Breaking News

08/01/2020

రాజధానిపై ఆచితూచి అడుగులు

విజయవాడ, జనవరి 8  (way2newstv.in)
రాజధానిపై చట్టసభల్లో ప్రభుత్వ నిర్ణయానికి ఎదురులేకుండా చేసుకునేందుకు ఉభయసభల సంయుక్త సమావేశానికి తెర తీస్తోంది వైసీపీ ప్రభుత్వం. అసెంబ్లీలో తిరుగులేని ఆధిక్యంతో ఉన్న ప్రభుత్వానికి మండలిలో మాత్రం బ్రేకులు పడుతున్నాయి. దానిని ఎదుర్కోవడంపైనే ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. రెండు సభల్లో కలిపి చూస్తే ప్రతిపక్షాల బలం అంతంతమాత్రమే. చట్టంతో సంబంధం లేకుండా రాజధాని తరలింపును ప్రభావితం చేయగల రాజకీయ సామర్థ్యం కేంద్రానికి మాత్రమే ఉంది. మా పరిధి కాదు, అయినా చూస్తూ ఊరుకోమంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది కేంద్రం. రెండు కమిటీల రిపోర్టులపై హైపవర్ కమిటీ అధ్యయనానికి ఆ పై కేబినెట్ సమావేశాలకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. 
రాజధానిపై ఆచితూచి అడుగులు

