హైద్రాబాద్, ఫిబ్రవరి 16, (way2newstv.in)
తెలంగాణ రాష్ట్ర కొత్త విద్యాశాఖా మంత్రి కోసం వేలాది ఫైళ్లు ఎదురుచూస్తున్నాయి. ప్రాధమిక విద్య, మాధ్యమిక విద్యాశాఖ, పాఠశాల విద్య, సాంకేతిక విద్యా శాఖ, ఉన్నత విద్యాశాఖల ఫైళ్లతో పాటు ఉన్నత విద్యా మండలి, సైట్, ఎస్సీఈఆర్‌టీ, బోర్డు ఆఫ్ ఎగ్జామ్స్, ఎన్‌సీసీ, ఎయిడెడి విద్యాసంస్థల ఫైళ్లు ఎదురుచూస్తున్నాయి. అధికారుల స్థాయిలోనే ఫైళ్లను నిలిపివేశారు. కొన్ని ఫైళ్లు మంత్రిస్థాయికి, మరికొన్ని న్యాయశాఖ ఆమోదంతో సాధారణ పరిపాలన శాఖకు, ముఖ్యమంత్రి ఆమోదం కోసం వెళ్లాల్సినవి ఉన్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల అనుమతి లేనిదే ఏ ఫైళ్లనూ పైకి పంపించలేమని సచివాలయ అధికారులు చెబుతున్నారు. మెడికల్ బిల్స్‌కు సంబంధించిన ఫైళ్లు సైతం చాలా వరకూ పెండింగ్‌లో పడ్డాయి.
విద్యా మంత్రి కోసం... ఫైళ్లు నిరీక్షణ
పరీక్షలు, బదిలీలు, పదోన్నతుల ఫైళ్లు, మధ్యాహ్న భోజన పథకం బిల్లుల ఫైళ్లు, ఉమ్మడి సర్వీసుల వివాదం కొలిక్కిరావడంతో స్కూల్ అసిస్టెంట్ మొదలు గెజిటెడ్ హెడ్మాస్టర్ వరకూ వివిధ స్థాయిల్లో పదోన్నతులు, ఉన్నతీకరించిన పండిట్ పోస్టుల్లో ఫీడర్ కేటగిరి అయిన ఎస్‌జీటీలకు అవకాశం కల్పించే అంశంపైనా నిర్ణయాలను తీసుకోవల్సి ఉంది. అర్హులైన ఎస్‌జీటీలకూ పండిట్ గ్రేడ్-1 పోస్టుల్లో అవకాశం కల్పించాలని కోరుతునే ఉన్నారు. ఎన్‌సీటీఈ ప్రకారం జీవో 11,12లను అనుసరించి అన్ని పోస్టులకు కామన్ సీనియారిటీ ప్రకారం ఫీడర్ కేటగిరిలో ఉన్న వారితో భర్తీ చేయాలని, టీఆర్‌టీ నియామకాలకు రూపొందించిన అర్హతలను ప్రస్తుత పదోన్నతులకూ వర్తింపచేయాలని వారు కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 17,18లను హైకోర్టులో సవాలుచేశామని, వాటిని హైకోర్టు కొట్టివేసిందని వారు గుర్తుచేశారు. అప్‌గ్రేడేషన్ చేసిన పోస్టుల్లో అర్హతలున్న ఎస్‌జీటీలకు అవకాశం కల్పించాలని, ప్రాథమికపాఠశాల విద్యారంగానికి పునాది వంటిదని, ప్రతి పాఠశాలకు పీఎస్ హెచ్‌ఎంలను కేటాయించాలని, తద్వారా సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతి లభిస్తుందని పేర్కొన్నారు. చాలా ప్రాధమిక పాఠశాలలు ఒకరు లేక ఇద్దరు ఉపాధ్యాయులతో నడుస్తున్నాయని, అలాగే ఉపాధ్యాయులకు అదనంగా హెచ్ ఎం బాధ్యతలు ఇవ్వడంతో ఐదు తరగతులు, 18 సబ్జెక్టుల్లో నాణ్యమైన , గుణాత్మక విద్యను ఎలా ఆశించగలుగుతామని వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి గత ఏడాది మే 5వ తేదీన ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ఐదు గంటలకు పైగా చర్చలు జరిపి అనేక సమస్యల పరిష్కారానికి సంబంధించి నిర్ధిష్టమైన హామీని ఇచ్చారు. జూన్ 2న ఐఆర్, ఆగస్టు 15న ఫిట్‌మెంట్ ఇస్తామని అన్నారని, అలాగే దూర ప్రాంతాల్లో పనిచేసే భార్యా భర్తలు ఒకే చోట పనిచేసేందుకు అవకాశం కల్పించడం, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు నెల నెలా రెగ్యులర్ జీతాలు చెల్లింపు, హెల్త్ కార్డుల జారీ, అవినీతికి ఆస్కారం లేకుండా ఎల్‌టీసీ అమలుచేస్తామని సీఎం పేర్కొన్నారని, కానీ అవేవీ అమలుకావడం లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు వాపోతున్నారు. విద్యాశాఖకు మంత్రి వస్తే వాటిని ఆయన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తామని వారు చెబుతున్నారు.
No comments:
Post a Comment