Breaking News

10/06/2019

బతుకు ఈడుస్తున్న హోంగార్డులు


హైద్రాబాద్, జూన్ 10, (way2newstv.in)
హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్‌ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే హోంగార్డు జగదీశ్‌ సీఐ వద్ద డ్రైవర్‌గా పనిచేసేవాడు. తన భార్య 2016లో కేన్సర్‌ బారినపడడంతో సీఐ అనుమతితో సెలవులో వెళ్లి ఆమెను హాస్పిటల్‌లో చేర్పించాడు. ఆమెను చూసుకునేందుకు దగ్గరివాళ్లు ఎవరూ లేకపోవడం, ఆమె అప్పటికే చంటిబిడ్డ తల్లికావడంతో నెలన్నర రోజులు అతడే హాస్పిటల్‌ చుట్టూ తిరిగాడు. భార్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జయ్యాక అతడు డ్యూటీలో చేరేందుకు వెళ్లగా హోంగార్డ్స్‌ ఆర్‌ఐ అభ్యంతరం చెప్పారు. ఇక అప్పటినుంచి ఇప్పటి వరకు హోంగార్డు విభాగంలోని ఉన్నతాధికారులతోపాటు, మంత్రుల చుట్టూ జగదీశ్ తిరుగుతూనే ఉన్నాడు. తనను ఉద్యోగంలో చేర్చుకోవాలని వేడుకుంటున్నా కనికరించిన అధికారి లేరు.జగదీశ్‌లాంటి పరిస్థితినే రాష్ట్రంలో చాలా మంది హోంగార్డులు ఎదుర్కొంటున్నారు. ఇలా ఉద్యోగం నుంచి సస్పెన్షన్‌కు గురైన లేదా రిమూవల్‌ అయిన బాధితులు కోర్టులను, ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి తిరిగి ఉద్యో గాలు లభించేలా ఉత్తర్వులు తెచ్చినా వాటిని ఉన్నతాధికారులు అమలు చేయడం లేదు.గతంలో అనేకసార్లు హోంగార్డులు నిర్వహించిన పోరాటాల ఫలితంగా ఏడాది క్రితం వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. 


బతుకు ఈడుస్తున్న హోంగార్డులు
వేతనాల పెంపు తప్ప మిగతా హామీలేవీ నెరవేరకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19,600 మంది హోంగార్డులు ఉండగా.. వారంతా సివిల్‌, ట్రాఫిక్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌తోపాటు పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వరిస్తున్నారు. పోలీస్‌ శాఖలోని పలువురు ఉన్నతాధికారుల ఇళ్లలోనూ పనిచేస్తున్నారు. హోంగార్డుల్లో చాలా మందికి 10 నుంచి 20 ఏళ్ల సర్వీస్‌ ఉన్నప్పటికీ ఉద్యోగాలు రెగ్యులరైజ్‌ కావడం లేదు. కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న తమకు  కానిస్టేబుళ్లుగా ప్రమోషన్ కల్పించాలని వారు ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదు. కనీసం హోంగార్డుగా ఉద్యోగం చేస్తున్నట్లు వారికి ఇప్పటి వరకు ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వలేదు.ఏ ప్రభుత్వ ఉద్యోగంలోనైనా పెయిడ్‌ లీవ్స్‌ కొన్ని ఉంటాయి. కానీ హోంగార్డులకు ఆ అవకాశం కూడా లేదు. చేసినన్ని రోజులకే జీతం వస్తోందని, తమకు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వడం లేదని, సెలవులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్‌ రాత పరీక్షలకు ప్రిపేరయ్యేందుకు కొందరు సెలవు ఇవ్వాలని కోరినా  మంజూరు చేయకపోవడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏదైనా అత్యవసర పనుల మీదో, కుటుంబ సభ్యుల అనారోగ్య కారణాలతోనో డ్యూటీకి రాలేకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తున్నారని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చాలీచాలని వేతనాలతో అనేక సంవత్సరాలు బతుకులీడ్చిన హోంగార్డులు చాలాసార్లు ఆందోళనకు దిగారు. 2018 ఆగస్టులో సెక్రటేరియట్‌ ముట్టడికి పిలుపునిచ్చారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలని, పదేళ్ల సర్వీసు వున్న వారిని కానిస్టేబుళ్లుగా ప్రమోట్‌ చేయాలని, వేతనాలు పెంచాలని, మహిళా హోంగార్డులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అయితే.. ఆందోళనలో పాల్గొన్న అనేక మందిని ఉద్యోగం నుంచి ప్రభుత్వం తీసేసింది. వీరి ఆందోళన, ఆత్మహత్యయత్నాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీయడంతో స్పందించిన సీఎం కేసీఆర్‌.. 2018, ఏప్రిల్‌లో ప్రగతి భవన్‌లో వారితో సమావేశం నిర్వహించారు. వారి వేతనాన్ని రూ. 12 వేల నుంచి రూ. 21 వేలకు పెంచారు. పెంచిన వేతనాలను తాము ఇవ్వలేమని ఆర్టీసీ, ఎఫ్‌సీఐ సంస్థలు తమ సంస్థల్లో పనిచేసే హోంగార్డులను వెనక్కి పంపాయి. తక్కువ వేతనంతో ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీలకు చెందిన గార్డులను నియమించుకున్నాయి. దాంతో సుమారు 600 మంది హోంగార్డులు రోడ్డునపడ్డారు. వారికి ఎక్కడా డ్యూటీ వేయకపోవడంతో వేతనాలు రాక ఆటోలు నడుపుతూ.. కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఆర్టీఏలో పనిచేస్తున్న హోంగార్డులకు గత మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో అప్పులు చేసి వెళ్లదీస్తున్నారు.

No comments:

Post a Comment