విజయవాడ, డిసెంబర్ 3, (way2newstv.in)
ఇంఛార్జితో ఎపుడూ ఇరకాటమే. ఎందుకంటే అతను ఫుల్ ఛార్జి కాదు కాబట్టి. ఆయనని మెప్పించడం ఆయా జిల్లాల పార్టీ నేతల పని. ఇక ఇంఛార్జిలు అంటే ఒక విధంగా అధినాయకత్వం దూతలుగా భావించాలి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇంఛార్జి మంత్రులు ఆయా జిల్లాల పరిస్థితి బాబుకు నేరుగానే చెబుతూ వచ్చేవారు. ఓ విధంగా వారు అందించిన కీలక సమాచారం ఆధారంగానే పార్టీలో, సర్కారులో మార్పులు చేర్పులు జరిగేవి. ఇక జగన్ పాలనలో కూడా ఇంఛార్జి మంత్రులు వచ్చారు. మొదట నియమించిన వారు కనీసం రెండు నెలలు కూడా కాకుండానే దిగిపోయారు. ఇపుడు అన్ని విధాలుగా అవగాహన వచ్చాక జగన్ ప్రతీ జిల్లా చూసి మరీ తన సన్నిహిత మంత్రులను ఇంఛార్జిలుగా పంపారు. ఆ విధంగా చూసుకుంటే ఇంఛార్జిలు ఇచ్చే సందేశంపైనే జగన్ సైతం ఏమైనా చర్యలు ఆయా జిల్లాల్లో తీసుకుంటారన్న మాట. ఓ విధంగా కళ్ళూ చెవులూ ఇంఛార్జిమంత్రులేనన్నమాట.
సన్నిహిత మంత్రులపైనే జగన్ ఆశలు
ఉత్తరాంధ్రలో నియమితులైన ఇంఛార్జి మంత్రులు ముగ్గురూ గట్టివారే. వాగ్ధాటి బాగా ఉన్నవారే. సర్కార్ ని ఎప్పటికపుడు కాసుకుంటే విపక్షంపై నిప్పులు చెరిగేవారే. వీరిలో ఫైర్ బ్రాండ్ గా శ్రీకాకుళం జిల్లా ఇంచార్జి మంత్రి కొడాలి నానిని మొదట చెప్పుకోవాలి. నాని దూకుడు వేరేలా ఉంటుంది. ఇపుడు ఆయన సిక్కోలులో పార్టీని తనదైన శైలిలో పరుగులు పెట్టించాలనుకుంటున్నారు. ఆయన వస్తూనే జిల్లా మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ ని మెతక మంత్రి అని తేల్చేశారు. ఆయన వల్ల పార్టీ గాడిన పడడంలేదని కూడా ఆయన గమనించారు. దీని మీద ఆయన జగన్ కి చెప్పాల్సింది చెబుతారు అంటున్నారు. అంటే కొడాలి వస్తూనే దాసన్న పదవికి ఎసరు పెట్టేసేలా ఉన్నారని అంటున్నారు.ఇక విజయనగరం జిల్లా ఇంఛార్జి మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయన జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణతో సాన్నిహిత్యం నెరుపుతున్నారు. అదే సమయంలో రెండవ మంత్రి, డిప్యూటీ సీఎం హోదాలో కూడా ఉన్న పుష్ప శ్రీవాణి పనితీరుని గమనిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పుష్ప శ్రీవాణి ఎక్కువగా భర్త పరీక్షిత్ రాజు మీదనే ఆధారపడతారని ప్రచారంలో ఉంది. పైగా ఆమె తన నియోజకవర్గం దాటి ముందుకు రారని కూడా ఆరోపణలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాలు అన్నింటికీ కలిపి ఆమె డిప్యూటీ సీఎం గా రాణిందాలి. సత్తా చాటాలి. అయిదారు జిల్లాల్లో ఉన్న గిరిజనులను ఏకం చేసేలా కార్యచరణ రూపకల్పన చేయాలి. కానీ ఆమెకు సొంత జిల్లాలొనే సీనియర్ ఎమ్మెల్యే రాజన్నదొరతో సఖ్యత లేని పరిస్థితి ఉంది. పైగా దూకుడు రాజకీయం లేదు. శాఖ మీద కూడా పట్టు తక్కువేనట. ఈ విషయం ఇంఛార్జి మంత్రి ద్రుష్టిలో ఉందని అంటున్నారు.ఇక విశాఖ జిల్లా విషయానికి వస్తే ఇంఛార్జి మంత్రి కురసాల కన్నబాబుకు దూకుడు ఉంది. మంచి వాగ్దాటి ఉంది. సబ్జెక్ట్ కూడా ఉంది. అదే సమయంలో జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ కి నోటి దురుసు ఎక్కువని ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు సొంత పార్టీలోనే మద్దతు లేదు, ఇక పెద్ద జిల్లాను ఒక త్రాటిమీద నడిపించే సత్తా కూడా లేదని వైసీపీలోనే విమర్శలు ఉన్నాయి. నిజానికి కన్నబాబు, అవంతి ఇద్దరూ ప్రజారాజ్యం ద్వారా 2009 ఎన్నికల్లో ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ సీనియర్ నేతలే, ఒకే సామాజికవర్గానికి చెందినవారు. దోస్తులు, కానీ విశాఖ జిల్లాలో వైసీపీని పటిష్టం చేయాలంటే జగన్ కి కన్నబాబు తగిన సూచనలు చేయాల్సివుంది. ఆ సమయంలో అవంతి మీద కొన్ని రిమార్కులు తప్పకపోవచ్చు అంటున్నారు. మొత్తానికి ఇంచార్జి మంత్రులు ఏం కొంప ముంచుతారో, ఎవరికి ఎసరు పెడతారోనని ఉత్తరాంధ్రా వైసీపీ మంత్రులు హడలిపోతున్నారుట.
No comments:
Post a Comment