Breaking News

30/10/2019

ఈపీఎస్, ఓపీఎస్ హిట్ అయ్యారే...

చెన్నై, అక్టోబర్ 30   (way2newstv.in)
మునిగిపోతున్న దశలో ఒకరకంగా పట్టు దొరికినట్లే. నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లుతున్న సమయంలో మరోరకంగా విశ్వాసం పెరిగినట్లే. ఇదీ తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పరిస్థితి. జయలలిత మరణించిన తర్వాత అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పటికీ ఏమాత్రం కోలుకోలేని స్థితిలో ఉంది. 2021లో శాసనసభ ఎన్నికలు ఉండటంతో అన్నాడీఎంకే అసలు నిలదొక్కుకుంటుందా? పళనిస్వామి, పన్నీర్ సెల్వం నాయకత్వాన్ని ప్రజలు అంగీకరిస్తారా? అన్న అనుమానాలు బలంగా విన్పించాయి.ఇక ఎన్నికలు దగ్గరపడే సమయంలో పార్టీ క్యాడర్ కూడా వీడిపోయింది. ఎన్ని ఓటములు? లెక్కలేనన్ని…వరసగా జరిగిన అన్ని ఎన్నికల్లో అన్నాడీఎంకేది చెత్త రికార్డు. 
ఈపీఎస్, ఓపీఎస్ హిట్ అయ్యారే...

పార్లమెంటు ఎన్నికల్లో చచ్చీ చెడీ 38 స్థానాలకు ఒక స్థానాన్ని గెలిచింది. అధికారంలో ఉన్న పార్టీకి ఒక్క ఎంపీ సీటు దక్కడంతోనే ఇన్నాళ్లూ అన్నాడీఎంకేకు అండగా ఉన్న బీజేపీ కూడా పక్క చూపులు చూడటం మొదలుపెట్టింది. శాసనసభ ఉప ఎన్నికల్లోనూ ఆశించిన విజయం సాధించలేదు. దాదాపు 20 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కేవలం ఐదింటిని మాత్రమే గెలుచుకుంది. ఇక పార్టీలోనూ అసంతృప్తులు పెరిగిపోయాయి. పన్నీర్ సెల్వం బీజేపీలోకి వెళతారన్న ప్రచారం కూడా జరిగింది.వీటన్నింటి నేపథ్యంలో ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికలు పార్టీతో పాటు నాయకత్వాన్ని బతికించాయనే చెప్పాలి. తాజాగా నాంగునేరి, విక్రంవాడి శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండు సీట్లను అన్నాడీఎంకే సొంతం చేసుకుంది. ఊపు మీద ఉన్న ప్రతిపక్ష డీఎంకే అప్రతిహత విజయాలకు అడ్డుకట్ట వేసింది. ఈ రెండు స్థానాలు అన్నాడీఎంకే కు వస్తాయని ఎవరూ ఊహించలేదు. అయినా సంచలన విజయాలను నమోదు చేసి క్యాడర్ లో ఆత్మస్థయిర్యాన్ని నింపడమే కాకుండా శాసనసభలో తన బలాన్ని పెంచుకుంది.నిన్న మొన్నటి వరకూ శాసనసభలో అన్నాడీఎంకేకు ఉన్న బలం 117 కాగా, ఇప్పుడు దాని బలం 124 కు చేరుకుంది. ఇప్పుడు పళనిస్వామి ధీమాగా ఉన్నారు. తన పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారని భావిస్తున్నారు. అలాగే 2021లో విజయం తమదేనన్న ధీమాతో ఉన్న డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సయితం ఈ రెండు స్థానాల్లో ఓటమితో డీలా పడ్డారు. మొత్తం మీద రెండు పార్టీలూ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నప్పటికీ, ఈ రెండు శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపు అన్నాడీఎంకేను మలుపు తిప్పనుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

No comments:

Post a Comment