Breaking News

29/03/2019

కనిపించని గాలి బ్యాచ్

బెంగళూర్, మార్చి 29  (way2newstv.in)
దేశంలో రోజురోజుకూ ఎన్నికల వేడి రాజుకుంటోంది. వివిధ పార్టీల నేతలు తమ శక్తియుక్తులన్నింటినీ కూడదీసుకొని ఎన్నికల కదన రంగంలోకి ఉరుకుతున్నారు. ఇదే సమయంలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, నటీనటులు తాము అభిమానించే లేదా తమకు సానుకూలమైన అభ్యర్థులకు మేలు చేకూర్చేలా ప్రత్యక్షంగా, పరోక్షంగా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. కొంత మంది నేరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలాంటి తరుణంలో రెండు రాష్ట్రాల రాజకీయాలతో సంబంధం ఉన్న ఓ కీలక వ్యక్తి ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్‌ రెడ్డి.. ఈ పేరును తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. కర్ణాటకలోని బళ్లారి కేంద్రంగా ఏపీలోని అనంతపురం, కడప వరకు మైనింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించిన గాలి జనార్దన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడు. గాలి సోదరుల ప్రమేయం ఉన్న మైనింగ్ అక్రమాలకు సంబంధించిన కేసు అప్పట్లో దేశంలో సంచలనం సృష్టించింది. 


కనిపించని గాలి బ్యాచ్

పలు కేసుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్‌లతో పాటు కర్ణాటకలోనూ పలువురు అధికారులు అరెస్టైన విషయం తెలిసిందే. మైనింగ్ వ్యాపారం ద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన గాలి జనార్దన్ రెడ్డి.. కర్ణాటక రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. 2008లో ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలో గాలి పాత్ర ఎనలేనిది. ఆ ఎన్నికల్లో గాలి సోదరులతో పాటు మరో 10 మంది అనుచరులు గెలుపొందారు. పలువురు మంత్రి పదవులను కూడా దక్కించుకున్నారు. ఇదే సమయంలో ఇటు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌తో గాలి సోదరులు మంచి సంబంధాలు కొనసాగించారు. పరస్పర ప్రయోజనాలు పొందారు. రాజకీయంగా బద్ద శత్రువులైన పార్టీల్లో కొనసాగుతూ.. వీరు అత్యంత సన్నిహితంగా మెలగడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. గాలి సోదరులకు మేలు చేసేలా వ్యవహరించారని వైఎస్సార్ పలు ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. అంతేకాదు.. కర్ణాటకలో ఎన్నికల సమయంలో వైఎస్సార్.. గాలి సోదరుల తరపున ప్రచారంలోనూ పాల్గొన్నారు.రాజకీయాల్లో దశాబ్దాలుగా క్రియాశీలకంగా పనిచేసిన గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం స్తబ్దుగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చి 18 రోజులు గడుస్తున్నా.. ఆయన ఇప్పటిదాకా ఎక్కడా కనిపించలేదు. ఆయన అనుచరులు కూడా ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. గాలి ప్రధాన అనుచరుడు శ్రీరాములు కూడా రాజకీయాలతో అంటీముట్టనట్లు వ్యవహరించడం ఆసక్తికర చర్చకు తావిస్తోంది. రాజకీయాలకు తాత్కాలికంగా దూరంగా ఉండాలని గాలి సోదరులను బీజేపీ అధిష్టానమే ఆదేశించినట్లు కన్నడవాసులు చర్చించుకుంటున్నారు. 2018 కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి గాలి అక్రమాలు ప్రధాన కారణమని ఆ పార్టీ భావిస్తోందని.. లోక్‌సభ ఎన్నికల్లో ఆ ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతోందని చెబుతున్నారు. ఏపీలో వైఎస్ జగన్ తరపున ప్రచారం చేయడంలో గాలి సోదరులు బిజీగా ఉన్నారని మరికొంత మంది భావిస్తున్నారు. కానీ, ఏపీలోనూ వారి జాడ లేదన్నది స్పష్టం. మైనింగ్ అక్రమాలకు సంబంధించిన కేసుల్లో అరెస్టైన గాలి జనార్దన్ రెడ్డి.. ఆ కేసుల నుంచి బయటపడే పనిలో బిజీగా ఉన్నారని.. ఆ కారణంగానే బయట ఎక్కడా కనిపించడం లేదని మరికొందరి వాదన. కారణమేదైనా కావొచ్చు గానీ.. గాలి జనార్దన్ రెడ్డిపై ఇరు రాష్ట్రాల్లో చర్చ మాత్రం జోరుగా నడుస్తోంది. 

No comments:

Post a Comment