Breaking News

04/06/2019

వ‌ర్షాలు రాగానే కాళేశ్వ‌రం ఉర‌కాలె


జగిత్యాల  జూన్ 4 (way2newstv.in)
వ‌ర్షాకాలం వచ్చేసినందున గోదావ‌రికి వ‌ర‌ద‌పొంగు దృష్టిలో ఉంచుకుని స‌త్వ‌ర చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉదయం జగిత్యాల జిల్లా రాంపూర్‌ చేరుకున్న ఆయన ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పంప్‌హౌస్‌ను పరిశీలించారు. అనంతరం మేడిగడ్డ చేరుకుని వ్యూ పాయింట్‌ నుంచి బ్యారేజీ పనులను పరిశీలించారు. ఈ వర్షాకాలంలో కాళేశ్వరం నీటిని ఎత్తిపోయాలనే లక్ష్యంతో ప్రాజెక్టు పనులను ఆయ‌న‌ పరుగులు పెట్టిస్తున్నారు. మోటర్ల బిగింపు పనుల పురోగతిపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. జులై 15వ తేదీ లోగా పనులు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. 


వ‌ర్షాలు రాగానే కాళేశ్వ‌రం ఉర‌కాలె

రెండు రోజులకు ఒకసారి సమీక్ష చేయాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డినిఆదేశించారు. ప్రారంభోత్సవానికి వస్తానని సీఎం ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ద్వారా ఈ ఏడాది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నింపుతం. జులై నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్‌మానేరుకు, ఎస్సారెస్పీకి నీటి పంపింగ్ జరగాలి. దీనికి అవసరమైన విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చూసుకోవాలి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రెండో పంటకు ఈ ఏడాది నుంచే నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలి. ఎక్కువ మంది సిబ్బందిని నియమించి రేయింబవళ్లు పనిచేసి పనులు పూర్తి చేయాలి. కాళేశ్వరం నీళ్ల కోసం తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. దశాబ్దాల సాగునీటి కష్టాలకు తెరపడుతుందని నమ్మకంతో ఉన్నారు. రైతులకు సాగునీరు అందించడమే ప్రథమ కర్తవ్యంగా ప్రభుత్వం ప్రాజెక్టులు చేపడుతోంది. కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు పాలమూరు - రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామా ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. వీటిలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ముఖ్యమైంది. దాదాపు 80 నియోజకవర్గాలకు సాగు, తాగునీరు, పరిశ్రమలకు నీరందించే బృహత్తర ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి వెంట మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుభాశ్‌రెడ్డి, ఎంపీ సంతోష్, జెడ్పీ చైర్మన్ తుల ఉమ, సీఎంవో స్మితా సబర్వాల్ ఉన్నారు. 

No comments:

Post a Comment