మహబూబ్ నగర్, డిసెంబర్ 31 (way2newstv.in)
మహబూబ్ నగర్ జిల్లా సరళా సాగర్ ప్రాజెక్టుకు గండీ పడింది. కొత్తకోట ప్రాంతంలో కరకట్ట తెగిపోవడంతో నీరంతా పెద్ద మొత్తంలో బయటకు పోతోంది. దాదాపు పదేళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తిగా నిండిందని స్థానికులు తెలిపారు. గండీ నేపథ్యంలో సమీప ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఆటోమేటిక్‌గా గేట్లు తెరుచుకొనే సైఫన్ సిస్టమ్ ఈ జలాశయానికి ప్రత్యేకతగా ఉంది. కాగా, నీటి మట్టం పూర్తి స్థాయిలో ఉన్నా గేట్లు ఆటోమేటిక్‌గా తెరుచుకోకపోవడంతో ఈ సమస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది.
సరళా సాగర్ ప్రాజెక్టుకు గండీ
గండీ పడడంతో జలాశయంలో ఉన్న దాదాపు అర టీఎంసీ నీరు దిగువకు తరలిపోతోంది.ఆసియాలోనే ఆటోమేటిక్ గేట్ల వ్యవస్థ ఈ ప్రాజెక్టుకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతంలో కరకట్ట నుంచి పలు చోట్ల లీకేజీలు గుర్తించినా అధికారులు పట్టించుకోలేదని దీని ఆయకట్టు రైతులు వెల్లడించారు. ఘటనా స్థలానికి వ్యవసాయ మంత్రితోపాటు, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చేరుకొని పరిశీలిస్తున్నారు. నీరు ఉవ్వెత్తున బయటకు పోతుండడంతో ఇప్పుడు కరకట్టకు మరమ్మతులు చేయలేని పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తోంది. జలాశయంలోని నీరంతా బయటకు పోయాక, కరకట్ట పునర్నిర్మాణం చేపట్టే అవకాశముందని అధికారులు తెలిపారు.ఈ ప్రాజెక్టు కింద 10 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. తాజాగా గండీ పడి నీరంతా బయటకు పోతుండడంతో ఇక తమకు సాగునీరు ఇబ్బందవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత జలాశయం నిండుకుండలా మారడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. కానీ, కరకట్టకు గండీ పడడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment