Breaking News

26/06/2019

తెరపైకి హన్మకొండ


వరంగల్, జూన్ 26, (way2newstv.in)
హన్మకొండ.. త్వరలో జిల్లా కేంద్రంగా మారనుందా..? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ప్రస్తుత వరంగల్‌ అర్బన్‌ జిల్లా పేరును హన్మకొండగా మార్చబోతున్నారని సమాచారం. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, తాజా, మాజీ మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌నుకలిసి వినతులు సమర్పించారు. వాటిపై సీఎం సానుకూలంగా స్పందించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ 2016లో వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాలను ఏర్పాటు చేసింది. వీటి ఏర్పాటుపై అప్పట్లోనే ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యా యి. వరంగల్‌ తూర్పు, నర్సంపేట, పరకాల, వర్థన్నపేట ప్రజలు తమకు వరంగల్‌ రాజధానిగా ఉండాలని కోరారు. మరోవైపు రూరల్‌ జిల్లా పరిధిలోని ప్రజలందరికీ వరంగల్‌ నగరంతోనే సంబంధాలున్నాయనేది వారి వాదన. 

తెరపైకి హన్మకొండ

చదువులు, వ్యాపారాలు, వైద్యం, ఇతరత్రా పనుల కోసం వారు నిత్యం వరంగల్‌కే వస్తుంటారు. ఆ నగరం కేంద్రంగా చాలాఏండ్లపాటు వారి జీవనంసాగింది. దీన్ని ఇలాగే కొనసాగించాలని వారు కోరుతున్నారు. రైల్వే స్టేషన్‌, బస్‌ స్టేషన్‌, ఎంజీఎం హాస్పిటల్‌, కేఎమ్‌సీ, ఏనుమాముల మార్కెట్‌ కూడా వరంగల్‌లోనే ఉన్నాయి. ఇక్కడి విమానాశ్రయా న్ని కూడా పునరుద్ధరిస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నది. ఈ నేపథ్యంలో వరంగల్‌ రూరల్‌ జిల్లాకు వరంగల్నే కేంద్రంగా చేయాలంటూ పలువురు ప్రజా ప్రతినిధులు సీఎంను కోరినట్టు తెలిసింది. ఇక్కడి తూర్పు నియోజకవర్గాన్ని కూడా రూరల్‌ జిల్లాలో కలిపటం ద్వారా వరంగల్‌ జిల్లాను సమగ్రంగా ఏర్పాటు చేయాలని వారు కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. వరంగల్‌ మాదిరిగానే హన్మకొండకు కూడా చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఇది కాకతీయుల తొలి రాజధాని. కానీ నేడు హన్మకొండ పేరే కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని అక్కడి మేధావులు, విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈప్రాధాన్యత రీత్యా హన్మకొండ పేరున కూడా ఒక జిల్లా ఉండాలంటూ ఇటీవల సీఎంను కలిసి వారు వివరించారని సమాచారం. అందువల్ల ప్రస్తుత వరంగల్‌అర్బన్‌ జిల్లా పేరు మార్చి.. హన్మకొండ కేంద్రంగా నూతన జిల్లాను ఏర్పాటు చేయాలంటూ వారు విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామంటూ సీఎం వారికి హామీనిచ్చినట్టు అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా జిల్లాల పేర్లు, వాటి భౌగోళిక స్వరూపాన్ని మార్చినప్పటికీ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి మాత్రం యధావిధిగా ఉంటుందని ఆయా వర్గాలు వివరించాయి.

No comments:

Post a Comment