Breaking News

08/01/2020

హేమంత్ కు కానరాని సెంటిమెంట్

న్యూఢిల్లీ, జనవరి 8   (way2newstv.in)
బీహార్ ను విభజించి 2000 నవంబరు 15న ప్రత్యేక రాష్ట్రంగా జార్ఖండ్ ను ఏర్పాటు చేశారు. అప్పటి కేంద్రంలోని వాజ్ పేయి ప్రభుత్వం చిన్న రాష్ట్రాల విభజనకు అనుకూలంగా జార్ఖండ్ ను ఏర్పాటుచేసింది. గిరిజనుల ప్రాబల్యం గల రాష్ట్ర సహజవనులకు నిలయం. అయినప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. పాలకులు దూరదృష్టితో వ్యవహరిస్తే రాష్ట్ర పరిస్థితి మరోరకంగా ఉండేది. వెనకబడిన రాష్ట్రమైనప్పటికీ జార్ఖండ్ ప్రజల్లో చైతన్యం ఎక్కువే. పనిచేయని ప్రభుత్వాలను, ముఖ్యమంత్రులను ఇంటికి పంపించడం సిద్ధహస్తులు. మాటల కన్నా చేతలే ముఖ్యమని రాష్ట్ర ప్రజలు ఎన్నికల ద్వారా ప్రతిసారీ నిరూపిస్తున్నారు. కానీ నాయకులే దానిని సరిగా అర్థం చేసుకోలేక బోల్తా పడుతున్నారు. పనితీరే తప్ప పార్టీలు, నాయకులు, విధానాలు తమకు ముఖ్యం కాదని ప్రజలు విస్పష్టంగా ప్రతి ఎన్నికల్లోనూ తేల్చి చెబుతున్నారు.
హేమంత్ కు కానరాని సెంటిమెంట్

రాష్ట్రం ఆవిర్భవించిన ఈ 19 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి రెండోసారి ఆ పీఠాన్ని దక్కించుకోలేక పోయారు. ఏ పార్టీ రెండోసారి అధికారాన్ని సాధించలేక పోయింది. ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలనూ ఇక్కడి ప్రజలు ఆదరిస్తున్నారు. తమకు ఎదురేలేదని విర్రవీగిన నాయకులను ఎత్తి కిందపడేస్తున్నారు. ఈ 19 ఏళ్లలో ఆరుగురు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వారిలో ఒక్క రఘుబర్ దాస్ తప్ప ఏ ముఖ్యమంత్రి పూర్తికాలం పదవిలో కొనసాగలేకపోయారు. ఇప్పటి వరకూ మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ప్రతి సారీ ఏదో ఒక సంచలనం నమోదవుతుంది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాబూలాల్ మరాండీ 2000 నవంబరు 15 నుంచి 2003 మార్చి వరకూ కొనసాగారు. ఆయన స్థానంలో అర్జున ముండా అధికారాన్ని అందుకున్నారు. 2003 మార్చి 18 నుంచి 2005 మార్చి 2 వరకూ సీఎంగా పని చేశారు. 2005 ఎన్నికల్లో బీజేపీని ఓడించి జేఎంఎం నేత శిబూ సోరెన్ ముఖ్యమంత్రి అయ్యారు. సోరెన్ కుమారుడు ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. అసెంబ్లీలో బలం నిరూపించలేక శిబూ సోరెన్ పదిరోజుల్లోనే రాజీనామా చేశారు. అనంతరం బీజేపీ నేత అర్జున్ ముండా సీఎం అయ్యారురాజకీయ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల కారణంగా 2006 సెప్టంబరులో స్వతంత్ర శాసనసభ్యుడు మధుకోడా అనూహ్య పరిస్థితుల్లో సీఎం అయ్యారు. అవినీతి కేసుల్లో చిక్కుకుని మధుకోడా రాజీనామా చేయడంతో 2008 ఆగస్టు 27న జేఎంఎం అధినేత శిబు సోరెన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయ అనిశ్చితి కారణంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం అధినేత శిబూ సోరెన్ విజయం సాధించి సీఎం అయ్యారు. ఈ దఫా కేవలం అయిదు నెలలే పదవిలో కొనసాగారు. రాజకీయ అనిశ్చితి కారణంగా రాష్ట్రపతి పాలన విధించారు. అనిశ్చితి తొలగడంతో 2011 సెప్టెంబరులో బీజేపీ నేత అర్జున్ ముండా మళ్లీ సీఎం అయ్యారు. 2013 జనవరి 18 వరకూ ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. రాజకీయ అనిశ్చితి కారణంగా మళ్లీ రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలన తొలగించిన తర్వాత 2013 జులై 13న జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టారు. 2014 డిసెంబరు వరకూ ఆయన పదవిలో కొనసాగారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం ఓడిపోయింది. ఘన విజయం సాధించిన బీజేపీ ఓబీసీ నాయకుడు రఘుబర్ దాస్ ను సీఎంగా ఎంపిక చేసింది. అయిదేళ్ల పాటు ఆయన తిరుగులేని నాయకుడిగా కొనసాగారు.రాష్ఱ్రంలో ఐదేళ్ల పాటు పూర్తి కాలం పదవిలో ఉన్న నాయకుడిగా రికార్డు సృష్టించారు. 2019 డిసెంబరు 21న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో ఏ పార్టీ రెండోసారి గెలిచిన సందర్భం లేకుండా పోయింది. మాజీ ముఖ్యమంత్రి రఘుబార్ దాస్ తప్ప మాజీ సీఎంలు అందరూ గతంలో అసెబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన వారే కావడం విశేషం. మొదటి ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండి, అర్జున్ ముండా, శిబుసోరెన్, హేమంత్ సోరెన్, మధుకోడ గతంలో వివిధ సందర్భాల్లో ఓటమి పాలయ్యారు. రాష్ట్రానికి మూడుసార్లు సీఎంగా పనిచేసిన బీజేపీ నేత అర్జున్ ముండాకు కూడా ఓటమి అనివార్యమైంది. బీజేపీ సీఎం రఘుబర్ దాస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జంషెడ్ పూర్ తూర్ప లో ఆయన స్వతంత్ర అభ్యర్థి సరయు రాయ్ చేతిలో ఓటమి పాలయ్యారు. రాయ్ నిన్న మొన్నటి దాకా దాస్ మంత్రివర్గ సహచరుడు కావడం గమనార్హం. రాజకీయ చైతన్యానికి జార్ఖండ్ వాసులు మారుపేరని పై సంఘటనలు సోదాహరణంగా తెలియచేస్తున్నాయి.

No comments:

Post a Comment