ముంబై, డిసెంబర్ 31 (way2newstv.in)
ముఖ్యమంత్రిగా పనిచేసి మళ్లీ అదే రాష్ట్రంలో మంత్రిగా పనిచేయడం అరుదైన విషయం. దేశ రాజకీయాల్లో ఎప్పుడూ చూడని సంఘటన. అయితే తాజాగా మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో అదే రాష్ట్రానికి దాదాపు రెండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అశోక్ చవాన్ మంత్రిగా బాధ్యతలను స్వీకరించడం చర్చనీయాంశమైంది. సాధారణంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత జాతీయ రాజకీయాల వైపు చూస్తారు. లేకుంటే రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి అదే పదవి కోసం వేచి చూస్తారు.మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. శివసేన, బీజేపీలకు స్పష్టమైన మెజారిటీ లభించినప్పటికీ పదవుల పంపకంలో తేడాలొచ్చి శివసేన కూటమి నుంచి బయటకు వచ్చింది. దీంతో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కలసి సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేశాయి.
ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆరుగురు మూడు పార్టీల నుంచి మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. అప్పుడు కూడా అశోక్ చవాన్ కు మంత్రివర్గంలో చోటు దక్కలేదు.తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో అశోక్ చవాన్ కు మంత్రిపదవి దక్కింది. నిజానికి అశోక్ చవాన్ ఈ పదవి తీసుకోకుండా ఉండాల్సిందన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విన్పిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న అశోక్ చవాన్ మహారాష్ట్రలో 2008 నుంచి 2010 వరకూ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే అశోక్ చవాన్ ఆదర్శ్ కుంభకోణంలో ఇరుక్కున్నారు. దీంతో ముఖ్యమంత్రి పదవి నుంచి బలవంతంగా దిగాల్సి వచ్చింది.అయితే 2014లో అధికారంలోకి కాంగ్రెస్ రాకపోవడంతో అశోక్ చవాన్ పార్టీ కోసం పనిచేశారు. అశోక్ చవాన్ మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా కూడా 2015 నుంచి పనిచేశారు. గత ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోవడంతో పీసీసీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు మంత్రిగా అశోక్ చవాన్ బాధ్యతలను చేపట్టడంతో ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక రాష్ట్రంలో మళ్లీ మంత్రి పదవి చేపట్టడం అరుదైన విషయంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది అవమానకరమేనని, అయితే రాజకీయాల అవసరం కోసం ఆయనకు తప్పలేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి
No comments:
Post a Comment