Breaking News

05/03/2019

నిధులకంటే నిర్లక్ష్యమే ఎక్కువ (ఖమ్మం)

ఖమ్మం, మార్చి 5  (way2newstv.in): 
మహిళ ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే స్త్రీనిధి రుణాలను వినియోగించుకోవడంలో చాలా వెనకబడ్డాం. గిరిజనులు ఎక్కువగా ఉన్న భద్రాద్రి జిల్లానే కాదు ఖమ్మానిదీ ఇదే పరిస్థితి. సాధారణంగా అభ్యర్థన పెట్టిన 48 గంటల్లో ఆయా ఖాతాలకు రుణం వచ్చే అవకాశం ఉన్నా వినియోగించుకోవట్లేదు. కర్ణుని చావుకు కారణాలెన్నో అన్నట్టు ఈ దుస్థితికి పలు రకాల సమస్యలు హేతువుగా మారాయి. అధికారులు మహిళలను చైతన్యం చేయడంలో విఫలమవుతున్నారు. అన్ని రకాల రుణాలపై లబ్ధిదారులకు కొరవడిన అవగాహనా సమస్యకు కారణమే. సాంకేతిక ఇబ్బందులు దీనికి తోడయ్యాయి. ఫలితంగా అర్హులు అప్పు కావాలంటే వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. రూ.3-5 వడ్డీలకు అప్పులు తీసుకొని ఆర్థికంగా చితికిపోతున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగింపునకు కొన్ని రోజులే వ్యవధి ఉండగా ‌ర్తనిధి రుణ లక్ష్యం మాత్రం చేంతాడంత ఉంది. వివరాల్లోకెళ్తే..
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 23 జిల్లాల్లో 992 గ్రామ సంఘాలు, 18599 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిల్లో లబ్ధిదారులు వేలల్లో ఉన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి స్త్రీ నిధిని ప్రవేశపెట్టారు. ఎవ్వరికైనా డబ్బులు అవసరమైతే రుణం అభ్యర్థించిన రెండు రోజుల్లో వస్తాయి. 


నిధులకంటే నిర్లక్ష్యమే ఎక్కువ (ఖమ్మం)

దీనిపై వడ్డీ సైతం తక్కువ.. రూ.1.4 మాత్రమే. అదే డబ్బులు వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకుంటే తడిసిమోపెడవుతుంది. భద్రాద్రి ఎక్కువ శాతం ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ గిరిజనులు అధికంగా ఉన్నారు. వీళ్లకు రుణాలపై పెద్దగా అవగాహన లేదు. నిరుపేదలు ఎక్కువ ఉండటంతో తీసుకున్నా కట్టలేమని భయాందోళనలకు గురవుతున్నారు. ఇంకొంత మంది స్త్రీనిధిలో రుణం కట్టకుంటే మిగిలిన సంఘ మహిళల నుంచి చీవాట్లు ఉంటాయన్న భావనలో ఉన్నారు. అందుకే వీటి జోలికెళ్లక బయట అప్పు తెచ్చుకొని ఇబ్బందులు పడుతున్నారు. చైతన్యం చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం.
భద్రాద్రి జిల్లాలో స్త్రీనిధి లక్ష్యం రూ.65.96 కోట్లుకాగా ఇప్పటికి 43.11 కోట్లు మాత్రమే రుణాలిచ్చారు. ఇంకా రూ.22.85 కోట్లు ఇస్తేనే అధికారులు నిర్దేశించిన లక్ష్యం పూర్తవుతుంది. వ్యవధి 40 రోజులు కూడా లేదు. రోజుకు రూ.80-90 లక్షలు ఇస్తే ప్రతిపాదిత లక్ష్యం పూర్తయ్యే అవకాశం ఉంది. ఇన్ని రోజులు పూర్తికానిది ఇప్పుడు అవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం పూర్తయినా రూ.195.81 కోట్ల వరకూ రుణాలిచ్చే అవకాశం ఉంది. అందుకు భిన్నంగా ప్రతిపాదితమే చేరుకునే అవకాశం కనిపించటం లేదు. ఆళ్లపల్లిలో ఇప్పటికి ఒక్కరికీ రుణం ఇవ్వలేదు. ఇక్కడ సమృద్ధి ఫండ్‌ కట్టక అర్హత సాధించలేకపోయారు.
పట్టణ ప్రాంతాల్లో రుణాలు ఇవ్వడంలో, తీసుకోవడంలో ఘోరంగా వెనకబడి ఉన్నారు. జిల్లాలో అమ్మదీవెన (పాల్వంచ), క్రాంతి (మణుగూరు), స్త్రీ శక్తి (ఇల్లెందు), భరతమాత (కొత్తగూడెం) సంఘాలున్నాయి. అమ్మదీవెనలో 7.72కోట్లు లక్ష్యంగా కాగా ఇప్పటికి రూ.3.55కోట్లు ఇచ్చారు. ఈ ఏడాది లక్ష్యం పూర్తైన రూ.23.77 కోట్లు వరకు ఇచ్చుకునే వీలుంది. భరతమాతలో రూ.5.86 కోట్లకు ఇప్పటికి 2.33 కోట్లు రుణాలిచ్చారు. ఇక్కడ రూ.17.77 కోట్లు ఇచ్చుకోవచ్చు. క్రాంతిలో రూ.2.93 కోట్లు లక్ష్యంకాగా కేవలం రూ.46.71 లక్షలే ఇచ్చారు. స్త్రీశక్తిలో 3.89 కోట్లు లక్ష్యం కాగా 1.94 కోట్లు మాత్రమే ఇచ్చారు. వీళ్లు ఈ ఏడాది రూ.12.71 కోట్లు వరకు ఇచ్చుకునే వీలుంది.
ఖమ్మం జిల్లాలో లక్ష్యం రూ.134.84కోట్లు కాగా ఇప్పటికి కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఖమ్మంలో వీవోలు 1302 ఉండగా ఎస్‌హెచ్‌జీలు 33,396 మంది ఉన్నారు. స్త్రీనిధి లక్ష్యం పూర్తయినా రూ. 267 కోట్లు ఇచ్చుకునే వీలుంది. ఖమ్మం జిల్లాలో గతేడాది రుణాలు భారీగా వినియోగించుకున్నారు. సుమారు 95శాతం వరకు సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఏడాది మాత్రం ఈ విషయంలో వెనకబాటుతనం కనిపిస్తోంది. దీనికి బాధ్యులెవరో, సమస్య ఎక్కడ ఉందో గుర్తించి సాధ్యమైనంత లబ్ధి చేకూర్చాలని బాధితులు వాపోతున్నారు.
స్త్రీనిధి వీవోలకు ట్యాబులు ఇచ్చారు. సాంకేతిక ఇబ్బందులతో ఇవి సక్రమంగా పనిచేయట్లేదు. ట్యాబ్‌ల వినియోగంపై శిక్షణ నిర్వహించినా చాలామందికి వాడకం తెలియట్లేదు. రుణం కోసం అభ్యర్థించాలంటే ట్యాబ్‌ నుంచే చేయాల్సి ఉంది. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేక రుణాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అధికారులు వెళ్లి వీటి వాడక వీవోలకు తెలియక రుణాలు మంజూరులో నిర్లక్ష్యం కూడా రెండు జిల్లాల్లో సమస్యకు ఓ కారణమని చెప్పొచ్చు.

No comments:

Post a Comment