Breaking News

06/09/2019

కోటి 2 లక్షల ఎకరాల్లో సాగు..

హైద్రాబాద్, సెప్టెంబర్ 6, (way2newstv.in)
తెలంగాణలో పంట పొలాలు పచ్చగా కనిపిస్తున్నాయి. భూమికి పచ్చాని రంగేసినట్టు ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖరీఫ్ సీజన్ లో వరి సాగు విస్తీర్ణంలో రికార్డ్ నమోదైంది. పంటల సాగు కోటి ఎకరాలకు మించి సాగైంది. ఖరీఫ్‌లో అన్ని పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు. ఐదో తేదీ నాటికి 1.02 కోట్ల ఎకరాలకు చేరిందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇది సాధారణం కన్నా 2.68లక్షల ఎకరాలు ఎక్కువ. గత ఆరేళ్లలో ఇదే అత్యధికం. రుతుపవనాలు చురుగ్గా ఉండటం, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు బాగా కురవడంతో 2019లో రికార్డు స్థాయిలో వరి నాట్లు పడ్డాయి. ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 24.11 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 26.79 లక్షల ఎకరాలు (111%) సాగు కావడం విశేషం. 
 కోటి 2 లక్షల ఎకరాల్లో సాగు..

పత్తి సాగు విస్తీర్ణం సాధారణం కంటే పెరిగింది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 43.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 45.32 లక్షల ఎకరాలకు (105%) చేరింది. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 12.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 9.46 లక్షల ఎకరాలు (76%) సాగైంది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 9.18 లక్షల ఎకరాలు (88%) సాగైంది.  వనపర్తి, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో సాధారణంకన్నా రెట్టింపు విస్తీర్ణంలో వరి సాగు కావడం విశేషం. వనపర్తి జిల్లాలో సాధారణ విస్తీర్ణం 52వేల 807 ఎకరాలకు ఇప్పటికే లక్షా 10 వేల ఎకరాల్లో నాట్లు వేశారు. ఇది ఇంకా పెరిగే సూచనలున్నాయి. నదుల్లోకి వరద రావడం, చెరువులు నిండటంతో ఇతర పంటలకు బదులు రైతులు అత్యధికంగా వరి నాట్లు వేస్తున్నారని వ్యవసాయ అధికారులు తెలిపారు. సాధారణంగా ఖరీఫ్ లో ప్రకృతి సహకరించక వరి సాగు తగ్గడం కొన్నేళ్లుగా వస్తోంది. ప్రస్తుత సీజన్ లోనూ రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు జూన్ లో ఆలస్యంగా వచ్చాయి. దానికితోడు జులై మూడో వారం దాకా వర్షాలు పడలేదు. అప్పటికి వరి సాగు చాలా తక్కువగా ఉండటంతో ఈ సీజన్ లోనూ నిరాశ తప్పదనుకున్నారు.జులై చివరి నుంచి ప్రారంభమైన వర్షాలతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వారం రోజుల్లో సాధారణంకన్నా 58 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జూన్ ఒకటి నుంచి బుధవారానికి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి తప్ప మిగతా 30 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వరి, పత్తి పెరగడంతో మిగతా పంటల సాగు తగ్గింది. పప్పుధాన్యాలు సాధారణంకన్నా 12, నూనెగింజల పంటల సాగు 23 శాతం తగ్గింది. వందశాతానికి మించి సాగైన పంటలు పత్తి, వరి, రాగులు మాత్రమే. అన్నదాతల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. ఈసారి పంటలు బాగా పండి లాభాలు రావాలని ఆశిస్తున్నారు.

No comments:

Post a Comment