Breaking News

18/02/2019

వికారాబాద్ లో 2 లక్షల మందికి పాస్ బుక్స్

వికారాబాద్, ఫిబ్రవరి 18, (way2newstv.in)
జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లో 7.68 లక్షల ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయి. వీటిలో రెండు లక్షల మందికిపైగా రైతులు వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. వీరందరి భూములకు సంబంధించి గతంలో వేర్వేరుగా పట్టాదారు పాసుపుస్తకం, భూమి యాజమాన్యపు హక్కు పత్రాలను వేర్వేరుగా పంపిణీ చేశారు. తాజాగా ప్రభుత్వం రెండింటిని ఒకే పట్టా పాసుపుస్తకంలో ముద్రించి అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. అందుకు రెవెన్యూ అధికారులు జిల్లాలోని భూదస్త్రాలను మరోసారి పరిశీలిస్తున్నారు. పరిశీలన పూర్తైన వెంటనే తహసీల్దార్ల డిజిటల్‌ సంతకాలతో పాసుపుస్తకాల ముద్రణ ప్రారంభించేందుకు రెవెన్యూ ఉన్నతాధికారులు సన్నద్ధమయ్యారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు మార్చి 11 నుంచి గ్రామాల వారీగా పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు.ఇప్పటివరకు అందుబాటులో ఉన్న పట్టా పాసుపుస్తకాలకు భిన్నంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమగ్ర సమాచారంతో ముద్రించి, అందించనున్నారు. 



వికారాబాద్ లో 2 లక్షల మందికి పాస్ బుక్స్

రైతుల భూముల విస్తీర్ణంతోపాటు వాటి చుట్టూ ఉన్న భూముల యాజమానుల వివరాలను  సైతం పొందుపరచనున్నారు. భూమికి సంబంధించి పటాన్ని కూడా పుస్తకంలో ముద్రిస్తారు. క్రయవిక్రయాల వివరాలను సైతం నమోదు చేయనున్నారు. ఇదే జరిగితే భూ తగాదాలకు ఆస్కారం ఉండదు. ఇప్పటివరకైతే హద్దులు, పటాలను పొందేందుకు భూ యజమానులు మీ-సేవా కేంద్రాల్లో నిర్ణీత రుసుం చెల్లించి నెలలు, సంవత్సరాల తరబడి తహసీల్‌ కార్యాలయాలకు చక్కర్లు కొట్టాల్సి వచ్చేది. తాజాగా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే పుస్తకాల్లో ముద్రించి ఇవ్వనుండటంతో రైతులకు భూములకు దస్త్రాలపరంగా మరింత భద్రత లభించనుంది.కొత్త పాసుపుస్తకాల కోసం రైతుల ఫొటోలను సేకరించారు. వాటిని పుస్తకాల్లో అంటిస్తారు. వీటితోపాటు ఆధార్‌ నమోదు సమయంలో తీసుకున్న రైతు ఫొటో, వేలిముద్రలను కూడా పుస్తకంలో ముద్రించనున్నారు. ఇది బోగస్‌ పట్టా పాసుపుస్తకాల తయారీకి దోహదపడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంటలు కోల్పోయినప్పుడు బాధిత రైతులకు ప్రభుత్వం అందించే పరిహారాన్ని నేరుగా ఖాతాల్లో జమ చేసేందుకు వీలుగా పట్టా పాసుపుస్తకాల్లో ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతా సంఖ్యలను ముద్రించేందుకు ఖరారు చేశారు. పెట్టుబడి రాయితీ, నష్టపరిహారం సమాచారాన్ని, వివిధ సందర్భాల్లో సేద్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తెలిపేందుకు అన్నదాతల సెల్ ఫోన్  సంఖ్యలను సైతం పట్టా పాసుపుస్తకాల్లో ముద్రిస్తారు. ప్రస్తుతం పంట రుణాలు, రాయితీ పరికరాలు పొందాలంటే సంబంధిత రైతులు ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకాలను సమర్పించాల్సి వచ్చేది. తాజాగా పాసుపుస్తకాలను ఇస్తే పరిపోతుంది.

No comments:

Post a Comment