వరంగల్, అక్టోబరు 9 (way2newstv.in)
స్టడీ సర్కిళ్ల వ్యవహారం. వీటికి లక్షలు ఖర్చు చేస్తున్నా ఫలితం మాత్రం అంతంతే ఉంటోంది. ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు ఈ స్టడీ సర్కిళ్ల – పనితీరుకు అద్దం పడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఇందుకోసం ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో నిరుద్యోగులకు వీటి ద్వారా శిక్షణ ఇచ్చారు. కాని ఫలితాలను చూసి విస్తు పోవాల్సి వచ్చింది. వందలాది మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తే.. 19 శాతం మాత్రమే ఖాకీ కొలువులు సాధించారంటే వీటి పనితీరు ఎలా అర్థమవుతోంది. ఉద్యోగ నోటిఫికేషన్లు రాగానే హంగామ సృష్టించే స్టడీ సర్కిళ్లు, శిక్షణ కేంద్రాలు ఫలితాల్లో డాబు చూపలేకపోతున్నాయి.
స్టడీ సర్కిళ్లు19 శాతమే కొలువులు
వైఫల్యం ఎక్కడ ఉందో మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే నిరుద్యోగ యువత నష్టపోవాల్సి వస్తోంది.లక్షల రూపాయలు మాత్రం వృథా చేస్తోంది. స్టడీ సర్కిళ్ల కంటే ఇందులోనే నిరుద్యోగ అభ్యర్థుల కోసం అధికంగా వెచ్చించడం గమనార్హం. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ యువజన, క్రీడల శాఖ ఇటువంటి శిక్షణ కార్యక్రమాలను తీసుకోలేదని స్వయంగా ఆ శాఖాధికారులే చెబుతున్నారు. అలాంటప్పుడు వీటిని భుజాన వేసుకోవడంలో ఏదో ఆంతర్యం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణ పేరిట భోజన, స్టడీ మెటీరియల్, ఫ్యాకల్టీ నియామకాల పరంగా ఓ అధికారి కమీషన్ వ్యవహారంతోనే దీంట్లో ఆసక్తి కనబర్చుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఉద్యోగ నియామకాలు అంటేనే పోటీ పరీక్ష.. ఒక్క పోస్టు కోసం వందలాది మంది ప్రయత్నం చేస్తారు. అలాంటి దాంట్లో ప్రతిభ చూపేందుకు పలువురు శిక్షణ సంస్థలకు వెళ్తారు. అయితే శిక్షణ సంస్థల్లో వ్యవహారాలు ఈ విధంగా ఉంటే నిరుద్యోగుల ఆశలు మాత్రం అడియాసలవుతున్నాయి. ప్రభుత్వ కొలువులకు సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందంటే చాలూ స్టడీ సర్కిళ్లు, ఇతర శిక్షణ సంస్థలు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కాజేసేందుకే వ్యవహారాలు సాగిస్తున్నారే తప్పించి నిరుద్యోగులకు మేలు చేయాలన్న తపన ఎక్కడా కనిపించడం లేదు. మండలాలు, దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి శిక్షణ పొందే నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వమే వసతి కల్పిస్తుంది.స్టడీ సర్కిళ్లకు ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చిస్తోంది. 2017–18 సంవత్సరంలో బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణం కోసం రూ.3.75 కోట్లు విడుదలయ్యాయి. బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఈ నిధులు ఖర్చుచేశారు. అయితే ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఏ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినా బీసీ నిరుద్యోగులకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. మరి లోపం ఎక్కడ జరుగుతుందా? అనేది అవగతం కాని ప్రశ్న. నిరుద్యోగ అభ్యర్థుల పరంగా మెరిట్ ఆధారంగానే ఎంపిక జరుగుతుందా.. శిక్షణ కార్యక్రమాలు జరిగేటప్పుడు ఫ్యాకల్టీ నియామకంలో ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తున్నారు. అసలు విషయ నిపుణులైన వారిని నియమిస్తున్నారా.. లేదంటే ఇందులో ఏమైన లోపాయికారికంగా వ్యవహారాలు సాగుతున్నాయా? అనే అనుమానాలు లేకపోలేదు.ఎస్సీ స్టడీ సర్కిల్ అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ సర్కిల్‌లోనూ ఫలితాలు తక్కువగా రావడం వెనక ఎలాంటి కారణాలు ఉన్నాయనే విశ్లేషణ సంక్షేమ శాఖ చేపడుతుందా.. లేదా అన్నది ప్రశ్నార్థకం. జిల్లా అధికారులు వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేదంటే మున్ముందు ఎలాంటి నోటిఫికేషన్లు పడ్డా నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోవాల్సిందే. ఇక ఎస్సీ, బీసీ అభ్యర్థులకు స్టడీ సర్కిళ్లలో శిక్షణ ఇవ్వగా, గిరిజన అభ్యర్థులకు పోలీసు శాఖ పరంగా ఐటీడీఏ నుంచి పోలీసు శిక్షణ కేంద్రం (డీటీసీ)లో ట్రైనింగ్ ఇచ్చారు. అయితే ఇందులోనూ జిల్లా పరంగా ఫలితాలు నామమాత్రంగానే వచ్చినట్లు సమాచారం.జిల్లా యువజన, క్రీడల శాఖ తీరు మరోరకం. ఈ శాఖ అసలు లక్ష్యం జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి యూనిట్ల స్థాపన కోసం బ్యాంక్ లింకేజీతో ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించేందుకు దోహదపడాలి. తద్వారా యువత స్వయం ఉపాధి పొందగలుగుతారు. అదేవిధంగా యువజన సంఘాలను ఏర్పాటు చేసి వివిధ చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. అంతేకాకుండా క్రీడలకు సంబంధించి వ్యవహారాలను పర్యవేక్షించాలి. వీటన్నింటిని కాదని కొత్త బాధ్యతలను నెత్తిన వేసుకుంది. అలా అని ఉన్నవాటిని సమర్థవంతంగా మోస్తుందనుకుంటే పొరపాటే. అసలు లక్ష్యాలు సాధించలేకపోగా, లేని లక్ష్యం కోసం వెంపర్లాడుతున్నట్టు కనబడుతోంది ఈ శాఖ తీరు. అవగాహన లేనిదాంట్లో వేలు పెట్టి సాధించిది ఏమీ లేదు.ఇక భోజన సదుపాయం, స్టడీ మెటీరియల్ కొనుగోలు, ఫ్యాకల్టీ నియామకం, స్నాక్స్, టీ, తదితర ఖర్చులకు సంబంధించి బిల్లులు పెట్టి ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్నారు. దీంట్లో కమీషన్ కోసమే తాపత్రాయపడే అధికారులు అసలు లక్ష్యాన్ని నీరుగార్చుతున్నారు. మరోపక్క శిక్షణ పొందిన అభ్యర్థుల సంఖ్యను హెచ్చుగా చూపడం ద్వారా కూడా తమ స్వార్థ ప్రయోజనాలతో కొంతమంది అధికారులు తమ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు
No comments:
Post a Comment