Breaking News

26/06/2019

వడ్డీ వ్యాపారుల దందాతో అల్లాడుతున్న మధ్య తరగతి జనాలు


వరంగల్, జూన్ 26, (way2newstv.in)
చిరువ్యాపారులు, ప్రయివేటు ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులనే లక్ష్యంగా చేసుకుని ఈ నయా దందా సాగుతోంది. జిల్లా కేంద్రంతో పాటు, మండల, గ్రామాల్లోని పలు హోటళ్లు, కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్‌, టీ, టిఫిన్స్‌, ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేస్తున్న వారికి సైతం అప్పులిస్తూ దందా సాగిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పెట్టుబడి లేకుండా నాలుగు పైసలుంటే చాలు వ్యాపారాన్ని మొదలు పెట్టేస్తున్నారని అమాయకు లు వాపోతున్నారు. బినామీ పేర్లతో వ్యాపారాలు గుట్టుగా సాగిస్తున్నట్టు సమాచారం. చెక్కు, ప్రామిసరీ నోట్‌, తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకుంటూ అడిగినకాడికి అప్పులు ఇచ్చేస్తున్నారు. కొన్ని సందర్బాల్లో ఉద్యోగుల ఏటీఎం కార్డులను సైతం తనఖా పెట్టుకొని అప్పులిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. నిత్యం సాయంత్రం వేళల్లో రోజు వారీగా వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లోనూ జోరుగా వడ్డీ వ్యాపారం నడుస్తున్నట్టు తెలుస్తోంది. రూ.10వేలు అప్పు తీసుకునే బాధితుల వద్ద ముందే పదిహేను వందల రూపాయలు తగ్గించి రూ.8500లు ఇస్తున్నారని రుణగ్రహీతలు వాపోతున్నారు. 

వడ్డీ  వ్యాపారుల దందాతో అల్లాడుతున్న మధ్య తరగతి జనాలు

3నెలల్లో అప్పు సొమ్మను వడ్డీతో సహా రోజుకు రూ.100 చొప్పున చెల్లించేలా షరతులు విధిస్తున్నారు. గడువులోగా అప్పు తీర్చకుంటే వడ్డీపై వడ్డీ విధిస్తూ అదనంగా సొమ్ములు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.వడ్డీ వ్యాపారం కొందరికి ఉపాధిగా మారుతోందనే చర్చ జరుగుతోంది. రూ.లక్షల్లో వ్యాపారాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకుండా, రిజిస్ట్రేషన్‌ లేకుండా, ఎలాంటి ఖర్చూ లేకుండా ఇంటి నుంచే యథేచ్ఛగా ఈ దందా సాగిస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే వడ్డీ వ్యాపారం చేసేవారు దాదా పుగా 600మందికి పైగా ఉంటారని తెలుస్తోంది. కొందరు వ్యాపారులు గ్రూపుగా ఏర్పడి రూ.10లక్షల నుంచి రూ.కోటి వరకు కూడా వ్యాపారం సాగిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యాపారం చేసే అవకాశం ఉండడంతో జిల్లాలో రోజురోజుకు వడ్డీ వ్యాపారుల సంఖ్య పెరిగిపోతోంది. బంగారాన్ని తాకట్టు పెట్టుకుని మరీ తక్కువ సొమ్మును అప్పుగా ఇచ్చేస్తున్నారు. ఎలాగైతేనేమీ ప్రజల అత్యవసరాలు తీర్చుకునేందుకు కొందరు గత్యంతరం లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇలా వడ్డీ వ్యాపారుల చేతిలో అమాయకులు బందీగా చిక్కి పోతున్నారు. చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న చిరువ్యాపారులే లక్ష్యంగా వడ్డీ వ్యాపారం దందా సాగుతోంది. జిల్లాలోని పలు చిన్నహోటళ్లు, కిరాణ దుకాణాలు, కూరగాయల మార్కెట్‌లోని చిరు వర్తకులు, టీ, టిఫిన్స్‌, ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేస్తున్న వారికి అప్పులు ఇస్తూ దందా సాగిస్తున్నారు. ప్రామిసరీ నోటీసుపై ఎలాంటి వివరాలు నమోదు చేయకుండానే రెవెన్యూ స్టాంప్‌పై సంతకాలు తీసుకుంటు న్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగానే బలమైన జామీను తీసుకొని అప్పు చెల్లించేలా తరచూ ఒత్తిడి తెస్తున్నారు. కొన్ని సార్లు అప్పు వసూలు చేసే సమయంలో గొడవలకు దారితీసిన సందర్బాలున్నాయి. ఇలాంటి వడ్డీ వ్యాపారుల వల్ల ఎంతో మంది అమాయకులు ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.  ఉదాహరణకు రూ.10వేలు తీసుకున్నట్టైతే ప్రతి వారం రూ.1000 చొప్పున 12వారాలు చెల్లించాలి. లేదంటే అదనంగా రూ.1000 ఇవ్వాల్సిందే. డబ్బులు వసూలు చేసుకోవడానికి ప్రత్యేకంగా కార్డులను అందించారు. అందులో ఎలాంటి చిరునామా, పేర్లు లేవు. ఈ విధంగా నయా దందాకు శ్రీకారం చుట్టారు.

No comments:

Post a Comment