Breaking News

06/07/2019

లాభాల టేకు (కరీంనగర్)

కరీంనగర్, జూలై 6 (way2newstv.in):
ప్రభుత్వం ప్రతష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం పథకంలో భాగంగా ప్రతి నర్సరీలో హెచ్చు మొక్కలు టేకే.. వివిధ రకాల పండ్ల మొక్కలు, పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కలుండగా గరిష్ఠం టేకుకు ప్రాధాన్యతనిచ్చారు. కొన్నేళ్లుగా సాగుతున్న హరితహారం పథకంలో రైతులు తమ పొలాల్లో నాటిన టేకు మొక్కలు 90 శాతం జీవం పోసుకోగా మిగతా రకాల మొక్కల్లో 40 శాతంలోపే బతికాయని అధికారిక గణాంకాలు చాటుతున్నాయి. 
లాభాల టేకు (కరీంనగర్)


ఈ నేపథ్యంలో రైతులు తమ సాగు భూముల్లో, గట్టు వరుసలో టేకు మొక్కలు నాటుకోవడం ఉత్తమం. గట్ల వెంట నాటుకుంటే హద్దు మాదిరిగా ఉండనుండగా 20 నుంచి 25 సంవత్సరాల తరువాత మంచి లాభాలు పొందవచ్చు. సాగుకు అనుకూలంగా లేని, నీటి వసతి తక్కువగా ఉన్న భూముల్లో మొక్కలను పెంచుకోవచ్చు. ఆసక్తి ఉన్న రైతులు ఉపాధి హామీ అధికారులను సంప్రదించి పేరు నమోదు చేసుకుంటే చాలు. సంబంధిత అధికారులే ఉచితంగా మొక్కలను సరఫరా చేస్తారు. జిల్లాలో 3.12 లక్షల ఎకరాలకు పైగా సాగు భూమి ఉండగా 40 వేల ఎకరాల వరకు బీడు భూములున్నట్లు సమాచారం. 16 మండలాలకు గానూ 313 గ్రామ పంచాయతీలున్నాయి. ఉపాధి హామీ ద్వారా మొక్కలు సరఫరా చేయడమే కాకుండా వాటిని నాçడంలోనూ సదరు సిబ్బంది కీలక భూమిక పోషించనున్నారు. గుంతలు తీయడం, మొక్కలను నాటడం వంటి ప్రక్రియను వారే పూర్తి చేయనుండగా ప్రభుత్వం సదరు పనులకు కూలీ కూడా చెల్లించనుంది. అలాగే మొక్కలు నాటిన నుంచి వాటిని సంరక్షించినందుకు ఏడాదికి నిర్వహణ ఖర్చులు చెల్లించనున్నారు. గతంలో ఎరువులు, కలుపుతీత, నీటి తడుల కోసం డబ్బులు చెల్లించేవారు. ప్రస్తుతం 400 మొక్కలు నాటితే అందులో 200 మొక్కలకు నిర్వహణ ఖర్చు కింద రైతులకు డబ్బులు చెల్లిస్తున్నారు. జిల్లాలో మానకొండూరు, తిమ్మాపూర్‌, గంగాధర, చొప్పదండి, హుజూరాబాద్‌, జమ్మికుంట, కరీంనగర్‌ రూరల్‌ మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు ఎకరాల కొద్ది టేకు మొక్కలను నాటారు. పథకం ప్రారంభంలో నాటగా ప్రస్తుతం వాటి వయసు నాలుగేళ్లు.. రైతుల ఆసక్తి పెరుగుతుండటంతో నర్సరీల్లో టేకు మొక్కల సంఖ్యను రెట్టింపు చేశారు. అయితే ఎకరానికి 500 నుంచి 600 మొక్కలను నాటుకోవచ్చని అటవీ రేంజీ అధికారి శ్రీనివాస్‌ వెల్లడించారు. ప్రస్తుతం నేలలో తేమ ఉన్నందున నాటుకోవడానికి అనువని చెబుతున్నారు. నీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో మొక్కలను నాటి వాటి చుట్టు గుండ్రని గుంతలాగా మట్టి తీస్తే పడే వర్షంతో నీరు ఇంకనుంది. రెండేళ్ల వరకు మొక్కలను కాపాడితే తదుపరి వర్షాధారంతోనే వృక్షాలుగా ఎదుగడంతో పాటు రెండు దశాబ్దాల అనంతరం ఎకరాకు రూ.25 నుంచి రూ.30 లక్షల ఆదాయం గడించవచ్చని అధికారులు వివరించారు.

No comments:

Post a Comment