Breaking News

07/02/2019

సిరుల పంట క్వినోవా..

మంచిర్యాల, ఫిబ్రవరి 06, 2019 (way2newstv.in)
ఇటీవలిగా ప్రజాల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. చాలామంది సిరిధాన్యాలను సేవించేందుకు మొగ్గుచూపుతున్నారు. దీనికి తగ్గట్లే సిరిధాన్యాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. డిమాండ్ ను బట్టి రేటూ ఎక్కువగానే ఉంటోంది. దీంతో రైతులు చిరుధాన్యాలు పండిస్తే వారికీ లాభదాయకంగా ఉంటుందని ఆహార, వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయాధికారులు చిరుధాన్యాలపై రైతులను అవగాహన కల్పిస్తున్నారు. ఈ తరహా పంటలు పండించాల్సిందిగా సూచిస్తున్నారు. రైతులు కూడా మిల్లెట్స్ పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిరుధాన్యాలు పండించేవారి సంఖ్య పెద్ద మొత్తంలో లేకపోయినా పండిస్తున్న కొద్ది మందిని చూసైనా మిగిలినవారు ఈ పంటలపై ఆసక్తి చూపుతారని అధికారులు భావిస్తున్నారు. 


 సిరుల పంట క్వినోవా..

ఇదిలాఉంటే చిరుధాన్యాల్లో క్వినోవాకు డిమాండ్ ఎక్కువగా ఉంది. రైతులు ఈ పంట పండిస్తే వారికీ ఉపయుక్తంగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. క్వినోవాకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. పాశ్చాత్య దేశాల్లో క్వినోవా సేవించేవారు అధికం. క్వినోవా మంచి పోషకాహార విలువలు కలిగిన ఆహారపంట కావడమే కారణం. క్వినోవాలో 14-18శాతం మాంసకృత్తులు, లైసీన్‌తో పాటు అరుదైన అమైనో అమ్లాలు మెండుగా ఉంటాయి. అంతేకాక బి,ఇ విటమిన్లు, ఇనుము, కాల్షియం, మెగ్నిషీయం, పీచుపదార్థాలు అధికం. 
క్వినోవా డిమాండ్ ఉన్న ఆహార పంట. ఈ పంటను పండిస్తే రైతులు ఆర్ధికంగానూ మెరుగుపడే అవకాశాలు ఉంటాయని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ పంట విషయానికి వస్తే క్వినో మొక్కలు 1.5మీటర్‌ ఎత్తు వరకు పెరుగుతాయి. ప్రస్తుతం క్వినోవాను విత్తనం కోసమే సాగు చేస్తున్నారు. వీటి విత్తనాల్లో మంచి పోషకాలు ఉన్నప్పటికీ  పైపొరలో సాపోనిన్లు ఉండడం వల్ల చేదు రుచి వస్తుంది. విత్తన పైపొరను తొలగించాలి. రైతులు సాగు చేసేటప్పుడు వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుని సాగుచేస్తే మార్కెటింగ్‌ ఇబ్బందులు ఉండవని అధికారులు సూచిస్తున్నారు. ఈ పంటను ఎర్ర చల్కానేలలు, నీరు ఇంకే నేలల్లో సాగు చేయవచ్చని చెప్తున్నారు. క్వినోవా పంటకు చౌడు భూములు పనికిరావని స్పష్టంచేస్తున్నారు. ఇటీవలిగా చిరుధాన్యాలు ప్రధాన ఆహారంగా మారుతున్నాయి. ఈ క్రమంలో క్వినోవాకు కూడ ఆదరణ పెరిగింది. తెలంగాణలో కొన్నేళ్లుగా రైతులు పత్తి సాగుకు ప్రాధాన్యతనిస్తున్నారు. కష్టనష్టాలకోర్చి పత్తిని సాగు చేస్తున్నా చివరికి చేతికి అందుతున్నది మాత్రం అంతంతమాత్రమే. దీంతో శాస్త్రవేత్తలు ఇటీవల పత్తికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల వైపు రైతులు మళ్ళాలని సూచిస్తున్నారు. రాగులు, సజ్జలు, కొర్రలు, అండుకొర్రలు, క్వినోవా, జొన్న, మొక్కజొన్న లాంటి పంటలను పండించాలని అవగాహన కల్పిస్తున్నారు. 

No comments:

Post a Comment