Breaking News

26/03/2019

ఆపరేషన్ విత్ డ్రా పనిలో గులాబీదళం

నిజామాబాద్, మార్చి 26 (way2newstv.in)
నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ 'ఆపరేషన్‌ విత్‌డ్రా' ప్రారంభించింది. పసుపు, ఎర్ర జొన్నల మద్దతు ధర కోసం ఆందోళనలు చేసి విసిగి వేసారిన రైతులు పార్లమెంట్‌ బరిలో దిగుతామని నామినేషన్లు వేశారు. దీంతో స్వయంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రంగంలోకి దిగి రైతులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అనుబంధంగా ఉండి గ్రామాల్లో కీలకంగా ఉన్న వ్యక్తులు, రైతులతో సమావేశమయ్యారు. 'ఎర్రజొన్న రైతులకు లాభం చేస్తాం. గతంలో కొన్నదాని కంటే రూపాయి ఎక్కువే ఇస్తాం. ఇందుకోసం బోనస్‌ చెల్లిస్తాం. నామినేషన్లు విరమించేలా చూడాలి' అని దిశానిర్దేశం చేశారు. పసుపు పంటకు అవసరమైన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పుతామని చెప్పారు. మంత్రి నిర్వహించిన సమావేశానికి మీడియాను అనుమతించలేదు. సుమారు వంద నుంచి రెండు వందల మంది రైతులతో సమావేశం జరిగింది.పసుపు, ఎర్రజొన్న రైతులను పాలక పార్టీలు విస్మరిస్తున్నాయన్న ఆగ్రహంతో.. తమ సమస్యను దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసేందుకు లోక్‌సభ ఎన్నికల్లో పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేయాలని రైతులు నిర్ణయించిన విషయం తెలిసిందే. 


ఆపరేషన్ విత్ డ్రా పనిలో గులాబీదళం

ఫిబ్రవరి నుంచి పలు దఫాలుగా ఆందోళన చేసినా అటు ఎమ్మెల్యేలు ఇటు ప్రభుత్వం స్పందించలేదు. పసుపు పంట క్వింటాల్‌కు రూ.15 వేలు, ఎర్రజొన్నలకు రూ.3500 చెల్లించాలని రైతులు కోరుతున్నారు. హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టితే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని రైతు నాయకులను రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేయాలని రైతు జేఏసీ నిర్ణయించింది. అనుకున్నట్టుగానే రైతులు నామినేషన్‌ పత్రాలు తీసుకెళ్లారు. 60 మంది రైతులు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.సీఎం కేసీఆర్‌ బహిరంగ సభలో ఎర్రజొన్నలకు లాభం చేస్తామనీ, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటం వల్ల ప్రకటన చేయలేననీ చెప్పారు. ఈ ప్రకటనతో రైతులు నామినేషన్‌కు దూరంగా ఉంటారని టీఆర్‌ఎస్‌ నేతలు భావించారు. కానీ శుక్రవారం ఒక్క రోజే 55 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. దీంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కొంత ఆందోళన నెలకొంది. స్వయంగా సీఎం కుమార్తె పోటీ చేస్తున్న నియోజకవర్గంలో రైతులు నామినేషన్లు దాఖలు చేస్తే అపఖ్యాతి వస్తుందని టీఆర్‌ఎస్‌ అధినేత భావిస్తున్నట్టు సమచారం. దీంతో నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 28 వరకు గడువు ఉన్నప్పటికీ.. టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేస్తున్నారు

No comments:

Post a Comment