Breaking News

03/08/2019

పల్లెల్లో ప్రయాణమంటే హడల్

ఆదిలాబాద్‌, ఆగస్టు 3, (way2newstv.in)
అసలే వర్షకాలం... మరో వైపు రహదారులు, వంతెనలు లేక ఇబ్బందులతో పల్లెలకు ప్రయాణించడం పెద్ద సవాల్ గా మారిపోతోంది. జిల్లాల్లో 23 పల్లెలకు వర్షాకాల కష్టాలు ప్రతి ఏటా తప్పడం లేదు..వర్షాకాలంలో మండలంలోని మారుమూల గ్రామాల్లో కష్టాలు తప్పడం లేదు. మండలకేంద్రం నుండి సమారు 12-20 కిలోమీటర్ల దూరంలో గల మారుమూల పల్లెలకు రోడ్లు సక్రమంగా లేక పోవడంతో ఆయా గ్రామాలకు ఎలాంటి వాహనాలు నడవలేని దుస్థితి ఏర్పడుతోంది. కొద్దో గొప్పో ఉన్న రోడ్ల పై వెళదామన్నా వాగులు వంకల్లో నీటి ప్రవాహముతో కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నాగుల్వాయి వాగు పై 2014లో రూ. 7.5 కోట్లతో వంతెన నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ అది ఇప్పటికి పూర్తి కాలేదు. 
ల్లెల్లో ప్రయాణమంటే హడల్

అప్రోచ్‌ రోడ్డు నాసిరకంగా నిర్మించడంతో ఆ రోడ్డు వరదలకు కోత గురై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఫలితంగా వాగు అవతల ఉన్న గ్రామాలు రేచిని, కుశ్నపల్లి, సుస్మీర్‌, సోమిని, మొగవెళ్లి, ఇప్పలగూడ, నాగెపల్లి, గర్రెగూడ, దొడ్డిగూడ, బండల గూడ, తదితర గ్రామాలకు వర్షాకాలంలో మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోతాయి. కుకుడ వాగుపై గత వేసవి కాలం నుండి రూ. 3.5 కోట్లతో వంతెన పనులు చేపడుతున్నప్పటికీ వర్షాకాలం రాగానే పనులు నిలిచి పోయాయి. ఇక ఈ ఏడాది కూడా కుకుడ వాగు కష్టాలు తప్పేట్టుగా లేవని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. కుకుడ, అంబాగట్‌, బూరుగూడ, కోర్తెగూడ, కాసిపేట, కాటెపల్లి తదితర గ్రామలవారు బారెగూడ, సలుగుపల్లి గ్రామలమీదుగా 3 కిలో మీటర్లకు బదులుగా 18 కిలోమీటర్లు ప్రయాణించి బెజ్జూర్‌కు చేరుకోవలసి వస్తోంది. కమ్మర్‌గాం వైపు రహదారికి ఉన్న చిన్న చిన్న వాగులపై వంతెనలు పూర్తయినా మట్టి రోడ్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి. మారుమూల పల్లెలు కమ్మర్‌గాం, గుండెపల్లి, నందిగాం, జిల్లెడ, మొర్లిగూడ గ్రామాల వారికి, తలాయి, తిక్కపల్లి, భీమారం పల్లెలకు బస్సు సౌకర్యం కూడా లేదు. ఆయా గ్రామాల వారికి కాలి నడకే శరణ్యం. అత్యవసర పరిస్థితులు వస్తే అంతే సంగతులు. ఆస్పత్రికి సరైన సమయానికి చేరుకోలేక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పల్లెల్లో రవాణా సౌకర్యాల దృష్ట్యా స్పందించి మారుమూల గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్లు, వంతెనల నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పల్లెవాసులు కోరుతున్నారు

No comments:

Post a Comment