సైతం తాజాగా లోక్‌సభ బరిలో దిగడం అనుమానంగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పది స్థానాల్లో పోటీ చేసినా ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. బెల్లంపల్లిలో తెరాస తర్వాత అధిక ఓట్లు సాధించినా.. ప్రస్తుతం పార్లమెంట్ బరిలో దిగడానికి నేతలు ఆసక్తి చూపడంలేదు. నామపత్రాలు దాఖలుకు సోమవారమే గడువు మిగలి ఉన్నా.. పోటీ విషయంపైన ఎలాంటి స్పష్టత రాలేదనే చెప్పవచ్చు.ఇక వామపక్షాల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ లోకసభ స్థానానికి 1952లో తొలి ఎన్నికలు జరగగా సోషలిస్టు పార్టీ తరపున చెరుకు మాధవరెడ్డి గెలుపొందారు. పలుమార్లు ఎంపీగా బరిలో దిగి ఉనికి చాటుకున్న పరిస్థితులు ఉండేవి. బెల్లంపల్లి నుంచి గుండా మల్లేష్ పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకప్పుడు జిల్లాలో వామపక్షాలు చాలా బలంగా ఉండేవి. ప్రజా పోరాటాలతో ప్రజల మన్నన పొందిన ఈ పార్టీలు.. ఇప్పుడు వారి ఓట్లను మాత్రం పొందలేకపోయాయి.
No comments:
Post a Comment