Breaking News

01/08/2019

రాహుల్... నో బ్యాక్ స్టెప్

ఆందోళనలో కాంగ్రెస్ కేడర్
న్యూఢిల్లీ,  ఆగస్టు1, (way2newstv.in)
రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసి కూడా రెండు నెలలు గడుస్తోంది. రాహుల్ రాజీనామాను ఉపసంహరింప చేయడనాకి అనేక ప్రయత్నాలు జరిగాయి. సీనియర్ నేతలందరూ రాహుల్ వద్దకు వెళ్లి మధ్యలో కాడి వదిలేయడం సరికాదని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సోదరి ప్రియాంక గాంధీ సయితం రాహుల్ మనసులో మాటను తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాను రాజీనామాను ఉప సంహరించుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.రెండు నెలలు గడుస్తున్నా జాతీయ పార్టీకి అధ్యక్షుడు అంటూ లేకపోయారు. తాత్కాలిక అధ్యక్షుడిగా మోతీ లాల్ ఓరాను నియమించినా అది కేవలం సర్దుబాటు ప్రయత్నమే. గాంధీ కుటుంబం నుంచి అధ్యక్ష పదవిలో ఎవరూ లేకుంటే పార్టీ బతకదన్నది సీనియర్ నేతల అభిప్రాయం. 
 రాహుల్... నో బ్యాక్ స్టెప్

రాహుల్ గాంధీయే మనసు మార్చుకుని తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాలన్నది సీనియర్ నేతల ఆలోచన. అందుకే సీడబ్ల్యూసీ మీటింగ్ కూడా వాయిదా వేస్తూ వస్తున్నారు.కొంతకాలం సమయం తీసుకుంటే రాహుల్ గాంధీ మనసులో మార్పు వస్తుందేమోనన్నది పార్టీ అగ్రనేతల అభిప్రాయం. అందుకే ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం పెద్దగా ప్రయత్నాలు కూడా చేయడం లేదు. రాహుల్ గాంధీ రాజీనామాతో క్యాడర్ లోనూ నిస్తేజం అలుముకుంది. అనేక రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్ష పదవులకు నేతలు రాజీనామా చేశారు. వీటిని భర్తీ చేయాల్సి ఉంది. కర్ణాటక వంటి రాష్ట్రం పార్టీ కోల్పోవడానికి రాహుల్ గాంధీ రాజీనామా కారణమన్నది సీనియర్ నేతల అభిప్రాయం. ఇంత జరుగుతున్నా రాహుల్ మాత్రం పదవి పై పెదవి విప్పడం లేదు.త్వరలో జార్ఖండ్, హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో పొత్తులు, ప్రచారం వంటివి కీలకంగా మారనున్నాయి. రాహుల్ గాంధీని ఎలాగైనా ఒప్పించి తిరిగి పార్టీ పీఠంపై కూర్చుండబెట్టాలన్నది సీనియర్ నేతల ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి. రాహుల్ మాత్రం ఇప్పటికీ తన రాజీనామాకు కట్టుబడి ఉన్నానని చెబుతున్నారు. పార్టీ పూర్తిగా పతనమయ్యేంతవరకూ రాహుల్ గాంధీ తన ఆలోచనను మార్చుకోరా? అన్న వ్యాఖ్యలు పార్టీలో విన్పిస్తున్నాయి. కొంతకాలం గడిస్తే రాహుల్ మనసు మారుతుందేమో.

No comments:

Post a Comment