అంతా అబద్దం : ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 23, (way2newstv.in)
తెలంగాణ శాసనసభ శనివారం రెండవరోజు ప్రారంభమయింది. సభ ప్రారంభం కాగానే మాజీ గవర్నర్ ఎన్డీ తివారితో పాటు ఇటీవల మృతి చెందిన 16 మంది మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలుపుతూ తీర్మానం చేసారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం సభ్యులంతా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. తరువాత బడ్జెట్ పై చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్ సభ్యుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే బాగుంటుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు బడ్జెట్ కోసం ఎదురు చూశారన్నారు. ప్రతి సంవత్సరం ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతామన్నారు. మన ఆర్థిక పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే దిక్సూచి ఆర్థిక సర్వే అని పేర్కొన్నారు.
నిధులు తీసుకురాలేకపోయారు : శ్రీధర్ బాబు
ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెట్టలేక పోయారని విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురాలేక పోయారు. . కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు హామీలను సాధించలేదన్నారని అన్నారు. బడ్జెట్లో పంచాయతీలకు నిధుల ప్రస్తావన లేదని, కాంగ్రెస్ పార్టీ వల్లే 24 గంటల కరెంట్ సాధ్యమైందని, టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో ఆరాచకం సృష్టిస్తోందని ఆరోపించారు. శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. శ్రీధర్బాబు సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో పంచాయతీలకు నిధుల ప్రస్తావన లేదనడం అబద్ధమన్నారు. గ్రామపంచాయతీలకు 40 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. గ్రామాల్లో మీ హయాంలో కొనసాగిన ఆరాచకాన్ని భవిష్యత్లో కొనసాగనివ్వమని స్పష్టం చేశారు. గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దుతాం. అద్దాల్లాంటి గ్రామాలు తయారు చేసి చూపిస్తామని కేసీఆర్ ఉద్ఘాటించారు. గ్రామాల్లో పన్నులు వసూలు చేయిస్తాం. పెండింగ్లో ఉన్న బకాయిలను వంద శాతం వసూలు చేయిస్తాం. మంచినీళ్లు ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సోలార్ విద్యుత్ లేనే లేదు. ఇది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 40 నెలల్లో కేటీపీఎస్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను నిర్మించామని అన్నారు. తెరాస ప్రభుత్వ హయాంలో 3600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. సోలార్ పవర్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో ఉందని తెలిపారు. విద్యుత్ తలసరి వినియోగంలో రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉందని వెల్లడించారు. పంచాయతీలను పటిష్టం చేసేందుకే కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకువచ్చామన్నారు. ఆరాచక వ్యవస్థకు అంతం పలికి.. ప్రజలకు ఎలాంటి బాధలు లేకుండా చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేసారు.
No comments:
Post a Comment