Breaking News

16/12/2019

సోషల్ మీడియాతో సాయం...

తెలంగాణ పోలీస్ పై అదిరేటి రివ్యూ
కరీంనగర్, డిసెంబర్ 16 (way2newstv.in):
ఇంటర్నెట్‌లో గూగుల్ రివ్యూలు షాపులు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు వంటి వాణిజ్య సంస్థలకు ఉంటాయి. కానీ మీరెప్పుడైనా పోలీస్ స్టేషన్‌కు రివ్యూ ఉండడం చూశారా? కానీ, ఏపీకి చెందిన ఓ వ్యక్తి తెలంగాణకు చెందిన ఓ పోలీస్ స్టేషన్‌పై గూగుల్‌లో రివ్యూ రాశాడు. అతను రాసిన గూగుల్ రివ్యూ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా ఏదైనా హోటల్‌కి వెళ్తేనో.. ఏదైనా పర్యటక ప్రదేశానికి వెళ్తేనో కొందరు గూగుల్‌లో రివ్యూ రాస్తారు. కానీ పోలీస్ స్టేషన్‌పై రాయడం ఇంత వరకూ జరగలేదు. ఇంతకీ ఏ పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా? అది తెలంగాణలోని వేములవాడ పోలీస్ స్టేషన్.
సోషల్ మీడియాతో సాయం...

హైదరాబాద్‌లో నివసించే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు ఇటీవల కుటుంబంతో కలిసి కారులో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకి, దేవుడి దర్శనం కోసం వెళ్ళాడు. అక్కడ దర్శనం ముగించుకొని రాత్రి హైదరాబాద్‌కు వచ్చే క్రమంలో శ్రీనివాస్‌కు వేములవాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇతని కారును రాంగ్ రూట్‌లో వస్తున్న మరో కారు ఢీకొంది. ఆ ఘటనలో ఎదుటి వ్యక్తి వాహనం ధ్వంసమయ్యింది. దీంతో రాంగ్ రూట్‌లో వచ్చిన వ్యక్తి శ్రీనివాస్‌పై దాడికి దిగాడు. అంతేకాక కుటుంబసభ్యులను దూషించాడు. ఏం చేయాలో తెలియక రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేకి సోషల్ మీడియాలో ఓ మెసేజ్ చేశాడు. వెంటనే జిల్లా ఎస్పీ ఆదేశించడంతో, వేములవాడ పోలీసులు తక్షణం ఈ ఘటనపై చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఘటన మొత్తాన్ని ఆ యువకుడు గూగుల్‌ రివ్యూలో ఈ విధంగా రాశాడు.సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వేములవాడ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యాను. అనుకోకుండా జరిగిన ఓ ఘటనలో గుడి బయట నా కారుకు రాంగ్ రూట్‌లో వస్తున్న మరో కారు ఢీకొంది. రెండు కార్లకూ నష్టం జరిగింది. తప్పు అతనిదే అయినా ఆ యజమాని లోకల్ అయి ఉండటంతో నాపై వ్యక్తిగతంగా దాడి చేయటానికి ప్రయత్నించి బెదిరించాడు. నాపై అప్పటికే చేయి చేసుకున్నాడు. నా కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. తప్పేం లేకున్నా డబ్బులు కట్టమంటూ దూషిస్తుండటమే కాకుండా నా తండ్రిపైనా చేయి చేసుకోవటం మొదలు పెట్టాడు. అనేకరకాలుగా దౌర్జన్యం చేస్తూ నా కారు తాళాలు లాక్కున్నాడు.’’‘‘నేను వెంటనే జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సొషల్ మీడియాలో ఉన్నట్టు తెలుసుకొని ఒక మెసేజ్ పెట్టాను. కానీ అప్పటికే నా భార్య భయంతో 100 కి కాల్ చేసి ఉండటంతో లోకల్ పోలీసులు ఒక 5 నిమిషాల్లో చేరుకొని వెంటనే ట్రాఫిక్‌ని సరి చేసి నన్ను, అతన్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. అతను లోకల్ కావటంతో అతనితో పోలీసులు క్లోజ్‌‌గా మాట్లాడటం గమనించాను. నేను ఆంధ్ర ప్రాంతం వాడిని అని తెలిస్తే వదలరేమో అనుకున్నా. నేను అంతకుముందే 40 నిమిషాల ముందు సోషల్ మీడియాలో చేసిన మెసేజ్‌కి ఎస్పీ రాహుల్ హెగ్డే నుంచి రిప్లై వచ్చింది. లోకల్ పోలీసులను ఆదేశించానని, ఏం జరిగిందో తెలుసుకొని దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటారని టెన్షన్ పడొద్దని చెప్పారు. ఇంకా సహాయం కావాలంటే కాల్ చేయమని నెంబర్ ఇచ్చారు.’’వెంటనే ఆ స్టేషన్ సీఐ నుంచి పిలుపొచ్చింది. జరిగిన విషయం చెప్పగానే అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ చూసుకొని జరిగిన సంగతి విచారించుకొని అతనిపై కేసు బుక్ చేయాల్సిందిగా సీఐ ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా పోలీసుల పని తీరు చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది. టెక్నాలజీ సహాయంతో నిజ నిర్ధారణ కోసం జరిగిన ప్రక్రియంతా టకా టకా జరిగిపోయింది. వేములవాడ సీఐ రెస్పాన్స్ అయితే చాలా వేగంగా ఉంది. పోలీసులు ఇంత వేగంగా స్పందించి నాలాంటి సామాన్యులకు కూడా సకాలంలో స్పందిస్తారని అసలు ఊహించలేదు." అని శ్రీనివాస్ గూగుల్‌లో తన అనుభవాన్ని రాసుకొచ్చాడు. శ్రీనివాస్ రాసిన ఈ రివ్యూ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

No comments:

Post a Comment