ముంబై, డిసెంబర్ 31 (way2newstv.in)
శరద్ పవార్ చివరకు తన కుమారుడు సమానుడైన అజిత్ పవార్ కు జై కొట్టారు. మహారాష్ట్రలో డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు. తొలి నుంచి అజిత్ పవార్ కే శరద్ పవార్ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని భావించినా మధ్యలో అనుమానాలు తలెత్తాయి. దాదాపు ఇరవై రోజుల క్రితమే ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేసిన రోజునే అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది.అయితే పార్టీలో చర్చించిన తర్వాతనే అజిత్ పవార్ పై శరద్ పవార్ నిర్ణయం తీసుకుంటానని చెప్పడంతో అప్పట్లో సాధ్యం కాలేదు. నిజానికి అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పార్టీలోని కొందరికి రుచించలేదు. ముఖ్యంగా శరద్ పవార్ కుమార్తె, పార్లమెంటు సభ్యురాలు సుప్రియా సూలె సయితం అభ్యంతరం వ్యక్తం చేశారు.
అజిత్ పవార్ కు మళ్లీ పదవి
దీంతో అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కనట్లేనన్న ఊహాగానాలు విన్పించాయి. అర్థరాత్రి మహారాష్ట్ర రాజకీయాలను మార్చేసిన ఘనత అజిత్ పవార్ ది. మూడు రోజుల పాటు గతంలో డిప్యూటీ సీఎంగా ఫడ్నవిస్ ప్రభుత్వంలో వ్యవహరించారు. తనతో దాదాపు ముప్ఫయి మంది ఎమ్మెల్యేలు వస్తారని అజిత్ పవార్ బాహాటంగానే చెప్పారు. అయితే శరద్ పవార్ సకాలంలో దిద్దుబాటు చర్యలు తీసుకోవడంతో ఏ ఒక్క ఎమ్మెల్యే అజిత్ పవార్ వైపు రాలేదు. దీంతో అజిత్ పవార్ తిరిగి ఎన్సీపీ గూటికి చేరారు. అయితే ఆయనకు ఈసారి పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కుతుందా? లేదా? అన్న సందేహాలు అందరిలోనూ కలిగాయి.కానీ మెజారిటీ ఎన్సీపీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వైపే మొగ్గు చూపారు. భవిష్యత్తులో పార్టీలోనూ, కూటమిలోనూ ఇబ్బందులు తలెత్తకుండా తన కుటుంబానికి చెందిన అజిత్ పవార్ ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా శరద్ పవార్ చేశారంటున్నారు. మరోవైపు ఉద్ధవ్ ధాక్రే కూడా తన తనయుడు ఆదిత్య థాక్రేను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అజిత్ పవార్ ను అధికారానికి దూరంగా ఉంచితేనే ప్రమాదమని గ్రహించి శరద్ పవార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అజిత్ పవార్ ఒక నెలరోజుల్లో రెండోసారి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
No comments:
Post a Comment