Breaking News

05/03/2019

రైతన్న ఆశలపై పిడుగు (కరీంనగర్)

కరీంనగర్, మార్చి 5  (way2newstv.in):  
ఉమ్మడి జిల్లాలోని పత్తి రైతులు దీనస్థితిని ఎదుర్కొంటున్నారు. గంపెడాశలతో పత్తి సాగు చేస్తే.. ప్రతికూల పరిస్థితులు, తెగుళ్లతో దిగుబడి తగ్గి అన్నదాతలు ఆగం అవుతున్నారు. కనీస మద్దతు ధర లేక తలలు పట్టుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడే పత్తి ధరలు తగ్గటంతో పత్తిని విక్రయించేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. తగ్గిన పత్తి దిగుబడి ప్రభావం జిన్నింగ్‌ మిల్లులపై పడింది. సరిపడా పత్తి లభించక వారానికి ఒకట్రెండు రోజలే మిల్లుల నిర్వహణ జరుగుతుంది. ఈ ప్రభావం కార్మికులపై పడింది.
పత్తి మద్దతు ధర కల్పించాలని సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసినా.. నిబంధనల మేరకు నామమాత్రంగా కొనుగోళ్లు చేస్తున్నారు. పదేళ్ల క్రితం జిల్లాలో ప్రధానమైన జమ్మికుంట మార్కెట్‌ పత్తి విక్రయాలతో కళకళలాడగా, నేడు తగ్గిన పత్తి దిగుబడితో వెలవెలబోతుంది. స్థానికంగా ఉన్న 14 జిన్నింగ్‌ మిల్లుల్లో మూడేళ్లలోనే ఆర్థిక నిర్వహణ భారంతో నాలుగు మిల్లులు మూతపడగా, పది జిన్నింగ్‌ మిల్లుల నిర్వహణ జరుగుతుంది. 

 
రైతన్న ఆశలపై పిడుగు (కరీంనగర్)

రోజుకు ఒక్క మిల్లు నిర్వహణకు కనీసం 1,200 క్వింటాళ్ల పత్తి అవసరం కాగా, మార్కెట్‌కు కేవలం వెయ్యి క్వింటాళ్ల పత్తి విక్రయాలకు వస్తుంది. దీనితో పది మిల్లులకు సరిపడా పత్తి లభించని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని కరీంనగర్‌, చొప్పదండి, గంగాధర, హుజూరాబాద్‌, గోపాల్‌రావుపేట మార్కెట్లో పత్తి క్రయ,విక్రయాలు జరుగుతున్నా, హుజూరాబాద్‌, గోపాల్‌రావుపేట మార్కెట్లో అంతంత మాత్రంగానే పత్తి కొనుగోళ్ల జరిగాయి. పత్తి దిగుబడి తగ్గటంతో జిన్నింగ్‌ మిల్లుల నిర్వహణకు మిల్లర్లు తంటాలు పడుతున్నారు. ఈ ప్రభావం కార్మికులపై పడింది. వీరికి సరిగా పని దొరకని పరిస్థితి నెలకొంది. మిల్లుల్లో పని చేస్తే వారానికి కనీసం వెయ్యి రూపాయలు రావటం లేదని పలువురు కార్మికులు అంటున్నారు.
జమ్మికుంట మార్కెట్‌కు జిల్లా నుంచే కాక పెద్దపల్లి, వరంగల్‌ (అర్బన్‌), జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లాల రైతులు పత్తిని తీసుకొస్తారు. మార్కెట్‌లో కేవలం ఒక ట్రాలీకే బిడ్డింగ్‌ నిర్వహించి, మిగతా పత్తిని బిడ్డింగ్‌ లేకుండానే వ్యాపారులు ఇష్టమైన ధరను నిర్ణయిస్తారు. దీంతో పలువురు రైతులు ధరను పెంచాలని వ్యాపారులను బతిమిలాడిన సందర్భాలు నిత్యం కనిపిస్తున్నాయి. సీసీఐ ద్వారా ప్రస్తుత సీజన్‌లో కేవలం 13 వేల క్వింటాళ్ల పత్తిని ఖరీదు చేశారు. ఆధార్‌, రైతు ధ్రువీకరణ, పాస్‌పుస్తకం, బ్యాంక్‌ ఖాతా ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలనే నిబంధనతో పాటు వ్యాపారులతో ఉండే సంబంధాలతో అధికశాతం రైతులు ప్రైవేటుకే విక్రయిస్తున్నారు. పత్తి దిగుబడితో కనీసం రోజుకు 1,500 క్వింటాళ్ల పత్తి విక్రయాలకు రావడం గగనమైంది. రైతులు నాణ్యమైన పత్తిని సీసీఐకి విక్రయిస్తే మద్దతు ధరను పొందవచ్చు.

No comments:

Post a Comment