Breaking News

07/08/2019

శ్రీరాంసాగర్ నీటి విడుదలలో రాజకీయాలు

నిజామాబాద్, ఆగస్టు 07, (way2newstv.in)
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి కాకతీయ కాల్వకు నీటిని విడుదల చేసే విషయమై నెలకొన్న వివాదం రాజకీయ రంగు పులుముకుని అంతకంతకూ రాజుకుంటోంది. గత వారం రోజుల నుండి అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఇదే అంశంపై వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. కాకతీయ కాల్వలో మోటార్లు ఏర్పాటు చేసుకుని పంటలు పండించుకుంటున్న నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని 24గ్రామాలకు చెందిన రైతులు లీకేజీ జలాలు వదలాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం సహా వామపక్ష పార్టీలన్నీ రైతులకు మద్దతుగా తమ స్వరాన్ని పెంచాయి.
శ్రీరాంసాగర్ నీటి విడుదలలో రాజకీయాలు

బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, బీజేపీ నాయకుడు పెద్దోళ్ల గంగారెడ్డి, న్యూడెమోక్రసీ నాయకడు వీ.ప్రభాకర్ తదితరులు రైతులతో కలిసి నేరుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడంతో పోలీసులు 15మందిపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, పలువురిని అరెస్టు చేశారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు వెరువకుండా రైతాంగ ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే పనిలో నిమగ్నమయ్యాయి. మాజీ స్పీకర్ కేఆర్.సురేష్‌రెడ్డి ఆయా గ్రామాల రైతు ప్రతినిధులతో భేటీ అవుతూ, పంటల స్థితిగతుల గురించి ఆరా తీశారు. తేదేపా నియోజకవర్గ ఇన్‌చార్జి ఏలేటి మహీపాల్‌రెడ్డి తదితరులు సైతం ఎస్సారెస్పీ నీటి విడుదల కోసం గట్టిగానే తమ గళాన్ని వినిపిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అరవింద్, బస్వా లక్ష్మినర్సయ్య, తెలంగాణ జన సమితి నాయకులు గోపాల్‌శర్మ, ప్రసాద్ తదితరులు కూడా రైతులకు సంఘీభావం తెలుపుతూ ఆందోళనలో పాల్గొనేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. అయితే, రైతులను ప్రతిపక్ష పార్టీల నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కావాలనే రెచ్చగొడుతున్నారని అధికార తెరాస నేతలు ఆక్షేపిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో అరకొర స్థాయిలో 15టీఎంసీల వరకే అందుబాటులో ఉన్న నీటి నిల్వలను తాగునీటి అవసరానికి అట్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని, ఎగువ నుండి వరద జలాలు వచ్చి చేరితే కాల్వకు నీరు విడుదల చేస్తామని శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు తేల్చి చెప్పారు. రైతులు ప్రతిపక్షాల ఉచ్చులో పడవద్దని, రైతాంగ శ్రేయస్సే ధ్యేయంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, వచ్చే రబీ సీజన్ నుండి ఏటా రెండు పంటలకు ఎస్సారెస్పీ ద్వారా సాగునీరందించే ఏర్పాట్లు చేస్తున్నామని హితవు పలికారు. అయితే రైతులు కోరుతున్న మేరకు కేవలం అర టీఎంసీ నుండి ఒక టీఎంసీ నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదంటూ ప్రతిపక్ష పార్టీలు తెరాస సర్కార్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. వర్షాలు సైతం ముఖం చాటేసి కళ్లెదుటే పంటలు ఎండుముఖం పడుతుండడాన్ని గమనిస్తున్న రైతులు కూడా ఎస్సారెస్పీ లీకేజీ జలాల కోసం ఆందోళనలకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే గత నాలుగు రోజుల క్రితం ఎస్‌ఈ కార్యాలయాన్ని ముట్టడించి, జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టిన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే నీటి విడుదల సాధ్యపడదంటూ మంత్రులు కరాఖండీగా తేల్చి చెప్పిన దృష్ట్యా మరింత పెద్దఎత్తున రైతులు ఆందోళనపథంలో పయనించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు ఎస్సారెస్పీ ప్రాజెక్టుతో పాటు ఆయా గ్రామాల్లోనూ కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. బోనాలు పండుగ వేడుకల్లో నిమగ్నమై ఉన్న తరుణంలో ఆదివారం రైతులు ఆందోళన కార్యక్రమాల వైపు దృష్టిసారించనప్పటికీ, మునుముందు కదం తొక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇప్పటికే పలు గ్రామాల్లో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాల గురించి సమాలోచనలు జరుపుకున్నట్టు తెలిసింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎస్సారెస్పీ సహా పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరింపజేశారు.

No comments:

Post a Comment