నిజామాబాద్, ఫిబ్రవరి 18, (way2newstv.in)
పసుపు, ఎర్రజొన్నల తాలూకు నిరసనల సెగ అంతకంతకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఎర్రజొన్న, పసుపు పంటలకు గిట్టుబాటు ధరను ప్రకటించి ప్రభుత్వ పరంగానే సేకరించాలని చేస్తూ గడిచిన పది రోజుల వ్యవధిలోనే మూడు పర్యాయాలు అన్నదాతలు రోడ్డెక్కి నిరసనలు చాటారు. వేలాది మంది రైతులు ఈ ఉద్యమంలో భాగస్వాములవుతూ తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతుండడంతో ఎక్కడ పరిస్థితులు చేయిదాటిపోయి ఉద్రిక్తతలు రాజుకుంటాయోననే ఆందోళనతో పోలీసు అధికారులు కంటిమీద కునుకు లేకుండా బందోబస్తు విధుల్లో నిమగ్నమవుతున్నారు. పెర్కిట్‌తో పాటు జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ వద్ద వేర్వేరుగా 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఇరువైపులా బైఠాయించారు. దర్పల్లి మండల కేంద్రంలోనూ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఒకేసారి మూడు వేర్వేరు ప్రాంతాల్లో వేలాదిగా రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయాయి.
పసుపు, ఎర్రజొన్నల రైతుల నిరసనల సెగ
ఈసారి ఆందోళనలో భాగస్వాములైన మహిళా రైతులు రహదారిపైనే వంటావార్పు చేపట్టి నిరసన తెలిపారు. ఆర్మూర్, మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్‌పల్లి, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, భీమ్‌గల్, జక్రాన్‌పల్లి, వేల్పూర్, సిరికొండ, నందిపేట, దర్పల్లి, ఇందల్వాయి మండలాలకు చెందిన వేలాది మంది రైతులు పై మూడు ప్రాంతాల్లో వేర్వేరుగా ప్రధాన రహదారులపై బైఠాయించారు. రైతుల ఆందోళనను అడ్డుకునేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తుగానే ఆర్మూర్ డివిజన్‌లోని 11మండలాలతో పాటు డిచ్‌పల్లి, దర్పల్లి మండలాల పరిధిలోనూ 144సెక్షన్‌ను విధిస్తున్నట్టు ప్రకటించింది. ఎర్రజొన్న రైతులు ఆందోళన నిర్వహించిన సందర్భంగా పరిస్థితులు కాల్పు ల వరకు దారి తీయడం, ఈ అంశంపై చాలారోజుల పాటు తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగిన విషయం విదితమే. దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులను రెచ్చగొడితే పరిస్థితులు మళ్లీ చేయిదాటిపోయే ప్రమాదం ఉంటుందనే భావనతో పోలీసు అధికారులు సంయమనం పాటించారు. పోలీస్ కమిషనర్ కార్తికేయ స్వయంగా క్షేత్రస్థాయిలో ఉండి బందోబస్తును పర్యవేక్షించారు. అయితే సుమారు 4వేల మంది వరకు రైతులు హాజరైనప్పటికీ, ఎలాంటి దుందుడుకు చర్యలకు దిగకుండా తమ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రజాస్వామ్య పంథాలోనే నిరసన తెలియజేశారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నప్పటికీ, తాము పార్టీలకు అతీతంగా ఉద్యమం కొనసాగిస్తున్నామని, తమ డిమాండ్లను పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతమని ఎర్రజొన్న, పసుపు రైతులు స్పష్టం చేశారు. ఎర్రజొన్న పంటకు ప్రస్తుతం క్వింటాలుకు 1600రూపాయలు మాత్రమే ధర చెల్లిస్తామని వ్యాపారులు చెబుతుండగా, రైతులు మాత్రం కనీసం 3500 రూపాయల మద్దతు ధర ప్రకటిస్తూ, ప్రభుత్వపరంగా కొనుగోలు చేయాల ని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా పసుపు పంటకు క్వింటాలుకు 15వేల రూపాయల ధర ప్రకటించాలని కోరుతున్నారు. కాగా, ఓ వైపు రైతు ల ఉద్యమం అంతకంతకూ ఉద్ధృతరూపం దాలుస్తున్నప్పటికీ, మద్దతు ధర, పంట సేకరణ విషయంలో ప్రభుత్వం నుండి ఇప్పటివరకు నామమాత్రంగానైనా స్పందన లేకపోవడం అన్నదాతను అసహనానికి గురి చేస్తోంది. ప్రభుత్వం స్పష్టత ఇచ్చేంత వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేద ని, తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని పసుపు, ఎర్రజొన్న రైతులు చెబుతున్నారు.
No comments:
Post a Comment