Breaking News

26/06/2019

ఆ ఆరు కాలేజీల్లో మూడు లక్షలపైనే ఫీజు


హైద్రాబాద్, జూన్ 26, (న్యూస్ పల్స్)
రాష్ట్రంలోని ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీ యాజమాన్యాలు ఫీజులను భారీగా పెంచాలని తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ప్రతిపాదించాయి. అత్యధికంగా సీబీఐటీ యాజమాన్యం రూ.3 లక్షలు ఫీజు నిర్ణయించాలని కోరింది. ప్రస్తుతం ఆ కాలేజీ ఫీజు రూ.1,13,500 అమల్లో ఉన్నది. సీబీఐటీ యాజమాన్యం ఏకంగా ఇప్పుడున్న ఫీజు కంటే రూ.1,86,500 అదనంగా పెంచాలని కోరడం గమనార్హం. ఆ తర్వాత విఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌ జ్యోతి కాలేజీ రూ.2.72 లక్షలు కావాలని అడిగింది. ఆ కాలేజీ ఫీజు ప్రస్తుతం రూ.98,500 ఉన్నది. ఎంజీఐటీ రూ.2.30 లక్షలు ప్రతిపాదించాలని విజ్ఞప్తి చేసింది. ఆ కాలేజీ ఫీజు ఇప్పుడు రూ.లక్ష అమలవుతున్నది. ఈ మూడు కాలేజీ యాజమాన్యాలు రూ.2 లక్షలకుపైగా ఫీజులు ఖరారు చేయాలని టీఏఎఫ్‌ఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాయి. వాసవీ ఇంజినీరింగ్‌ కాలేజీ ఫీజు రూ.1,90,000లకు పెంచాలని కోరింది. ప్రస్తుతం ఆ కాలేజీ ఫీజు రూ.97,000 అమలవుతున్నది. శ్రీనిధి కాలేజీ రూ.97,000 నుంచి రూ.1,76,500 పెంచాలని టీఏఎఫ్‌ఆర్సీకి ప్రతిపాదించింది. వర్ధమాన్‌ కాలేజీ రూ.1,05,000 నుంచి రూ.1,89,000లకు ఫీజు పెంచాలని కోరింది. 


ఆ ఆరు కాలేజీల్లో మూడు లక్షలపైనే ఫీజు

గీతాంజలి కాలేజీ యాజమాన్యం రూ.81,000 నుంచి రూ.1,02,000 ఫీజు ఖరారు చేయాలని టీఏఎఫ్‌ఆర్సీకి విజ్ఞప్తి చేసింది. ఇక సివిఆర్‌ కాలేజీ యాజమాన్యం రూ.90,000 ఉంటే రూ.1,40,000 ఇవ్వాలని ప్రతిపాదించింది. గోకరాజు రంగరాజు రూ.95,000 ఉంటే రూ.1,82,000 ఫీజు ఉండాలని కోరింది. కెఎంఐటీ రూ.77,000 ఫీజు ఉంటే రూ.1,33,000లకు పెంచాలని ప్రతిపాదించింది. ఇలా రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీలు 2019-20, 2020-21, 2021-22 విద్యాసంవత్సరాలకు ఫీజులు ఖరారు చేయాలని టీఏఎఫ్‌ఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాయి. అయితే టీఏఎఫ్‌ఆర్సీ చైర్మెన్‌ పోస్టు 11 నెలలుగా ఖాళీగా ఉండడంతో ఫీజులు ఇంకా ఖరారు కాలేదు. టీఏఎఫ్‌ఆర్సీ చైర్మెన్‌ను నియమించకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీన్ని ఆసరాగా చేసుకొని ఆరు ఇంజినీరింగ్‌ కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీన్ని విచారించిన హైకోర్టు టీఏఎఫ్‌ఆర్సీ ఫీజులు ఖరారు చేసే వరకు ఆయా కాలేజీలు ప్రతిపాదించిన ఫీజులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది మిగిలిన ఇంజినీరింగ్‌ కాలేజీ యాజమాన్యాలకు వరంగా మారింది. దీంతో 75 కాలేజీ యాజమాన్యాలు ఫీజులు పెంచాలని హైకోర్టును ఆశ్రయించాయి. ఆరు కాలేజీలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా తమకు చేరలేదని ఉన్నత విద్యామండలి అధికారులు చెప్తున్నారు. హైకోర్టు ఆదేశాలపై అప్పీల్‌కు వెళ్లేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఈనెల 27వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల అంశం ప్రస్తుతం కోర్టులో ఉన్నది. దీంతో వెబ్‌కౌన్సెలింగ్‌ నిర్వహణపై అయోమయం నెలకొంది. వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఉంటుందా? ఉండదా?అన్న చర్చ జరుగుతున్నది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు

No comments:

Post a Comment