Breaking News

16/12/2019

బాలయ్య ఎమ్మెల్యేలు... జంప్పేనా

విజయవాడ, డిసెంబర్ 16 (way2newstv.in):
బాలకృష్ణకు తన తండ్రి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఎంత పట్టు ఉందో తెలియదు కానీ అక్కడక్కడ ఒకటి రెండు టికెట్లు మాత్రం ఆయన చలవతో దక్కించుకున్న వారు ఉన్నారు. అలాగని వారంతా బాలకృష్ణకి పూర్తి విధేయులుగా ఉండాలని లేదు. ఆయా సందర్భాలలో ఒక చోట పని జరగకపోతే రెండవ మార్గం నుంచి నరుక్కురావడం అన్న మాట. ఎలా టికెట్ తెచ్చుకున్నా వీరంతా సరైన సమయంలో మాత్రం జై బాబు అంటారు తప్ప బాలకృష్ణ కోసం నిలబడరు, అలా బాలకృష్ణ కూడా వారిని తన వర్గంగా చూపించుకునేంతగా రాజకీయ చాతుర్యం ప్రదర్శించినదీ లేదు.విశాఖలో సారా వ్యాపారం చేసుకునే వెలగపూడి రామకృష్ణబాబు బాలకృష్ణ ఫ్యాన్స్ తరఫున కూడా చురుగ్గా ఉండేవారు. 
 బాలయ్య ఎమ్మెల్యేలు... జంప్పేనా

అలా ఆయనకు కూడా రాజకీయ మీద ఆశ పుట్టింది. 2009లో నియోజకవర్గాలు పెరిగినపుడు ఆయన విశాఖ తూర్పు సీటు కోసం బాలకృష్ణని ఆశ్రయించారు. బాలయ్య సైతం తన అభిమాన సంఘాల నేతగా గుర్తించి పట్టుబట్టి టికెట్ బాబు నుంచి ఇప్పించారు. ఇపుడు వెలగపూడి బాబుకు బాగా సన్నిహితంగా ఉంటారు. బాలకృష్ణ అంటే అభిమానం ఉంది కానీ బాబుని కాదని బయటకు వచ్చేంతగా ఏమీ లేదు. దాంతో బాలయ్య మనిషిగా చొక్కాలు చింపుకునేంతగా వీరాభిమానం చూపించే సీన్ ఎపుడూ లేదు. చంద్రబాబు మళ్ళీ సీఎం కావాలని, ఆ తరువాత పార్టీ వారసత్వం లోకేష్ కి రావాలని వాదించే వారిలో ముందు వరసలో వెలగపూడి ఉంటారు.ఇక బాలయ్యకు మంచి మిత్రుడు, సన్నిహితుడు అని పేరు పడిన కదిరి బాబూరావు విషయానికి వస్తే ఆయనకు నాలుగు సార్లు బాలకృష్ణ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు. ఆయన 2004, 2009 ఎన్నికల్లో కనిగిరి నుంచి పోటీ చేశారు. ఒకసారి ఓడిపోతే రెండవసారి సాంకేతిక కారణాల వల్ల నామినేషన్ తిరస్కరించారు. ఇక 2014లో మాత్రం కనిగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో కనిగిరి టికెట్ ఆశించినా కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన ఉగ్ర నరసింహారెడ్డికి టికెట్ ఇవ్వడంతో దర్శి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నాటి నుంచి ఆయన పార్టీ మారుతారని గట్టిగా వినిపిస్తోంది.తనకు కనిగిరి టికెట్ ఇస్తే కచ్చితంగా గెలిచేవాడినని బాబూరావు భావన. బాబు అలా చేయకుండా దర్శి పంపించి తనకు కోరి ఓటమి తెచ్చారని బాబూరావు తెగ బాధపడుతున్నారు. ఇక ఇపుడు చూస్తే సొంత సీట్లో తాజాగా పోటీ చేసిన ఉగ్ర నరసింహారెడ్డి రెడీగా ఉన్నారు. ఆయనే ఇంచార్జి, ఇక దర్శిలో మాజీ మంత్రి శిద్ధా రాఘవరావుకు ఇంచార్జి బాధ్యతలు బాబు అప్పగించేశారు. దీంతో రెండిటికీ చెడిన రేవడి అయిన బాబూరావు టీడీపీలో ఉంటే లాభం లేదని చాలాకాలంగా ఆలోచిస్తున్నారుట. దాంతో ఆయన వైసీపీలో చేరేందుకు జిల్లా మంత్రితో సహా పెద్దలకు టచ్ లో కి వెళ్ళినట్లుగా చెప్పుకుంటున్నారు. ఆయన్ని బీజేపీ కూడా అహ్వానిస్తూండగా మనసు మాత్రం వైసీపీ అంటోందట. తొందరలోనే జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని అంటున్నారు. మరి అదే కనుక జరిగితే బాలకృష్ణ మిత్రుడు, నాలుగు సార్లు టికెట్ సిఫార్స్ చేయించుకున్న బాబూరావు పార్టీకి, బాలయ్యకు కూడా దూరం అయినట్లే మరి.

No comments:

Post a Comment