కాకినాడ, డిసెంబర్ 16 (way2newstv.in):
రాజకీయాల్లో ఉన్న నాయకులకు పదవులు లేకపోతే.. అల్లాడిపోతారనే విషయం మరోసారి నిరూపితమైంది. తూర్పు గోదావరికి చెందిన మాజీ టీడీపీ నాయకుడు తోట త్రిమూర్తులు మూడు మాసాల కిందట వైసీపీ లో చేరిపోయారు. కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న తోట త్రిమూర్తులు టీడీపీలో ఉన్న సమయం లో దూకుడుగా ఉండేవారు. ఈ క్రమంలోనే ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇక, పార్టీలో ఉన్న సమయంలో ఏదైనా పదవి ఇస్తారని ఆయన అనుకున్నారు. అయితే, గత ప్రభుత్వంలో చంద్రబాబు ఆయనకు ఎలాంటి పదవిని ఇవ్వలేదు.దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన తోట త్రిమూర్తులు ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత నేరుగా వచ్చి వైసీపీలో చేరిపోయారు.
తోట త్రిమూర్తులు...అటు ఇటు కాక...
దీని వెనుక కొంత బ్యాక్‌గ్రౌండ్ ఉంది. తాను టీడీపీలో ఉంటే నష్టమే తప్ప లాభం లేదని భావించడంతోపాటు.. ఎలాగూ తన వియ్యంకుడు సామినేని ఉదయభాను వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న నేపథ్యంలో ఆయన ద్వారా అయినా తూర్పు గోదావరిలో ఏదైనా పదవిని పట్టేసి.. కొంత మేరకు చక్రం తిప్పాలని అనుకున్నాడు. ఇలా ముందస్తు వ్యూహంతో తోట అడుగులు వేశారు.అయితే, ఇప్పటి వరకు కూడా జగన్ తోట త్రిమూర్తులును పట్టించుకోలేదు. దీనికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పటికే పార్టీలో ఉండి, పార్టీ ఓడి, ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్ల కాలంలో పార్టీని అన్ని విధాలా ముందుకు దీసుకువెళ్లి, తనకు అండగా నిలిచిన వారికి జగన్ ఇంకా న్యాయం చేయాల్సి ఉంది. కొంత మందికి కీలక పదవులు ఇచ్చినా.. ఇంకా చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో అందునా పార్టీ గెలిచిన తర్వాత వచ్చి పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం జగన్ సుతరామూ ఇష్టం లేదు. ఈ నేపథ్యంలోనే తోట త్రిమూర్తులు సహా పలువురు నాయకులను ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా తోట త్రిమూర్తులు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయాక ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు.కానీ, తోట త్రిమూర్తులు మాత్రం పదవి కోసం వెంపర్లాడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా వైసీపీ పగ్గాలు ఇవ్వాలని కోరుతున్నారు. దీనికి తోడు వియ్యంకుడు సామినేని ఉదయభాను కూడా ప్రయత్నిస్తున్నారు. కాపు సామాజిక వర్గంలో మంచి ఊపు చూపిస్తున్నారని, ఆయన పదవి ఇవ్వడం పార్టీకి కూడా అవసరమని అంటున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు పదవి ఇచ్చే వ్యూహం జగన్ దగ్గరలేదనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. తోట త్రిమూర్తులుకు మరో యేడాది.. రెండేళ్ల వరకు వైసీపీలో పదవి రాదనే అంటున్నారు.దీనికి కూడా మరో కారణం ఉంది. తోట త్రిమూర్తులు నియోజకవర్గం అయిన రామచంద్రాపురంలో పార్టీని గెలిపించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఉన్నారు. మరోపక్క, మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి కీలక నాయకులు ఉన్నారు. ఒకే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతల్లో ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో ఇప్పుడు అదే నియోజకవర్గంలో మూడో వ్యక్తికి పదవి ఎందుకన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. దీంతో తోట త్రిమూర్తులు కల ఇప్పట్లో నెరవేరే పరిస్థితి లేదన్నది పరిశీలకులు చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
No comments:
Post a Comment