Breaking News

02/01/2020

కేసీఆర్ అంత సమర్ధత కేటీఆర్ కు ఉంది

హైద్రాబాద్, జనవరి 2, (way2newstv.in)
ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత సీఎం కేటీఆరే అవుతారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు కేటీఆర్ సీఎం అవుతారని మంత్రి వెల్లడించారు. బుధవారం మీడియా ఇష్టాగోష్ఠిలో మరో పదేళ్లు కేసీఆర్ సీఎంగా కొనసాగుతారని స్వయంగా కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఎర్రబెల్లి గురువారం వర్ధన్నపేటలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పురపాలిక ఎన్నికల షెడ్యూల్‌పై కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఓడిపోయేవారంతా ఎన్నికలకు ముందు ఇలాంటి పనులే చేస్తారని, గతంలో పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికల సమయంలోనూ వారి ఇలాంటి పనే చేశారని గుర్తు చేశారు. 
కేసీఆర్ అంత సమర్ధత కేటీఆర్ కు ఉంది

ప్రజలు తమవైపే ఉన్నారని, ఎన్నికల విధానంలో చేసిన తప్పిదాల వల్ల ఓడిపోయినట్లు తర్వాత చెప్తుంటారని ఎద్దేవా చేశారు. పురపాలిక ఎన్నికల్లో వన్ సైడ్ ఎన్నికలు ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.‘కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ కుమార్తె ఇందిర ప్రధాని అయ్యారు. ఇందిర కుమారుడు రాజీవ్ కూడా ప్రధాని అయ్యారు. కేసీఆర్ తర్వాత కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. అందులో తప్పేముంది. అది కేసీఆర్ నిర్ణయిస్తారు. కేటీఆర్ అన్ని తెలిసిన సమర్థుడు. పార్టీని, ప్రభుత్వంలోని కీలక శాఖల బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఆయన నాయకత్వంలోనే మంచి ఫలితాలు వచ్చాయి. మళ్లీ పురపాలక ఎన్నికలు వస్తున్నాయి. మంచి ఫలితాలు రాబడతాం. చంద్రబాబు కుమారుడు లోకేశ్‌లా, రాజీవ్ గాంధీ సోదరుడు రాహుల్‌లా అసమర్థుడు కాదు కేటీఆర్. కేసీఆర్‌కు ఎంత సమర్థత ఉందో కేటీఆర్‌కు అంత సమర్థత ఉంది.’’ అని విలేకరులతో అన్నారు.

No comments:

Post a Comment