Breaking News

13/12/2019

డిసెంబర్ 22న మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ

ముంబై, డిసెంబర్ 13  (way2newstv.in
మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం మధ్య పదవుల పంపకాల పంచాయితీ గురువారం ఓ కొలిక్కి వచ్చింది. మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేసిన రెండు వారాల తర్వాత మంత్రి పదవుల విషయమై మహావికాస్ అఘాడీ కూటమి ఓ అవగాహనకు వచ్చింది. ఉద్దవ్ థాక్రే నాయత్వంలోకి శివసేనకు కీలకమైన హోం శాఖతోపాటు పట్టణాభివృద్ధి శాఖలను కేటాయించారు. ఎన్సీపీకి ఆర్థికం, గృహ నిర్మాణం, కాంగ్రెస్‌ పార్టీకి రెవెన్యూ శాఖను ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 56 శాఖల బాధ్యతలను ప్రస్తుతం ఏడుగురు మంత్రులే చూస్తున్నారు. ఈ బాధ్యతలు కేవలం తాత్కాలికమైనవే కాగా, తర్వలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. దీనికి ముహూర్తం డిసెంబరు 22 లేదా 23 ఖరారు చేసినట్టు తెలుస్తోంది.నాగ్‌పూర్ వేదికగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబరు 16 నుంచి ప్రారంభమై వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. 
డిసెంబర్ 22న మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ

ఇక, కీలకమైన హోం, పట్టణాభివృద్ధి శాఖలను తన వద్దే ఉంచుకోవడానికి ఎన్‌సీపీని ఉద్ధవ్ ఒప్పించడంలో కృతకృత్యులయ్యారు. ఈ రెండు శాఖలను బీజేపీ-శివసేన ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిర్వర్తించగా, ఉద్ధవ్ వీటిని తన పార్టీకి చెందిన మంత్రులకు కట్టబెట్టనున్నారు.శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే గతంలో ప్రజారోగ్యం, ఎంఎస్ఆర్డీసీ బాధ్యతలు నిర్వర్తించగా, ప్రస్తుతం అటవీ- పర్యావరణం, శాసనసభ వ్యవహారాల శాఖను అప్పగించారు. ఆ పార్టీకే చెందిన మరో మంత్రి సుభాష్ దేశాయ్ పరిశ్రమలు, ఉన్నత, సాంకేతిక విద్య, రవాణా శాఖలు కట్టబెట్టారు. ఎన్‌సీపీకి చెందిన జయంత్ పాటిల్‌కు ఆర్థికం, హౌసింగ్, ప్రణాళిక, ప్రజారోగ్యం అండ్ సహకార శాఖలు, చగన్ భుజ్‌బల్‌కు గ్రామీణాభివృద్ధి, జలవనరులు, ఎక్సైజ్ తదితర శాఖలు.. కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ థోరట్‌కు రెవెన్యూ, విద్యుత్, వైద్య విద్య, పాఠశాల విద్య ఇతర శాఖలు.. నితిన్ రౌత్‌కు పబ్లిక్ వర్క్స్, గిరిజనాభివృద్ధి శాఖలను కేటాయించారు.మహావికాస్ అఘాడీ కూటమి నేతలు పలుసార్లు భేటీ అయి క్యాబినెట్ కూర్పుపై చర్చించారని అందులోని ఓ సీనియర్ సభ్యుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసి రెండు వారాలు పూర్తయినా శాఖలను కేటాయించకపోవడంతో ఎమ్మెల్యేలతోపాటు ఉన్నతాధికారులు, పౌరులు ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతున్న గుర్తించారని, దీంతో అధినాయకత్వం రంగంలోకి దిగిందన్నారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత శాఖల కేటాయింపు రెండు వారాల ఆలస్యమవుతుందని ఊహించలేదని ఆయన తెలిపారు. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలు చర్చించి నిర్ణయం తీసుకున్నారని, శాఖలు కేటాయింపు తాత్కాలికమే అయినా మూడు పార్టీలకు సముచిత చోటు దక్కిందని పేర్కొన్నారు.డిప్యూటీ సీఎం పదవి విషయంలో నిర్ణయం తీసుకున్నట్టు ఎన్‌సీపీకి చెందిన మంత్రి వ్యాఖ్యానించారు. స్పీకర్ పదవి కాంగ్రెస్‌కు దక్కితే, డిప్యూటీ సీఎం ఎన్‌సీపీ నుంచి ఉంటారనే ఒప్పందం ఉందని అన్నారు. కాబట్టి అజిత్ పవార్ లేదా జయంత్ పాటిల్ ఎవరో ఒకరు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడతారని వివరించారు.మహావికాస్ అఘాడీలో చీలిక తెచ్చే అవకాశం ఉన్నందున శీతాకాల సమావేశాలు ముగిసేవరకూ క్యాబినెట్ విస్తరణ నిలిపివేయాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో మాదిరిగా తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నించే అవకాశం ఉందని, కాబట్టి తాము అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఒకవేళ అసెంబ్లీ సమావేశాల సమయంలో కొంత మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోతుందని, కాబట్టి ఆ అవకాశం ఇవ్వబోమని అన్నారు. నాగ్‌పూర్ సమావేశాలు ముగిసిన తర్వాతే క్యాబినెట్‌ను విస్తరిస్తారని ఆయన తెలియజేశారు.

No comments:

Post a Comment