Breaking News

01/08/2019

అజంఖాన్ కు చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

లక్నో, ఆగస్టు 1, (way2newstv.in
ఆజంఖాన్…. ఆయనను అభ్యంతర ఖాన్ అని పిలవడం సమంజసంగా ఉంటుంది. ఆయన ప్రవర్తన, వ్యవహారశైలి ఎల్లప్పుడూ అభ్యంతరకరంగా ఉంటుంది. నాగరిక ప్రపంచం, సభ్య సమాజం ఆయన వ్యవహారశైలి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా మహిళల పట్ల ఆజంఖాన్ చేసే అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంటాయి. అసలు ఇలాంటి వ్యక్తి ఇంతకాలం రాజకీయాల్లో ఎలా మనగలుగుతున్నారా? అన్న అనుమానాలు కలగకమానవు. ఒక రకంగా ఆజంఖాన్ ను ఇంతకాలం భరించడం పెద్ద విషయంగానే పరిగణించవచ్చు. ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుని ఉండాల్సింది. అందువల్లే అనుచిత వ్యాఖ్యలతో పేట్రేగి పోతున్నారన్నది విమర్శకుల వాదన. దానిని తోసిపుచ్చలేం. ఇకనైనా కఠిన చర్యలు తీసుకోకపోతే ఇదొక అలవాటుగా మారే ప్రమాదం ఉంది.
అజంఖాన్ కు చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

ఇలాంటి నాయకుడు ఇంతకాలం ప్రజాప్రతినిధిగా కొనసాగడమే ఓ వైపరీత్యం. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తమ పార్టీ ఎంపీ ఆజంఖాన్ ను నియంత్రించాల్సింది పోయి ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వెనుకేసుకు రావడం దారుణం. ఆజంఖాన్ వ్యవహారశైలి వల్ల పార్టీ ప్రతిష్ట, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రతిష్ట మంటగలుస్తుంది. ఆజంఖాన్ వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని పరిశీలించినప్పుడు ఇంత దిగజారుడుతనంగా వ్యవహరిస్తారని ఎవరూ అనుకోరు. ఆజంఖాన్ ఏమీ నిరక్షరాస్యుడు కాదు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు కాదు. న్యాయశాస్త్రాన్ని అభ్యసించిన ఉన్నత విద్యావంతుడు. మూడు దశాబ్దాలుగా సమకాలీన రాజకీయాల్లో కొనసాగుతున్న నాయకుడు. ఏడు పదుల వయసున్న వ్యక్తి.ఆజంఖాన్ 1949లో జన్మించారు. అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివారు. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ కు అత్యంత సన్నిహితుడు. జనతా, జనతాదళ్ పార్టీల్లో కొనసాగి ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియజకవర్గం నుంచి ఏకంగా తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో విభేదాల కారణంగా కొంతకాలం సమాజ్ వాదీ పార్టీకి దూరంగా ఉన్నారు. తర్వాత మళ్లీ పార్టీలో చేరారు. గతంలో, ప్రస్తుతం ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలను మననం చేసుకుంటే ఇటువంటి నేత ఇంకా రాజకీయాల్లో ఉన్నారా? అనే ఆవేదన, ఆందోళన, ఆశ్చర్యం కలగక మానదు.తాజాగా ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రమాదేవి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. “మీ కళ్లల్లో కళ్లు పెట్టి చూడాలనుకుంటున్నాను. నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను” అని ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలంరేపాయి. తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, డిప్యూటీ స్పీకర్ పట్ల తనకు ఎనలేని ప్రేమ ఉందని, ఆమె తనకు ప్రియమైన సోదరి వంటి వారని ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదు. ఆయనకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ఈ ఏడాది లో జరిగిన లోక్ సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ తరుపున పోటీ చేసిన తెలుగు సినీనటి జయప్రద పట్ల అనారిగక వ్యాఖ్యలు చేశారు. ఆమె లోదుస్తులు ఖాకీవని పేర్కొనడం మహిళల పట్ల ఆజంఖాన్ వైఖరికి నిదర్శనం. భార్యతో కలసి జీవించలేని వ్యక్తి దేశంతో ఎలా కలసి జీవించగలరని ప్రధాని మోదీని ఉద్దేశించి ఆజంఖాన్ వ్యాఖ్యానించారు. సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ చేసిన పాపాలకు “అల్లా” వారిని శిక్షించారని ఆజంఖాన్ వ్యాఖ్యానించారు. 80వ దశకంలో బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ద్వారా సంజయ్ గాంధీ ముస్లింలను వేధించారని, అయోధ్యలో పూజలకు అంగీకరించడం ద్వారా రాజీవ్ గాంధీ ముస్లింలకు అన్యాయం చేశారని ఆజంఖాన్ విమర్శించారు. దేశం పట్ల కనీస గౌరవం కూడా లేదు. భారత్ ‘మదర్ ఇండియా’ కాదు మంత్రగత్తె అని ఆజంఖాన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆగ్రాలోని తాజామహల్ ను పురావస్తు శాఖ పరిధి నుంచి తప్పించి ముస్లింలకు సంబంధించిన సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ పరిధిలోకి తీసుకురావాలని ఆజంఖాన్ కోరడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కార్గిల్ ను స్వాధీనం చేసుకుంది హిందూ సైనికులు కాదని, ముస్లిం సైనికులని ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెప్పుకుంటూ పోతే ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలకు అంతూపొంతూ ఉండదు. కొత్తకొత్తవి ఎన్నో వెలుగులోకి వస్తాయి.ఆజంఖాన్ వ్యాఖ్యలను ఒక సమాజ్ వాదీ పార్టీ మినహా అన్ని పార్టీలూ ముక్తకంఠంతో ఖండించాయి. తీవ్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఆజంఖాన్ వ్యాఖ్యల పట్ల మహిళ మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీలు తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఆజంఖాన్ తమ ఎదుట హాజరుకావాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని స్పీకర్ ఓం బిర్లా కార్యాలయం ఆదేశించింది. ఎట్టకేలకు ఆజంఖాన్ లోక్ సభలో క్షమాపణ చెప్పారు. మహిళలు, రాజకీయ ప్రత్యర్థులు, ఎన్నికల సంఘం, సైనికులతో పాటు ఎవరినీ విడిచిపెట్టకుండా, అడ్డూ అదుపూ లేకుండా అనాగరిక వ్యాఖ్యలు చేస్తున్న ఆజంఖాన్ నోరును అదుపు చేయాల్సిన అవసరాన్ని ఎవరూ కాదనలేరు. ఇలాంటి నాయకుడిని నియంత్రించకపోతే శిక్షా వ్యవస్థలు విశ్వసనీయతనే కోల్పోయే ప్రమాదం ఉంది. ఇందులో మరో మాట లేదు.

No comments:

Post a Comment