Breaking News

27/08/2019

కరుణించని లక్ష్మి.. (కరీంనగర్)

కరీంనగర్, ఆగస్టు 27 (way2newstv.in - Swamy Naidu): ఆడ పిల్లలకు అండగా ఉండాలన్న ఆశయానికి అలసత్వం ప్రతిబంధకంగా మారింది. క్షేత్రస్థాయి పరిశీలనలో నిర్లక్ష్యం.. నిధుల లేమి.. వెరసి లబ్ధిదారులకు అశనిపాతంలా మారింది. పేద ఆడపడచుల పెళ్లికి ముందే ఆర్థిక సాయం అందించాలన్న ప్రభుత్వ ఉద్దేశం నీరుగారుతోంది. పెళ్లికి ముందు దేవుడెరుగు వివాహం జరిగి ఏడాది గడిచినా సాయం ఎండమావే.. మైనార్టీలకు షాదీ ముబారక్‌, ఇతర వర్గాలకు కల్యాణలక్ష్మీ పథకం అమలు చేస్తుండగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీ, ఈబీసీలు వేల మంది డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నారు. పథకం ఆరంభంలో రూ.51,116 చెక్కు ఇవ్వగా క్రమేణా రూ.75,116కు పెంచారు. గతేడాది రూ.1,00,116కు పెంచగా పేదింట కొండంత అండగా ఉంటుందనుకుంటే యంత్రాంగం నిర్లక్ష్యం వీరి ఆశలపై నీళ్లు చల్లుతోంది.
 కరుణించని లక్ష్మి.. (కరీంనగర్)
పలు దరఖాస్తులకు ఆమోదముద్ర పడినప్పటికీ లబ్ధిదారుల ఖాతాలో జమవడం లేదు. మరికొన్ని తహసీల్దార్ల పరిశీలనలో మూలుగుతున్నాయి. తొలుత ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో పేద ఆడపిల్లల వివాహానికి ప్రభుత్వం కల్యాణలక్ష్మీ, మైనార్టీ కుటుంబాలకు షాదీముబారక్‌ పేరిట ప్రత్యేక పథకాలు ప్రారంభించింది. 2016 ఏప్రిల్‌  నుంచి బీసీ, ఈబీసీలకు వర్తింపజేసిన విషయం తెలిసిందే. కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు ఉన్నవారు అర్హులు.. అయితే గతంలో వివాహమయ్యాకా డబ్బులిచ్చేవారు. ఏడాది క్రితం దరఖాస్తు చేసిన వారందరికీ వివాహం వరకు అందించేలా నిబంధనలు సవరించారు. అయినా సకాలంలో అందడం లేదు. జిల్లాలో కరీంనగర్‌, హుజూరాబాద్‌ రెవెన్యూ డివిజన్లుండగా 4961 దరఖాస్తులు రాగా 2681 పెండింగ్‌లో ఉండటం పనితీరుకు తార్కాణం. గతంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాల లబ్ధిదారులకు ఆయా శాఖల నుంచి నేరుగా డబ్బులు బ్యాంకు ఖాతాల్లో వేసేవారు.. ఈ పద్ధతిలో అక్రమాలు చోటుచేసుకోవడంతో పథక ఉద్దేశం పక్కదారి పట్టింది.. దీంతో పర్యవేక్షణ తీరును పకడ్బందీ చేస్తూ రెవెన్యూ విభాగానికి కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రజలతో నేరుగా రెవెన్యూ శాఖకు సత్సంబంధాలు ఉండటం, గ్రామ, పట్టణవారీగా అర్హులను సులభంగా గుర్తిస్తారన్నది ప్రభుత్వ ఉద్దేశం.. వీరితో పాటు ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేశారు. తహసీల్దార్‌ పరిశీలన అనంతరం ఎమ్మెల్యే ఆమోదముద్ర తదుపరి ఆర్డీవో కార్యాలయంలో జరిగే ప్రక్రియ లాంఛనమే. కానీ తహసీల్దార్‌ స్థాయిలోనే పేరుకుపోవడం గమనార్హం. కుల ధ్రువీకరణ, ఆదాయ, నివాస, కులపెద్ద, గ్రామ కార్యదర్శి గానీ పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరణ, బ్యాంకు ఖాతా పత్రాలతో సహా పెళ్లి రిజిస్ట్రేషన్‌(బీసీలకు మాత్రమే) పత్రాలను జత చేయాలి. దరఖాస్తు చేసుకున్న నిజ ధ్రువీకరణ జీరాక్స్‌ ప్రతులతోపాటు వధూవరుల పెళ్లి చిత్రాన్ని నేరుగా తహసీల్దార్‌ కార్యాలయంలో అందజేయాలి. తహసీల్దార్‌ వాటి పరిశీలన జరిపి ఆయా నియోజకవర్గ శాసనసభ్యుల ఆమోదానికి జాబితాను పంపిస్తారు. ఎమ్మెల్యే ఆమోదం తర్వాత జాబితాను ఆన్‌లైన్‌లో ఆర్డీవో ఆమోదంతో కోశాగార శాఖకు పంపిస్తారు. తదుపరి ఆర్డీవో నుంచి తహసీల్దార్లకు చెక్కులు చేరడం జరిగే ప్రక్రియ.. ఇంత సులువుగా ప్రక్రియ జరగాల్సి ఉండగా ఆడపడుచులకు పెళ్లి రోజున ఇచ్చిన చెక్కుల దాఖలాలు వేళ్లపై లెక్కించొచ్చు. ఏ మండలంలోనూ శతశాతం దరఖాస్తులకు సాయం అందకపోవడం విశేషం. నిధులు లేకపోవడం వల్ల జాప్యం జరుగుతోందని, త్వరలోనే అందరికీ సాయం అందుతుందని రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి.

No comments:

Post a Comment