Breaking News

06/07/2019

సమస్యలకు నిలయాలు (మహబూబ్ నగర్)

మహబూబ్ నగర్, జూలై 6 (way2newstv.in):
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రంథాలయాల్లో సమస్యలు పేరుకుపోయాయి.. కనీస సౌకర్యాలు కొరవడటంతో పాఠకులకు ఇబ్బందులు తప్పటం లేదు.. ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు కేటాయించకపోవటంతో గ్రామ పంచాయతీలు, పురపాలికల నుంచి వసూలు చేసే గ్రంథాలయ పన్ను ప్రధాన ఆదాయ వనరుగా మారింది. పలు ప్రాంతాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతుండగా మరోపక్క కుర్చీలు, టేబుళ్ల కొరత నెలకొంది. తాగునీటి వసతి, మూత్రశాలలు లేక పాఠకులకు శాపంగా మారింది. ప్రధానంగా సిబ్బంది కొరత వేధిస్తోంది. కొన్నేళ్ల కిందట చేపట్టిన నియామకాలతోనే సరిపెట్టుకుని సాగదీస్తున్నారు. 
సమస్యలకు నిలయాలు (మహబూబ్ నగర్)


ఒక్కో గ్రంథపాలకుడికి అదనపు బాద్యతలున్నాయి. దీంతో పూర్తిస్థాయిలో దృష్టి సారించలేని పరిస్థితి నెలకొంది.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 86 మందికిగాను 24 మంది మాత్రమే ఉద్యోగులు పనిచేస్తున్నట్లు గ్రంథాలయశాఖ అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల్లో కొందరిని తాత్కాలిక పద్ధతిన కొనసాగిస్తున్నారు. ఒక్కో అధికారికి అదనపు బాధ్యతలున్నాయి. దీంతో పని ఒత్తిడి పెరిగిందని వాపోతున్నారు. పుస్తక నిక్షిప్త కేంద్రాల పరిస్థితి అధ్వానంగా మారింది. బీడీసీలకు నెలకు రూ.వేయి చెల్లిస్తుండగా వీటిలో రూ.400 కార్యాలయం అద్దె చెల్లించాలి. రూ.600 నిర్వాహకుల వేతనంగా తీసుకోవాలి. ఇంత చిన్న మొత్తం తమకు చాలటం లేదని బీడీసీల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు విధులకు రాకపోవటంతో కేంద్రాలు మూత పడ్డాయి.జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గ్రంథాలయాన్ని పాత భవనంలో నిర్వహిస్తున్నారు. ఇటిక్యాల, మానవపాడు, అయిజ, మల్దకల్‌, ఉండవల్లి ప్రాంతాల్లో సొంత భవనాలు అవసరం. ఫర్నిచర్‌, పుస్తకాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కోడేరు, వనపర్తిలో సొంత భవనాలున్నా సౌకర్యాలు మెరుగు పర్చాల్సిన అవసరం ఉంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో సొంత భవనంలేదు. అద్దె భవనంలో నిర్వహిస్తుండగా పాఠకులకు ఉపయోగపడేలా సౌకర్యాలు లేవు.  మహబూబ్‌నగర్‌ జిల్లాలో పలు గ్రామాల్లో పంచాయతీ భవనాల్లో, అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. దేవరకద్రలోని గ్రంథాలయం పాత భవనంలోనే కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సిబ్బంది కొరతతోపాటు టేబుళ్లు, కుర్చీలు, పుస్తకాలు అవసరం. తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడంతోపాటు మూత్రశాలలు నిర్మించాల్సిన అవసరం ఉన్నది.

No comments:

Post a Comment