Breaking News

29/11/2019

పది లక్షల కోట్ల మార్కెట్ దాటిన రిలయన్స్

ముంబై, నవంబర్ 29  (way2newstv.in)
రికార్డుల రారాజు రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో మైలురాయిని అధిగమించింది. రూ.10 లక్షల కోట్ల మార్కెట్ విలువను దాటిన తొలి భారతీయ సంస్థగా చరిత్ర సృష్టించింది. సరికొత్త శిఖరాలపై కొలువుదీరిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. గురువారం ట్రేడింగ్‌లోనూ లాభాల్లో పరుగులు పెట్టడంతో రిలయన్స్ మార్కెట్ విలువ రికార్డు స్థాయికి చేరింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ లో ఈ బహుళ వ్యాపార దిగ్గజం షేర్ల విలువ మార్కెట్ ముగిసే సమయానికి రూ. 10,01,555.42 కోట్లు (139.8 బిలియన్ డాలర్లు)గా ఉన్నది. ఈ ఘనత సాధించిన మొదటి దేశీయ కంపెనీ రిలయన్సే. దేశీయ ఐటీ రంగ దిగ్గజం టీసీఎస్ రెండో స్థానంలో ఉండగా, దాని మార్కెట్ విలువ రూ.7.80 లక్షల కోట్లుగా ఉన్నది. ఈ ఒక్కరోజే ఆర్‌ఐఎల్ షేర్ విలువ 0.65 శాతం పుంజుకుని రూ.1,579.95 వద్ద స్థిరపడింది. 
పది లక్షల కోట్ల మార్కెట్ దాటిన రిలయన్స్

ఒకానొక దశలో 0.90 శాతం ఎగబాకి మునుపెన్నడూ లేనివిధంగా ఆల్‌టైమ్ హై స్థాయిలో రూ. 1,584ను తాకింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో 0.77 శాతం ఎగిసి రూ.1,582 వద్ద ముగిసింది. గత నెల రిలయన్స్ మార్కెట్ విలువ రూ.9 లక్షల కోట్ల మార్కును దాటిన విషయం తెలిసిందే. ఇది జరిగిన 27 రోజుల్లోనే  మరో లక్ష కోట్ల రూపాయల మార్కెట్ సంపదను పెంచుకుని రూ.10 లక్షల కోట్ల మార్కు ను అధిగమించింది. ఈ ఏడాది ఆగస్టులో స ంస్థ మదుపరుల సంపద రూ.8 లక్షల కోట్లుగా ఉండగా, ఈ ఏడాదిలో ఇప్పటిదాకా రిలయన్స్ షేర్ విలువ దాదాపు 41 శాతం పుంజుకున్నది. ఇదే సమయంలో సెన్సెక్స్ వృద్ధి కేవలం 14 శాతంగానే ఉండటం గమనార్హం.టెలికం, రిటైల్ తదతర కన్జ్యూమర్ ఆధారిత రంగాల్లో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆయా వ్యాపారాల్లో వస్తున్న లాభాలు మదుపరులను ఆర్‌ఐఎల్‌లో పెట్టుబడులకు ఆకర్షిస్తున్నాయని రెలిగేర్ బ్రోకింగ్ వీపీ రిసెర్చ్ అజిత్ మిశ్రా తెలిపారు. చమురు, టెలికం, వస్త్ర, పాదరక్షలు, ఎలక్ట్రానిక్స్, మీడియా, మౌలిక, సోలార్ ఎనర్జీ తదితర రంగాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపారాలు చేస్తున్న సంగతి విదితమే. ఇక భారత్‌లో రిలయన్స్‌తో చమురు వ్యాపారాన్ని చేస్తున్న బ్రిటిష్ పెట్రోలియం మార్కెట్ విలువ కూడా ఆర్‌ఐఎల్‌తో పోల్చితే ప్రస్తుతం తక్కువగానే ఉండటం గమనార్హం. న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్‌లో బీపీ మార్కెట్ విలువ 127.86 బిలియన్ డాలర్ల వద్ద ఉన్నది. రిలయన్స్ కంటే ఇది 12 బిలియన్ డాలర్లు  తక్కువ. రిలయన్స్ జియోతోపాటు సౌదీ ఆరామ్కోకు వాటా విక్రయం ప్రధానంగా మదుపరులను ఆర్‌ఐఎల్ షేర్ల వైపు ఆకర్షిస్తున్నాయని, దీనికితోడు వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) రుణ రహిత సంస్థగా ఎదుగడమే లక్ష్యంగా పెట్టుకోవడం కలిసొస్తున్నదని ఎపిక్ రిసెర్చ్ సీఈవో ముస్తఫా నదీమ్ అన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో రికార్డు స్థాయిలో రూ.11,262 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.10 లక్షల కోట్లలో ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ వాటానే రూ.5 లక్షల కోట్లకుపైగా (70 బిలియన్ డాలర్లు) ఉన్నది. ఆర్‌ఐఎల్‌లో ముకేశ్ కుటుంబానికి 50.05 శాతం వాటా ఉన్నది. దీంతో భారతీయ చరిత్రలో రూ.5 లక్షల కోట్లకుపైగా సంపద కలిగిన ఏకైన కుటుంబం అంబానీలదే అయ్యింది. కాగా, గడిచిన 15 వారాలకుపైగా కాలంలో ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబ వాటా విలువ సుమారు 45 శాతం పెరుగడం విశేషం. గత ఐదేండ్లలో ఆర్‌ఐఎల్ షేర్ విలువ 220 శాతానికిపైగా పుంజుకున్నది. నాడు రూ.493.58గా ఉన్న ఒక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ.. నేడు రూ.1,581 వద్ద కదలాడుతున్నది.

No comments:

Post a Comment