Breaking News

05/08/2019

ఉపాధిపై అవగాహన సదస్సు

వనపర్తి  ఆగస్టు 03 (way2newstv.in):
ప్రభుత్వం అవలంబిస్తున్న నూతన టెక్నాలజీ, నీటిపారుదల రంగంలో అభివృద్ధి, నూతన పారిశ్రామిక విధానం తదితర సౌకర్యాల వల్ల  రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సాఫ్ట్ వేర్ కు సమాంతరంగా ఇతర రంగాలు కూడా విస్తరిస్తు నందున మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు.శనివారం ఆయన వనపర్తిలోని ఎం.వై.ఎస్ ఫంక్షన్ హాల్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డిగ్రీ చదివిన యువతీ, యువకులకు ఉద్దేశించి ఉద్యోగ ,ఉపాధి అవకాశాలపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
ఉపాధిపై అవగాహన సదస్సు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చి ఏ రాష్ట్రంలో లేనంతగా ఒకేసారి కొత్త పరిశ్రమలకు అత్యధిక అనుమతులు ఇచ్చిన రాష్ట్రంగా పేరు సంపాదించిందని అన్నారు. రాష్ట్రంలో చేపట్టిన ఎత్తిపోతల పథకాల వల్ల వ్యవసాయ, నీటిపారుదల రంగంలో పెను మార్పులు వచ్చాయని, దీని ద్వారా కూడా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెండుగ ఉన్నాయని అన్నారు.యువత ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కోసమే వేచి చూడకుండా వినూత్నంగా ఆలోచించాలని, వారిలో ఉన్న నైపుణ్యాలను రుజువు చేసుకొని, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని పైకి ఎదగాలని చెప్పారు. రాబోయే అవసరాలను ముందుచూపుతో గ్రహించి ప్రభుత్వ, లేదా ప్రైవేట్ రంగంలో స్థిరపడాలని అందుకు పాత పద్ధతిలో కాకుండా కొత్తగా ఆలోచించాలని చెప్పారు. మనిషిలో స్వతంత్రంగా జీవించాలనే కోరిక ఉన్నప్పుడే విజయం సాధ్యమవుతుందని, విదేశాలలో ఇంటర్ విద్యతోనే స్థిర పడుతున్నారని, అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో కూడా వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. నైపుణ్యాల అభివృద్ధి ద్వారా యువతకు మంచి ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ ఆశయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ యువత ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రైవేట్ రంగంలో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కానందున, పోటీని తట్టుకొని నిలబడి రాబోయే సంవత్సరాలను గురించి ఆలోచించి ఏదో ఒక పనిలో స్థిరపడాలని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్మన్  ఆర్ లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ డిగ్రీ విద్యనభ్యసించిన విద్యార్థులు వారిలో ఉన్న సృజనాత్మకతను బయటకు తీయాలని, ముఖ్యంగా చదువుతోపాటు అన్ని విషయాలను నేర్చుకున్నప్పుడు ఏదో ఒక రంగంలో ఉపాధి పొందవచ్చు అని చెప్పారు.

No comments:

Post a Comment