కడప, డిసెంబర్ 3, (way2newstv.in)
సీఎం రమేష్. కడప జిల్లాకు చెందిన కీలక రాజకీయ నాయకుడు. ముఖ్యంగా సుజనా వర్గంలోని నేతగా పేరు తెచ్చుకున్నారు. కడప ఉక్కుకోసం పది రోజులు నిరాహార దీక్ష చేసి ఢిల్లీ స్థాయిలో పేరు గడించారు. టీడీపీ నుంచే ఈయన రాజ్యసభ సీటును తెచ్చుకున్నారు. వారానికి నాలుగు సార్లు మీడియా ముందుకు వచ్చి తన గళం వినిపించేవారు. అయితే ఈ ఏడాది ఎన్నికల తర్వాత ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా ఆయన మీడియా మీటింగులు పెట్టారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే వ్యూహాత్మకం గా సీఎం రమేష్ సైలెంట్ అయిపోయారు.ఎందుకోగానీ ఆయన మీడియా కంటికి కూడా చిక్కడం లేదు. నిజానికి బీజేపీ సీఎం రమేష్‌ను పార్టీలోకి తీసుకోవడం వెనుక ఏపీలో ఎదగాలనేది కీలక నిర్ణయం.
సీఎం రమేష్ మౌనం వెనుక
కొద్ది రోజుల క్రితం వరకు బీజేపీ తరపున కీలకంగా ఉన్న సీఎం రమేష్ కర్ణాటక చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు బీజేపీలోకి వెళ్లేలా కూడా చక్రం తిప్పారు. అయితే ఇప్పుడు సీఎం రమేష్ సెడన్‌గా సైలెంట్ అయిపోయారు. మరోవైపు సుజనా చౌదరి దూకుడు మీదున్నారు. దీనికి కారణం ఏంటి ? అనే చర్చ సీమవర్గాల్లో బలంగా సాగుతోంది.విషయంలోకి వెళ్తే.. తెలుగు గంగ ప్రాజక్టుకు సంబందించి కొన్ని కాంట్రాక్టులు సీఎం రమేష్ నేతృత్వంలోని కంపెనీ చంద్రబాబు హయాంలోనే దక్కించుకుంది. అదే సమయంలో పోలవరంలోనూ కొన్ని పనులను సీఎం రమేష్ కంపెనీ భుజాన వేసుకుంది. అయితే, జగన్ ప్రభుత్వం ఇటీవల వీటిని రద్దు చేసింది. ఈ కాంట్రాక్టుల్లో అవినీతి జరిగిందని, ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని దోచి పెట్టారని ఆరోపిస్తూ.. ఆయా కాంట్రాక్టును రద్దు చేయడంతో సీఎం రమేష్‌కు ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయనేది వాస్తవం.అయితే, ఈ విషయంలో తనకు జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయం కంటే కూడా గతంలోని చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయమే ఎక్కువగా ఉందనేది సీఎం రమేష్ వాదనగా ఉందని అంటున్నారు ఆయన అనుచరులు. గతంలో ఈ కాంట్రాక్టులు తీసుకునేటప్పుడే తాను నిర్ణీత అంశాలపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే, న్యాయ వివాదాలకు ఎలాంటి ఆస్కారం, అవకాశం లేకుండానే తనకు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. అయితే, అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం.. మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా.. నీకెందుకు.. అంతా మేం చూసుకుంటాం.. అంటూ కాంట్రాక్టులు అప్పగించి, ఎన్నికల సమయంలో కడప జిల్లా ఎన్నికల ఖర్చును సీఎం రమేష్‌కు అప్పగించారట.దీంతో కోట్ల రూపాయలను ఆయన ఎన్నికల ఖర్చు కింద పార్టీకి ఫండ్‌గా ఇచ్చారట. అయితే, ఇప్పుడు ఈ నిధులు పూర్తిగా నష్టపోవడం, కాంట్రాక్టులు ఆగిపోవడంతో తల పట్టుకున్న సీఎంరమేష్ దీనికి టీడీపీలో తాను నమ్మిన నాయకులే కారణమని గుస్సాగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తాను ఇప్పుడు జగన్ సర్కారుపై విమర్శలు చేసినా.. టీడీపీకే లాభం చేకూరుతుందని, అలాంటప్పుడు తానెందుకు మాట్లాడాలని అంటున్నారట. సో.. సీఎం రమేష్ మౌనం వెనుక చాలా స్టోరీ ఉందని అంటున్నారు పరిశీలకులు.
No comments:
Post a Comment