రైతులు, రాజకీయ ఒత్తిడులకు సర్కారు తలొగ్గుతుందా? లేక రాజే తలచుకుంటే అన్నట్లుగా ముందుకే సాగుతుందా? అన్నదే ఇప్పుడు అందర్నీ తొలిచేస్తున్న ప్రశ్న.అమరావతి గ్రామాల రైతులు సంఘీభావాన్ని సాధించగలిగారు. అధికార పక్షమైన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని మినహాయిస్తే మిగిలిన పార్టీలన్నీ వారికి మద్దతు ప్రకటిస్తున్నాయి. గడచిన 20 రోజులుగా సాగిస్తున్న ఉద్యమానికి , ఆందోళనకు తమవంతు సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి. సహకారం అందిస్తున్నాయి. కేవలం 29 గ్రామాలకు చెందిన అంశం కాదు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయమన్న విషయంలో రెండో అభిప్రాయం లేదు. పరిపాలన సౌలభ్యం, సత్వర ప్రగతి , ప్రజామోదం వంటివి రాజధానికి చాలా కీలకం. అయితే ప్రజాస్వామ్యంలో వీటన్నింటికంటే సెంటిమెంటు ముఖ్యపాత్ర పోషిస్తోంది. రాజకీయ నాయకులు తాము తీసుకునే నిర్ణయాలను ఈ కోణంలోంచే చూస్తున్నారు. అందుకే ప్రస్తుతం రాజధాని నిర్ణయంలోనూ ప్రాంతాలవారీ భావోద్వేగాలు ముప్పిరిగొంటున్నాయి. నిర్ణయం వెనక మంచి చెడ్డలపై సాగాల్సిన చర్చ సాగకుండా ఈ సెంటిమెంట్స్ అడ్డుపడుతున్నాయిప్రభుత్వంతో చట్టబద్ధమైన ఒప్పందం ద్వారానే రైతులు భూసమీకరణలో తమ పొలాలను అప్పగించారు. రైతులు ఇచ్చిన భూములకు ప్రత్యామ్నాయంగా నాలుగింట ఒక వంతు స్థలాలను అభివ్రుద్ధి చేసి కేటాయించడం ఒప్పందంలోని ప్రధానాంశం. రాజధాని పక్కాగా రూపుదాలిస్తే ఆయా భూముల విలువ పది, పన్నెండు రెట్లు పెరుగుతుందనే ఉద్దేశంతోనే అన్నదాతలు ముందుకొచ్చారనేది నిర్వివాదాంశం. అందుకే గత ప్రభుత్వ నిర్ణయానికి 29 గ్రామాల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. దేశ చరిత్రలోనే భూసమీకరణ అన్న కొత్తవిధానం రూపుదిద్దుకుంది. రాజధాని కుచించుకుపోయి నామమాత్రంగా శాసనసభ ఏక కాల సమావేశాలకే పరిమితమైతే రైతులకు ఆర్థిక ప్రయోజనం దక్కదు. ప్రభుత్వం రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించి కట్టబెట్టినా గ్రామీణ వాతావరణంలో వాటిని విక్రయించడమే కష్టతరం. అందువల్ల చర్చలకు తావు లేకుండా రాజధానిని ఇక్కడే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. నైతికంగా, రాజకీయంగా వారు మద్దతు కూడగట్టగలుగుతున్నారు. కానీ ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు వెళ్లాలని భావిస్తే నిరోధించగల సామర్థ్యం వారికి లేదు.చట్టపరంగా, న్యాయపరంగా భూసమీకరణ ఒప్పందాల్లోని అంశాలపై చర్చ మొదలైంది. అధికారికంగా రాజధానిని వేరే చోటికి మార్చినట్లు ప్రభుత్వం ప్రకటిస్తే చట్టపరంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు అవకాశం ఉంటుంది. ఇంతవరకూ మంత్రులు, ప్రభుత్వ వర్గాలు చేస్తున్న ప్రకటనలకు చట్టపరంగా పెద్దగా చెల్లుబాటు ఉండదు. అందుకే వాటి ఆధారంగా న్యాయస్థానాల్లో వ్యాజ్యం నడపడం కష్టతరం. ప్రభుత్వం కేబినెట్ సాక్షిగా ఒక నిర్ణయం తీసుకుని ఆమేరకు కార్యాచరణ ప్రారంభించిన తర్వాతనే చట్టపరమైన పోరాటం ప్రారంభమవుతుందని చెప్పాలి. ఒప్పందంలో ఏమేరకు ప్రభుత్వం నుంచి హామీలు ఇచ్చారు? వాటిని ఉల్లంఘిస్తే చెల్లించాల్సిన పరిహారాలేమిటనే విషయాలపైనా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. రాజధానికి చేసిన భూసమీకరణ ఒప్పందాల్లో సర్కారే ఉల్లంఘనలకు పాల్పడితే 2013 నాటి భూసేకరణ చట్టం ప్రకారం పరిహారాలు చెల్లించాలనే షరతు ఉందని రైతుల తరఫున వాదనలు ముందుకు వస్తున్నాయి. 34 వేల ఎకరాల కు పరిహారం చెల్లింపు అంటే 70వేల కోట్ల రూపాయల పైచిలుకే. అంతటి చెల్లింపు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇటువంటి పరిస్థితులను కూడా ఊహించి వైసీపీ సర్కారు మధ్యేమార్గం అనుసరిస్తుందా? అనే వాదన కూడా ఉంది.బోస్టన్ కమిటీ సూచించిన మొదటి ఆప్షన్ ప్రభుత్వానికి రెండు విధాలా రాజకీయ వెసులుబాటును కల్పించింది. జీఎన్ రావు కమిటీ నివేదికలో సైతం డిపార్టుమెంట్లు, కమిషనరేట్లు విజయవాడ, గుంటూరు మధ్య ఏర్పాటు చేయాలనే భావన వ్యక్తమైంది. ప్రభుత్వ రాజకీయ నిర్ణయమే అంతిమం. చట్టసభలో ఆమోదం పెద్ద పనేం కాదు.తన ఆలోచనలకు అనుగుణంగా రాజధానులపై ఉభయసభల సంయుక్త సమావేశంలో మమ అనిపించేందుకు సర్కారు సిద్ధమవుతోందని సమాచారం. అయితే విస్తృత ఏకాభిప్రాయం, చట్ట, న్యాయపరమైన అవరోధాలు లేకుండా ముందుకు వెళ్లేందుకు అనుసరించే వ్యూహమే ఇప్పుడు కీలకం

No comments:

Post a Comment